చతురంగబలములు - 2
సంగ్రహ ఆంధ్ర
ధ్వజము, కామునకు మత్స్య (మకర)ధ్వజము – ఉం డెను. పల్లవులు వృషభధ్వజులు; చాళుక్యులు, విజయనగర రాజులు, కాకతీయులు వరాహధ్వజులు; ధ్వజములు రథములమీదను, ఏనుగులమీదను ఎగురుచుండును.
శిల్పకారులు : ఈ విధములయిన ఆయుధములను, కవచములను, ధ్వజములను మొదలగువాటిని నిర్మించెడు శిల్పులు ఉండిరి. ఈ శిల్పులు శ్రేణులుగా ఏర్పడి వస్తూత్పత్తి చేయుచుండిరి. ఒక శ్రేణివారగు “ఇషుకారులు" బాణముల శిరోభాగములను తయారుచేయగా, ఇంకొక శ్రేణివారు మిగతభాగము చేయుచుండిరి. రథకారుల జాతి ఒకటుండెను. వీరికి రథములను నిర్మించుటయే వృత్తిగా నుండెను. రథములను నడపువారిని సూతులనుచుండిరి. రోడ్లు వేయుట, వంతెనలు కట్టుట, తటాకములు త్రవ్వుట మొదలగుపనులు నెరవేర్చు మిలిటరీ ఇంజనీర్లును, స్యాపర్సు అండు మైనర్సు (Sappers and Miners) అను కార్మికులును ఉండిరి. వీరందరు మంచి నేర్పరులు. గజశిక్షకులు, తురగశిక్షకులు ఉండిరి. బండ్లను లాగుటకు ఎద్దులు, ఒంటెలు ఉండెను.
రస్తుసామగ్రి : యుద్ధశాఖలో యుద్ధమునకు కావలసిన రస్తుసామగ్రిని సప్ల యిచేయుటకు ఒక సంఘ ముండెను. వీరు ఉడుపులు, ఆయుధములు, తినుబండారములు మొదలగువానిని సమకూర్చి నిలువ యుంచుచుండిరి.
శిబిరము : యుద్ధమునకు పోయినప్పుడు శిబిర నిర్మాణము ముఖ్యమైన పనిగా నుండెను. శిబిరమును స్కంధా వార మనుచుండిరి. శిబిరప్రదేశమును నిర్ణయించుటకు ఇంజనీర్లు, సర్వేయర్లు, క్షేత్రజ్ఞానమువారు, అటవీశాస్త్ర జ్ఞానము కల వేటకాండ్రు, వడ్రంగులు, త్రవ్వువారు, కార్మికులు ముందువెళ్ళి స్థలనిర్దేశము చేయుచుండెడివారు. శిబిరస్థలము సమప్రదేశముగాను, గట్టినేలగాను ఉండవలెను. పెద్దచెట్లు ఉండకూడదు. పొద లుండవలెను. నీటి వసతి కలిగియుండవలెను. శిబిరము చతుష్కోణముగా ఎనిమిది దర్వాజాలు కలిగియుండవలెను. శిబిర రక్షణకు, శిబిరములోని ఆయుధములు, పదార్థములుండెడు ఉగ్రాణమునకు రక్షణగా వేర్వేరు భటులు నియమింపబడేవారు. భోజన పదార్థములు పుష్కలముగా నిలువచేసియుంచెడు వారు. శిబిరము ఒక చిన్న నగరముగా ఉండుచుండెడిది.
అన్ని తరగతులకు చెందిన పురుషులు, స్త్రీలు నివసించుట కనువగు పటకుటీరము లుండుచుండెను. శిబిరవాసుల వినోదమున కేర్పాటుండెను. పైనవివరించిన వివిధ వాద్యములలో కొన్ని వినోద కాలక్షేపమునకు పనికివచ్చునవిగా నుండెను. స్కంధావారములో శకటములు, సామానుబండ్లు, అన్ని విధములయిన వాహనములు, కోశము, ఆయుధములు, యంత్రములు, చికిత్సకులు ఉండిరి. రథములను బాగుచేయుటకు, కరములు, ధనువులు, ఈటెలకు కావలసిన కత్తులు, కఱ్ఱలు, అంబులపొదులు, వివిధములయిన త్రాళ్ళు, నూనె, ఆసవములు, ఇసుక, విషసర్పములతో నిండిన కుండలు, పేలుడు పదార్థములు, పిచికార్లు, నీరు, చిరుతపులుల చర్మము, మైనము, గుడ్డలు, నేయి, యుద్ధాయుధములు కురుక్షేత్ర సంగ్రామ సందర్భమున దుర్యోధనుని స్కంధావారమునం దుండెనట !
శిల్పదృష్టాంతములు : ఇంతవరకు వర్ణించిన ఆయుధములు, పరికరములు, పదార్థములు ఉండియుండె నని గ్రంథములే గాక శిల్పములు కూడ రుజువుచేయుచున్నవి. బార్హూత్, సాంచి, భువనేశ్వరము, అవంతి దేవాలయములు మొదలగువానిలోని శిల్ప విన్యాసములు ఆయుధాల రూపురేఖలను మనకు చూపించుచున్నవి. భార్హూత్ గుహాశిల్పమునందు నౌకలు, రథములు, గుఱ్ఱములు, ఎద్దులులాగుచున్న రథములు, ధనుర్బాణములు మొదలగువాని చిత్రములు గలవు. సాంచీలోని పదునొకండు స్తూపములలో నగరముట్టడి, భటులవేషము, కత్తులు, కేడెములు, గండ్రగొడ్డండ్లు, శూలములు, చిన్నయీటెలు, వజ్రము, బాకు, అంకుశము, గంటము, పతాకములు, పొడుగుపాటి చీపుర్లు, డోళ్ళు, గొడుగులు మొదలగునవి మనకు చిత్రరూపమున గనుపించును. ఇవి రెండు వేల సంవత్సరముల క్రిందటి శిల్ప చిత్రములు.
భువనేశ్వరములోని శిల్పము సుమారు పదునైదువందల సంవత్సరముల క్రిందటిది. భువనేశ్వరములో ఆశ్విక సైన్యము, పదాతి సైన్యము, ఏనుగులు, యోధులు, మొదలగు రూపములు కనబడును. అజంతా గుహలు పదునెనిమిది వందల సంవత్సరముల క్రిందట తొలచబడినవి. అజంతా శిల్పములో చమత్కారమయిన కేడెము, వంకరబాకు, అంబులపొది, పొడుగాటి బల్లెములు, గదలు,
602