విజ్ఞానకోశము - 3
చతురంగబలములు - 1
చతురంగములు అని పేళ్లు గలవు. ప్రాచీన భారత సేనావ్యవస్థను గూర్చి ఆలోచించినపుడు, చతురంగ బలమును గూర్చి ఆలోచింపదగియున్నది.
మన దేశమున 'చదరంగము' అను నొక క్రీడా విశేషము మిక్కిలి ప్రచారములోనున్నది. 'చదరంగ'మను శబ్దము 'చతురంగ'మను దానికి వికృతి. అనగా చదరంగ మనునది 'చతురంగ' సంబంధమగు ఆట యని ఏర్పడ గలదు. అనగా యుద్ధసంబంధమయిన బుద్ధి కౌశలము వృద్ధియగుటకుగా నేర్పడిన క్రీడయని చెప్పవచ్చును. కాని 'చతురంగబల'మను సేనావ్యవస్థ శ్రీమద్రామాయణ మహా భారతములలో కానవచ్చుచున్నదే కాని, అంతకు పూర్వపు వేదాదులలో కానరాదు. మరియు చతురంగ క్రీడనుగూర్చి వేదాదులలో తరచుగా ప్రశంసింపబడి యున్నది. ఇట్లు వేదసిద్ధమైన చతురంగక్రీడా ప్రశంసలచే దానిననుసరించియే తర్వాత రామాయణాది కాలముల నాటికి చతురంగ సేనావ్యవస్థ చక్కగా నిర్మింపబడి యుండు నని చరిత్రకారులు భావించుచున్నారు. కొందరు చతురంగబలమును నిర్వహించు విధానమును ಬట్టియే చదరంగమను ఆట రూపొందించబడి యుండుననియు నూహించుచున్నారు. కాని ఈ రెండు ఊహలలోను రెండవదియే ఎక్కువ సహజముగా, సమంజసముగా కనబడుచున్నది. చదరంగము నందలి రాజు, మంత్రి, రథ గజ తురగ పదాతులు ఆ ఆటకు అంగములుగా నుండవలెనన్నచో, అట్టి వ్యవస్థ తత్పూర్వము లేకున్నయెడల, ఆ చతురంగక్రీడకే - ద్యూతక్రీడకే - అవకాశ మేర్పడి యుండెడిది కాదు. ఈ ఆట చతురంగబల విధానమునకు అనుకరణ రూప మగుటవలన, దానిచే అనుకార్యమగు చతురంగ సేనావ్యవస్థ తత్పూర్వమే అవతరించియుండును. ఇట్టి ఊహకు కారణము వేదములలోని ద్యూతప్రశంసయై యుండును.
చతురంగముల విషయమున మరొక్క వాదముగూడ కలదు. సేనయందలివి చతురంగములా, షడంగములా, యను మీమాంసయు శాస్త్రమున కానవచ్చుచున్నది.
'ఏతన్మౌలాది షడ్భేదం, చతురంగబలం విదుః
షడంగం మంత్రకోశాభ్యాం పదాత్యశ్వరథద్విపై "
(కామ. 19-24)
అని పయి చతురంగములతో మంత్ర - కోశములు కూడి షడంగములుగా లెక్కింపబడినవి. అట్లే—
"రథా నాగా హయాశ్చైవ
పాదాతాశ్చైవ పాండవ !
విష్టి ర్నావశ్చరాశ్చైవ
దేశికా ఇతి చాష్టమః
అంగాన్యేతాని కౌరవ్య !
ప్రకాశాని బలస్యతు"
(భార. శాంతి.)
అని సేన అష్టాంగముగా పేర్కొనబడినది. కాని మొదటి చతురంగములు సాక్షాత్తుగా సేనారూపములై యొప్పుటచే వాటినే తచ్చతురంగములుగా భావించుట న్యాయము. తర్వాతి చతురంగములు - విష్టి, నావలు, చారులు, దేశికులు అనునవి గాని, మంత్రకోశములు అను రెండంగములు గాని, తత్సహాయరూపములే అగుటచే వాటిని గూర్చిన విచారణ అప్రస్తుత మగుచున్నది.
రథబలము : చతురంగబలములలో అతిప్రాచీనకాలము నుండియు, భారతదేశమున రథబలము ఒక ముఖ్య మయిన సేనాంగముగా భావింపబడుచున్నది. ఆ కాలమున సాధారణముగా ఉత్తర భారతదేశము అరణ్యా క్రాంతముగా నుండుటవలననే కాబోలు, ఆరూఢులగు సైనికులు గల సేనతో యుద్ధములు జరుగుచు వచ్చెనని చరిత్రకారులు భావించినారు. అందుచేతనే వారికి రథములు, ఏనుగులు, గుఱ్ఱములు, ఆరోహించుటకు ఆవశ్యక సాధనములుగా నుండినవి. వాటిలో రథములకు ప్రత్యేక ప్రాముఖ్యము గలదు. అవి గొప్ప శిల్పులచే నిర్మితము లయి, దృఢచక్రములు గల్గి మంచి గుఱ్ఱములచే పూన్పబడి సుధ్వజ–సుపతాకలతో నలరారి, సమస్త యుద్ధపరికరములతో గూడి, రథి-సారథులతో యుక్తములై ఉండెడివి. రథములనుగూర్చి సంహితలలోను, బ్రాహ్మణములలోను, పెక్కుచోట్ల ప్రశంసలు కానవచ్చుచున్నవి. మరియు, అందే, 'రథ - సారథి - రథ కార' శబ్దములును ఉండుటచే రథములను నిర్మించు శిల్పిజాతియు ఒకటి యున్నట్లు తెలియగలదు. మొట్టమొదట రథియే రథమును నడపుకొనుచు యోధుడుగా వ్యవహరించెడివాడట. ఐతరేయ బ్రాహ్మణ కాలమునుండియు, రథి యోథుడుగను, సారథి
593