చతుర్విధ వాద్యములు
సంగ్రహ ఆంధ్ర
లోహమునుండి గలుగుచున్నదిగాన 'లోహజ'మనియును, శరీరమునుండి ఉద్భవించు నాదమునకు 'శారీరజ' మనియును చెప్పబడెను.
చతుర్విధ వాద్యవివరములు :
తతవాద్యములు : ఇవి తంత్రీయుక్తమైనవి - వీటికి జంత్రవాద్యములని పేరు, ఇవి రెండువిధములు. గోళ్లచే వాదనము చేయబడునవి మొదటి విధము. ఇవి వీణ, గోటు, తంబుర, సితారు మొదలగునవి. కమాను అని పిలువబడు ధనుస్సు (bow) చేత వాదనము చేయబడునవి రెండవరకము. ఇవి ఫిడేలు, సారంగి, దిల్‌రుబా మొదలగునవి.
చిత్రము - 168
పటము - 2 తంబుర
జంత్రవాద్యము లన్నిటిలోను వీణ ప్రధానస్థానము నలంకరించుచున్నది. నకులి, చిత్ర, విపంచి, మత్తకోకిల, ఆలాపిని, కిన్నరి, పినాకి, బృహతి, కళావతి, మహతి మొదలైనవి వీణావాద్య భేదములు. సంగీతమున సముచితస్థానముగల గొప్ప ప్రామాణిక వాద్యము వీణ. వివిధ తానములను ఆలాపించుట కేమి, పట్టుజాతి రాగభావములకు, రవ్వజాతి స్వరపోకడల కేమి, వీణకు వీణయే సాటి. దీనిననుసరించియే కాలక్రమమున వచ్చిన మిగతా వాద్యముల నిర్మాణము జరిగినదని చెప్పవచ్చును.
వీణావాద్య నిర్మాణమునకు చండ్ర, పనస మొదలగు దారువులు యోగ్యములుగా చెప్పబడినవి. బాగుగా మాగిన కఱ్ఱను సుమారు ఒక అడుగు ఎత్తును, అంతే వెడల్పుగల గుండ్రని ఆకారము ముందుగా తయారు చేయబడి, లోపలిభాగ మంతయు తొలుచబడి గుల్లగా చేయబడును. దాని పైభాగమున సుమా రొక అడుగు ప్రమాణముగల చెక్కను బల్లగా తయారు చేసి అతికింతురు. ఇదియే వీణ శిరోభాగము. తరువాత 3 అంగుళముల వెడల్పును, 30 అంగుళముల పొడవును గల పనసకఱ్ఱను గూడ గుల్లగా తొలిచి, పైన వేరొక చెక్కచే మూయుదురు. 'దండె' అని పిలువబడు దీనిని శిరోభాగమున చేర్చి బిగింతురు. వంపుగానున్న ఈ దండెచివర భాగమున నాలుగు బిరడాలును, దండె ప్రక్కగా మూడు బిరడాలును, అమర్తురు, శిరోభాగమున 'పీట' అను లలాట భాగమును దాటిన పిమ్మట 'లంగరు' అనుచోట సప్తతంత్రులను ముడివేసి, నాలుగు తంత్రులను పీట (బ్రిడ్జి) మీదుగా తెచ్చి బిరడాలకు చుట్టబడును. ఈ తంత్రులపైననే రాగ గీతాదులను అనుష్ఠింతురు. మిగిలిన మూడు తంత్రులు పీట ప్రక్కగా వచ్చి దండెయందు ఎడమభాగమున అమర్చబడిన బిరుడాలకు చుట్టబడి యుండును. దీనికి శ్రుతితంత్రులని పేరు. దీనియందు తాళముకూడ అనుష్ఠింపబడును.
నేటి వీణయందు దండెయొక్క పై భాగమున కంచుతో చేయబడిన ఇరువదియైదు మెట్లను అమర్తురు. ఎడమచేతి వ్రేళ్ళతో ఈ భాగమున తంత్రులను మెట్లపై నొక్కుచు కుడిచేతిని శిరోభాగమున ఉంచి వాక్ స్థానమునందు తంత్రులను మీటెదరు. శిరోభాగమునందలి ఎత్తుతో సమానముగా నుండునట్లు దండె చివరిభాగమున క్రిందుగా సొరకాయ బుఱ్ఱను బిగింతురు.
మన భారతీయ విద్యలయొక్క పరమావధి మోక్షమనుట నిర్వివాదాంశము. మానవశరీరము ననుసరించియే వీణ ఏర్పడినది. మనుష్య దేహమందలి శిరస్సే వీణయందలి శిరస్సుగాను, దేహభాగము దంతముగాను, చివరభాగము పుచ్ఛముగాను నిర్మించబడినది. "అధఖల్వియం దై వీవీణా భవతి, తదనుకృతిరసౌ మానుషీ వీణాభవతి, యధాస్యాః శిరఏవమముష్యాః శిరః యధాస్యాఉదరమేవ మముష్యా అంభణం, యధా స్త్యెజిహ్వాఏవ మముష్త్యెవాదనం . . .” అని వేదప్రమాణము. ఈ యాధారమున శ్రీ త్యాగరాజ స్వామి కృతులతో 'శ్రీనారద' యను కానడరాగ కృతియందలి చరణమున గల పదము “వేదజనిత వరవీణా" కాదనియు, అది "వేదజనిత నరవీణ" అని యుండుననియు కొందరు పండితులు సెలవిచ్చిరి. మేరువు గలచోటు మనుష్య దేహము నందలి నాభిస్థానమనియు, వీణలో మధ్యనుగల షడ్జ
604