Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

కేరళదేశము (చరిత్ర)

ఇతడు కులశేఖరాళ్వారు అని పిలువబడి, పన్నిద్దరాళ్వారులలో చేర్పబడెను. ఈ కులశేఖరుడే 'తపతీ సంవరణమ్' సుభద్రా ధనంజయము అను సంస్కృత నాటకములను, 'ముకుందమాల' అను సుప్రసిద్ధ స్తోత్రమును వ్రాసెను. కులశేఖర పెరుమాళ్ రచించిన తమిళ స్తోత్రములు నాలాయిర ప్రబంధములో గలవు. దీనినిబట్టి చేరరాజుల కాలములో తమిళభాషయే కేరళభాషగా వెలసినదని తెల్ల మగును. ఈ చేర పెరుమాళులలో నొక రాజు అపుడపుడు కేరళతీరమునకు వ్యాపారముకొరకు వచ్చిన అరబ్బులతో ఏగుదెంచిన ఒక ముస్లిము గురువు ప్రభావమున ఇస్లాంమతము నవలంబించెను. “నేను కాబాకు వెళ్ళివచ్చెదను. అంతవరకును కత్తిని ధరించి నా ప్రతినిధివై పరిపాలింపుము" అని తవ అన్నకుమారునకు రాజ్యము నప్పగించి వెళ్ళి అతడు అక్కడనే పరమ పదించెననియు, అప్పటినుండియు రాజ్యమును పాలించిన వారందరును, కత్తిని సింహాసనము నధిష్ఠింపజేసి తత్ప్రతినిధులుగా పాలించుచు వచ్చిరనియు కొన్ని చారిత్రి కాధారములను బట్టి నిర్ణయింపబడినది.

చేరరాజుల పరిపాలనమునందు కేరళతోపాటు నేటి కోయంబత్తూరు జిల్లాలోని కొన్ని భాగములు కలిసి యుండెనని తెలియుచున్నది. చేరరాజులయొక్క పరిపాలన రెండవసారిగా పై నుదాహరింపబడిన రాజుల కాలముననే ప్రారంభింపబడినట్లు తెలియుచున్నది. ఈ ఇరువురి తరువాత రాజశేఖర, స్థానురవి, భాస్కరరవి వీర కేరళ ప్రభృతులు కొందరు రాజులు ఏలినట్లు తెలియుచున్నది. కాని క్రీ. శ. 10వ, 11వ శతాబ్దములందు చోళరాజులయిన రాజరాజు, రాజేంద్రరాజు, చేర రాజుల నోడించిరి. అందువలన చేరరాజుల బలము చాలవరకు సన్నగిలినది. శాసనముల వలనను, మరికొన్ని ఆధారముల వలనను, ఆ కాలపు చేరరాజులను గురించి కొద్ది కొద్దిగా తెలియుచున్నది.

పదునాల్గవ శతాబ్దముయొక్క ఆరంభమున మరియొక గొప్ప రాజు ఉదయించెను. రవివర్మ కులశేఖర (సంగ్రామధీర) అను రాజు మరల దక్షిణదేశ చరిత్రలో తన యొక్కయు, తన రాజ్యముయొక్కయు ప్రఖ్యాతిని నిలబెట్టెను. కంచీపుర శాసనములవలన రవివర్మ జీవిత చరిత్రమునందలి కొన్నికొన్ని ముఖ్యాంశములును, కాలములును, మనకు తెలియుచున్నవి. ఇతడు క్రీ. శ. 1266 వ సంవత్సరమున జన్మించెను. 33 సంవత్సరములు వయస్సు వచ్చుసరికి ఇతడు కేరళ దేశమంతటికిని అధికారిఅయ్యెను. నలుబదిఏడు సంవత్సరములు వచ్చుసరికి (క్రీ. శ. 1313) ఇతడు దక్షిణాపథమునకు 'మహారాజు' అను బిరుదమును కాంచీపురములో స్వీకరించెను. పాండ్య రాజులను, చోళరాజులను జయించెను. పాండ్య రాజయిన విక్రమపాండ్యుని కూతును వివాహమాడెను. ఈ పట్టాభిషేక మహోత్సవము శ్రీరంగమునందును, తిరువాడియందును, జరుపబడెను. కాని దక్షిణభారతమునకు గొప్ప రాజకీయ సంక్షోభము కలుగనున్నదని, మహమ్మదీయ రాజయిన మల్లిక్ కాఫరు హొయసాలుల నోడించి పాండ్యరాజులపై దాడివెడలిన సందర్భమున రవివర్మ గట్టిగా గ్రహించెను. ఇతని ప్రథమవిజయ ప్రయత్నములు ప్రాతిపదికములుగా దక్షిణదేశ మందు విజయనగర సామ్రాజ్యము స్థాపింప బడెననుట అతిశయోక్తి కాదు. ఇతడు మహాకవియు, కవిపోషకుడును విద్వాంసుడునై యున్నాడు. 'ప్రద్యుమ్నాభ్యుదయము' అను నాటకమును సంస్కృతమున రచించిన దిట్ట ఇతడు. పట్టాభిషిక్తుడయిన కొలదికాలమునకే దివంగతుడయ్యెను.

రవివర్మ పిదప నవీనయుగము వరకు కేరళదేశము అనేక రాజులచే పరిపాలింపబడెను. చేరరాజులకును పాండ్యరాజులకును మధ్య, అపుడపుడు కొద్దిపాటి యుద్ధములు జరుగుచుండెను.

తిరువాన్కూరు రాజకీయవేత్తలయిన మహారాజులచే పరిపాలింపబడెను. భారతదేశమునందు ఎచ్చటను అమలులో లేనప్పుడు మొట్టమొదట తిరువాన్కూరు సంస్థానములో, బాధ్యతాయుత ప్రభుత్వమును, వయోజనుల ఓటింగు పద్ధతియు ప్రవేశ పెట్టబడినవి. సాంఘిక సంస్కార పరములైన శాసనములు కావించుటయందుగూడ భారత సంస్థానములన్నిటికంటెను కేరళము మిన్నయైనది. విద్యా వ్యాప్తి (ముఖ్యముగా స్త్రీ విద్యావ్యాప్తి) గావించుట యందును కేరళమే అగ్రతాంబూలమునకు అర్హమైనది.

కేరళ రాజకీయ చరిత్రము : నేటి కేరళ రాష్ట్రము దాదాపు పదునొకండు వందల సంవత్సరములనుండి

27