Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/711

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

చారిత్రక భౌతికవాదము

ఒక్కొక్కప్పుడు యుద్ధములవలనను, అంతఃకలహముల వలనను, ప్రకృతి విపరిణామముల వలనను ఊహకందనిలు ఇతరహేతువులవలనను నశించుటయు, నాగరిక తాజ్ఞానములు మరల పునాదినుండి పునఃసృష్టి నొందుటయుగూడ జరగుచు వచ్చినది. 'అభావ వైరుధ్య'మను (negation of negation) సూత్రముగూడ గతితార్కిక సిద్ధాంతములలో నొకటిగా ఎంచబడుచున్నది.

పైన పేర్కొనబడిన సూత్రములను క్రిందివిధముగ చరిత్రకు అన్వయముచేసి పరిశీలించుదము :

వివిధదశలలో సమాజము పురోగమించుచున్నది. ఒక దశను పరిశీలించి, దానియొక్క మంచిచెడ్డలను అంచనా వేయవలెనన్నచో, పూర్వదశనుగూర్చి కూలంకషజ్ఞానము కలిగియుండవలెను గదా ! ఆధునిక నాగరికదృష్టితో దర్శించినపుడు బానిసవిధానము నికృష్టమైనదిగ తోచును. కాని ఆదిమ సమాజవ్యవస్థతో పోల్చినపుడు బానిస విధానము అభ్యుదయకరమైనదిగా కన్పట్టగలదు. ఆదిమ సమాజములో మానవునకు వ్యవసాయమన నేమియో తెలియదు. అందుచే ఆహారపదార్థములకొరత హెచ్చుగా నుండెడిది. తత్ఫలితముగ వివిధ తెగలయందు వయోవృద్ధులను, ఆంగ వైకల్యము పొందిన పసికందులను పరిమార్చు దురాచారము గూడ ఆ దశలో నుండెడిదట. కాగా, బానిస విధానములో మానవుడు వ్యవసాయము చేయ నేర్చెను; తా నింత కడుపునకు తిని ఓడినవాడికి ఇంతపెట్టి వానిని బానిసగాచేసి, ఆతనిచే చాకిరి చేయించుకొనుట సాధ్యమయ్యెను. నాగరికతా ప్రాదుర్భావమునకు అత్యంత ప్రధానహేతువైన వ్యవసాయము బానిసవిధానమునందే సాధ్యమగుటచే, ఆదిమసమాజముకంటె బానిససమాజము అభ్యుదయకరమైన వ్యవస్థ యని బోధపడును.

ఉదాహరణమునకు, ఈ యుగములో పెట్టుబడిదారీ విధానమునుండి సామ్యవాదవ్యవస్థ ఆవిర్భవించుచున్నది. మార్క్స్, ఎంగెల్స్ అను ప్రసిద్ధపురుషులు నూరుసంవత్సరములనాడు సమకాలీన ఐరోపా, ఆసియాదేశముల ఆర్థిక, సాంఘిక, రాజకీయ వ్యవస్థలను నిశితముగ పరిశీలించి, పెట్టుబడిదారీ సమాజముయొక్క గమనసూత్రములను అధ్యయనము చేయుటద్వారా, భవిష్యత్పరిణామములనుగూర్చి జోస్యము చెప్పగల్గిరి.

భూస్వామ్యవిధానములో (feudalism) వ్యవసాయము అభివృద్ధియైన ఫలితముగా సమష్టి ఆహార సంపాదనా విధానము అంతరించి. తద్విరుద్ధమైన “పని విభజన విధానము” (distribution of work) వ్యవహారములోనికి వచ్చినది. ఈ విధానము సమాజములో వర్గము లేర్పడుటకు మూలహేతువైనది. కాని పని విభజనము లేనిచో కౌశల్యము, నైపుణ్యము రూపొందజాలవు. ఈ రెండును మృగ్యమైనచో, వ్యవసాయ విధానములో అభ్యుదయము సంభవముకాదు. వ్యవసాయాభివృద్ధి కుంటుపడినచో, మానవ నాగరికత పూజ్యమగును.

వర్గకలహము (class war): నూతనమైన ఉత్పత్తిశక్తులను అభివృద్ధిచేయు వర్గములకును, పాత ఉత్పత్తి సంబంధములనే ఆశ్రయించుకొని, వాటిని భద్రపరచు కొనగోరు వర్గములకును నడుమ సంభవించు సంఘర్షణము 'వర్గకలహ'మనబడు చున్నది. బానిస విధానము ప్రారంభ మైనప్పటినుండి వర్గసంఘర్షణము మొదలైనట్లు చరిత్రవలన బోధపడుచున్నది. గ్రీసు, ఇటలీ దేశములలో క్రీ. పూ. 500 సంవత్సరముల క్రిందట బానిసరాజ్యము లుండినట్లును, అనంతరము బానిసల తిరుగుబాటులవలన ఆ రాజ్యములు అంతరించినట్లును తెలియుచున్నది. నాటినుండి నేటివరకు జరుగుచువచ్చిన చరిత్ర వర్గ కలహోపేతమైన చరిత్ర తప్ప మరియొకటి కాదని కొందరు ప్రముఖ చరిత్రకారులు ఉల్లేఖించి యున్నారు. ఈ చారిత్రక దశలో వర్గకలహము చరిత్ర గమనమునకు చోదక శక్తిగా (driving or motive force) వ్యవహరించినదని కారల్ మార్క్సు యుక్తముగ వ్యాఖ్యానించి యున్నాడు. ఒకదశనుండి మరియొకదశకు సమాజము పరివర్తనము చెందినపుడెల్ల, అది విప్లవమువలననే సాధ్య మైన దని చరిత్ర ధృవపరచుచున్నది. పూంజీ విధానము నుండి సామ్యవాద సమాజము విప్లవమువలననే ఉద్భవించు చున్నదని సమకాలిక చరిత్ర ప్రత్యక్షముగా నిరూపించు చున్నది. పరిమాణాత్మక మైన పరివర్తనములు (quantitative changes) కొంతకాలము జరిగిన పిమ్మట, అవి ఆకస్మికముగ, అత్యంత త్వరితముగ సంభవించు గుణాత్మక మైన పరివర్తనములుగా (qualitative changes) పరిణమించునని తెలుపు గతితార్కిక సిద్ధాంత

651