Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కేరళదేశము - (చరిత్ర)

సంగ్రహ ఆంధ్ర

రాణుల వలన ఇరువురు పుత్రులు కలిగరి. వారిలో ఒకడు "కలంగైక్కన్నినర్‌ ముడై చ్చేరళ్‌” అను నాతడు. రెండవవాడు “సెంగుట్టవన్‌ (ధార్మికుడగు కుట్టవన్‌) అను నాతడు. (సుమారు క్రీ. శ. 180). వీరిలో 'చేరళ్‌ ' అను నాతడు అనేకశత్రువులను జయించి 'అధిరాజ' అను బిరుదములు పొందెను. సెంగుట్టవన్‌ అను నాతడు కవీశ్వరుడు. ఇతనికి 'కడల్‌ పిరాగ్‌ ఓట్టియ” (సముద్రమును పారదోలినవాడు) అను బిరుదము కూడ కలదు. ఇతడు నౌకాదళమును, ఏనుగుల యూధమును, అశ్వదళమును పోషించినట్లు తెలియుచున్నది. ఇతడు గొప్ప ఆశ్వికుడై యుండెను. ఈ కుట్టవన్‌ కాలములోనే పత్నిని ఆరాధించు విధానము, 'సిలప్పాధికారము' నందలి నాయకి యగు 'కన్నగి' పూజ, తదుపరి కేరళదేశములో పరిపాటిగా జరుగుచుండు భగవతీ ప్రార్థన అనునవి అమలులోనికి తేబడెనని తోచుచున్నది. పవిత్రురాలయిన పత్ని లేక 'కన్నగి'యొక్క ప్రతిమను తెచ్చి చెక్కించుటకై హిమాలయ పర్వతములవరకు కుట్టవన్‌ వెడలి, అచ్చట ఆర్య రాజునుఓడించి, ఒక శిలాఫలకమును తీసికొనివచ్చి, మార్గ మధ్యమున ఆ ఫలకమును గంగాజలములోముంచి, దానిని చేర రాజ్యమునకు తెచ్చెను. 'పత్ని' యొక్క శిలా విగ్రహమును చెక్కించి చేరరాజ్యమునకు రాజధానిగా నుండిన తిరువణిక్కులము (అనగా క్రాంగనూరు) నందు దానిని ప్రతిష్ఠించెను. ఈ ఉత్సవమున సింహళదేశపు రాజయిన 'గజబాహు'అను నాతడుకూడ ఉండినట్లు తెలియుచున్నది. గజబాహుకాలము క్రీ శ. 173 - 195 అని నిర్ణయింపబడినది. అందుచే కుట్టవన్‌ క్రీ. శ. రెండవశతాబ్దివాడని తేలుచున్నది. చోళుల వంశములో జరగుచున్న వారసత్వపు యుద్ధములో ఇతడు కల్పించుకొని తొమ్మిదిమంది రాజులను సంహరించి, పదవరాజునకు రాజ్యము సంక్రమింప జేసెను.

'పదిట్టపట్టు' (పది పదులు) అను తమిళసంఘ సాహిత్య సంకలనము ఉదియన్‌ యొక్క మూడు తరములకు చెందిన ఐదుగురు రాజులను వర్ణించుచున్నది. ఈ వంశపు మరియొక తెగకు చెందిన మరిముగ్గురు రాజులను గురించి కూడ ఇందు వర్ణనము కలదు. కాని ఈ ముగ్గురురాజుల పరిపాలనములు వంశ పారంపర్యముగ వచ్చినవి కావు. కౌటిల్యుడు వర్ణించిన విధమున, చేరరాజ్యము ఒక కుటుంబమునకు చెందిన వివిధరాజులచే పరిపాలింపబడెను. అదియే 'కులసంఘ' మనబడెను. ఆ పద్ధతిలో వంశజు లందరు ఆ రాజ్యములో భాగస్వాము లగుదురు. ఈ విధమయిన కులనంఘ పరిపాలనము ఆ రోజులలో అమలులో నుండినట్లు తెలియుచున్నది.

ఈవిధముగా 'ఆండువన్‌' అను నతడును ఆతని పుత్రుడైన 'సేల్‌ వక్కడంగవాలి ఆడన్‌” అను నతడును - ఈ ఇరువురును ఉదయన్‌' యొక్క సంతతిలోని రాజులకు సమకాలికులుగ ఉండి యుండవలయును. ఉభయులును పరాక్రమవంతులును, ఉదారులునై యుండిరి. మహాకవి కపిలారు తన పోషకుడయిన 'పారి' అను నతడు మృతుడయిన తరువాత 'వాలిఆడన్‌' అనునతని పోషకత్వమున చేరెను. ఆడన్‌ పుత్రుడయిన 'పెరుముచేరల్‌ ఇరుమ్‌పోరై' (కీ. శ. 190) అను నాతడు తాగడూరునకు చెందిన 'ఆదిగైమాన్‌' అను సామంతరాజును ఓడించెను. 'పెరుంసీరల్‌ ఇరుంపారయి' యొక్క భాగినేయుడొకడు పాండ్యచోళ రాజులను జయించి అయిదుశిలా దుర్గములను స్వాధీన పరచుకొనెనట.

క్రీ. శ. మూడవ శతాబ్దము తదుపరి చేర పాండ్యరాజుల యుద్ధనైపుణ్యమును గురించియు, ఉత్తరదేశము నుండి వచ్చిన శూరులతో వారు కావించిన పోరాటమును గురించియు, అచ్చటచ్చట ఉల్లేఖింపబడియున్నది. వాస్తవముగా చెప్పవలయుననిన కేరళదేశపు చరిత్రను క్రమముగా తెలిసికొనుటకు 5 శతాబ్దములవరకు తగినట్టి ఆధారములు లేవు. క్రీ. శ. ఎనిమిదవ శతాబ్దమందు మరల కేరళ చరిత్రయందు ఇరువురు గొప్ప రాజులుద్భవించిరి. అందు శైవమతమునకు చెందిన 'చేరమన్‌ పెరుమాళ్ళు' అను నతడు, వైష్ణవ మతమునకు చెందిన 'కులశేఖరాళ్వారు. అను నీ ఇరువురు రాజులును మహోదయపురము ( ప్రస్తుతపు క్రాంగనూరు )నే రాజధానిగా ఏర్పరచుకొనిరి. దీనిని విదేశీయులు ముజిరిస్‌ (Musiris) అని వ్యవహరించుచుండిరి. ఈ చేరరాజులకు 'పెరుమాళ్‌' అనునది గౌరవనామము.

ఈ వంశమునకు చెందిన కులశేఖరుడు కవీశ్వరుడును, మహాభక్తుడునై యుండెను. రామానుజీయ వైష్టవులచే

26