విజ్ఞానకోశము - 3
చతుర్విధ వాద్యములు
రథములు, గండ్రగొడ్డండ్లు, అన్ని తరహాల ఆయుధములు, భటులవేషములు కాననగును. పాల్నీ దేవాలయములో యుద్ధభటులు తుపాకులను తీసికొని పోవుచున్నట్లును, వారి నడుము పట్టాలకు మువ్వ లున్నట్లును, అందరి కాళ్ళకు పాదరక్షలున్నట్లును, తలలపై విచిత్రమైన టోపీ లున్నట్లును, శిల్పవిగ్రహములు కానవచ్చును. ఇది అత్యంత పురాతనకాల శిల్పము.
మొహెంజాదారోలో ఖననము చేయగా ధనుర్బాణములు, గండ్రగొడ్డళ్లు, బల్లెములు, కటారులు, గదలు, వడిసెలలు, ఉండేళ్లు మొదలగు వస్తువులే దొరకినవి. మొహెంజాదారో అయిదువేల సంవత్సరముల క్రిందట పాడుపడి భూగర్భముపాలైన గొప్ప పట్టణము. అచ్చట దొరకిన వస్తువులు అయిదువేల సంవత్సరముల క్రిందట నిర్మింపబడిన వనుట స్పష్టమగుచున్నది. ఇంక సంశయమునకు తావు లేదుకదా !
ముగింపు : యుద్ధములు సర్వనాశంకరములు. యుద్ధములు మానుటమానవజాతికి శ్రేయస్కరము. అయితే, భూతకాలములో యుద్ధములున్నట్లు ప్రాచీన వాఙ్మయము జాటుచున్నది. వర్తమాన కాలములో యుద్ధములు జరుగుచున్నవనియు, తత్ఫలితములను మన మనుభవించుచున్నామనియు మనకందరకు సువిదితమైన విషయమే. భవిష్యత్కాలములోను యుద్ధములుండగలవు. కావున రాజ్యములు యుద్ధమునకు సర్వసన్నద్ధముగా నుండవలసినదే. యుద్ధములు లేకుండ చేయదలచుట అలవిగాని పని. అదియొక స్వప్నభ్రాంతియే. దుష్టశక్తుల నరికట్టుటకు, స్వధర్మ రక్షణార్థము. దేశస్వాతంత్ర్య పరిరక్షణార్థము యుద్ధము చేయుటయు ఒక ధర్మమే. ఈధర్మ సూత్రము నెరంగియే ప్రాచీనార్యులు బుద్ధిసూక్ష్మతతో పరిపూర్ణయుద్ధ తంత్రకలాపము నిర్మించియుండిది.
ఆ. వీ.
చతుర్విధ వాద్యములు :
శ్లో. తతంచైవావనంద్ధంచ, ఘనం సుషిరమేవచ
చతుర్విధంతు విజ్ఞేయ, మాతోద్యం లక్షణాన్వితం
తతంతంత్రీగతం జ్ఞేయ, మననద్ధంతుపౌష్కరం
ఘనంతాలస్తు విజ్ఞేయః, సుషిరో వంశ ఉచ్యతే.
-భో, నా
తతములు, సుషిరములు, అవనద్ధములు, ఘనములు అని వాద్యములు నాలుగు విధములు. వీటిలో తీగలు గలవి తతములు; వాయుపూరణముచే అనుష్ఠింప బడునవి సుషిరములు; చర్మముచే నిర్మింపబడునవి అవనద్ధములు; కాంస్యాదిలోహనిర్మితములు ఘనములు.
గానము రెండువిధములు. గాత్రగానము మొదటిది; వాద్యగానము రెండవది. సంగీతమునందు గాత్రగానము ప్రశస్తమైనది. వాద్యము ప్రమాణము కొరకు కూడ చెప్పబడినది. పై నాలుగు విధములగు వాద్యములలోను వీణాదిజంత్ర (తీగలుగల) వాద్యములు, వేణువు మొదలగు సుషిరవాద్యములు మాత్రమే రాగగీతాది హేతువు లగు చున్నవి. మిగిలిన మృదంగాది అవనద్ధ వాద్యములు, కాంస్యాదిలోహ వాద్యములు తాళ ప్రధానములు. ఈ వాద్యములందలి నాలుగు విధములగు నాదములును, దేహనాదమునుచేరి పంచనాదము లనబడినవి - వీనినే
“నఖ, వాయుజ, చర్మాణి, లోహ, శారీరజస్తథా" నఖజము, వాయుజము, చర్మజము, లోహజము, శారీరజము (దేహజము) అను పేర్లతో శాస్త్రజ్ఞులు వ్యవహరించిరి,
చిత్రము - 167
పటము - 1 వీణ
వీణాది వాద్యములందలి తీగలు గోళ్ళచే ధ్వనింప జేయబడుటవలన కలుగు నాదమునకు “నఖజ"మనియును. గాలిని పూరించుటచే వేణువు మొదలగు వాద్యములందు కలుగు నాదమునకు “వాయుజ” మనియును. మృదంగాది వాద్యములందలి నాదము చర్మమునుండి వెలువడుచున్నదిగాన 'చర్మజ' మనియును, తాళము, గంట మొదలగు వాద్యములందలి నాదము
603