Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/600

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఘటికాస్థానములు

సంగ్రహ ఆంధ్ర

ప్రయత్నించు, కృషిచేయు శాల యనియు అర్థము చెప్పు చున్నారు. కాని అది సమంజసముగ గన్పట్టదు.

జ్యోతిషగ్రంథముల ననుసరించి ఘటిక యన నొక గడియకాలము. ఆహో రాత్రములతో గూడిన దినము పరిమాణము అరువది గడియలు-పగలు ముప్పది, రాత్రి ముప్పది. రెండు గడియ లొక ముహూర్తము (48 నిమిషములు). పగలు పదునైదు ముహూర్తములు. ఇట్లే మన పూర్వులు, దివారాత్రములను యామము (జాము) లుగ కూడ విభజించియున్నారు. ఒక్కొక్క యామమున కొక్కొక్క పేరు కలదు. యామ మనగా ఏడున్నర గడియలు (మూడు గంటలు). దేవాలయములలో నిర్ణీతకాలములందు జరుపవలసిన అంగభోగ, రంగ భోగాద్యనేకాగమోక్త విధులు కలవు. ఇట్లే నీతిశాస్త్రములు పగటిని, రాత్రిని అర్ధయామములుగ విభజించి ఒక్కొక్క యర్దయామమునందు నరపతి నిర్వర్తింప వలసిన కార్యకలాపమును నిర్ణయించుచున్నవి. ఇందు నిమిత్తము ప్రొద్దు తెలిసికొనుట యవసరమై, కాలమాన జ్ఞాపికా సాధనములు కావలసివచ్చినవి. ఇట్టి సాధనములు పూర్వకాలమునందు వివిధములైన వనేకములు. ఇవి శాస్త్రవేత్తల, ముఖ్యముగా జ్యోతిష్కుల పర్యవేక్షణయం దుండెడివి. ఇట్టివానిలో మన దేశమున వేదకాలము నుండియు ననుస్యూతముగ వచ్చుచున్న సాధనము, అడుగున సన్నని బెజ్జముగల తామ్రఘటికా పాత్రతో ప్రొద్దు తెలిసికొనుట యొకటి. ఘటికాపాత్రకు తెలుగున గడియ కుడుక యని పేరు. ఋగ్వేదాంతర్గత వేదాంగ జ్యోతిషము నందును, ఇతర జ్యోతిషగ్రంథము లందును, తామ్రపాత్ర ఘటికానిర్మాణ ప్రకార మభివర్ణితమైనది. ఈ కాలమాన జ్ఞాపిక సాధనమునకు ఘటికా యంత్రమని పేరు. ఈ యంత్రము సుప్రఖ్యాతములైన గొప్పదేవాలయములం దుండెడిదని యూహింపవచ్చును. ఘటికాయంత్ర ముండిన యగారమునకు ఘటికాగార మని, ఘటికాశాల యని పేరు. గడియార మన్నది ఘటికాగార వికృతి. దేవాలయములో ఘటికాయంత్ర ముండు శాలయే వేదవిద్యా స్థానముగ ఉండుటచేత కావచ్చును. దేవాలయము నందలి వేదవిద్యా పీఠమునకు గూడ, ఘటికాశాల, ఘటికా స్థానము, ఘటిక యను పేరు వచ్చియుండును.

అడుగున గల సన్నని బెజ్జముగుండ తామ్రఘటికా పాత్రలోని నీరు కారిపోయి యది జలరహిత మగుటకు కాని, ఆ పాత్రను నీటిమీద నుంచినపుడు బెజ్జముగుండ దానిలోనికి నీరు చొచ్చుకొనిపోయి యది, సంపూర్ణ జలభరిత మగుటకు కాని, సరిగా నొక గడియ పట్టునట్లాపాత్రను నిర్మించువారు. కావుననే దానికి ఘటికా పాత్రయని పేరు కల్గినది.

వేదకాలమునందు మొదటి విధము వాడుకలో నుండెను. మధ్యయుగమునం దనగా క్రీ. శ. 1000 మొదలు క్రీ. శ. 1500 ల వరకు గల నడిమికాలమున మన తెలుగు దేశమున వాడుకలోనికి వచ్చినది రెండవ విధము. ఒక పెద్ద పాత్రను నీటితో నింపి ఆ నీటిమీద ఘటికాపాత్ర నుంచినప్పటినుండి యది నీటిలో మునుగువరకు నగు కాల మొక గడియ. శుభకార్యావసరముల యందు శుభ ముహూర్త మాసన్నమయిన దనగనే “జలమునందు మునుగు ఘటికాపాత్ర నిరీక్షించి... యక్షతలు" చల్లెడివారట. ప్రాచీనాంధ్ర కవులు "గడియకుడుకభంగి గ్రహరాజు జలధిలో వ్రాలె" నని అస్తంగత సూర్యుని వర్ణించి యున్నారు. గడియకుడుకను నిరీక్షించి యప్పటప్పటి కయిన ప్రొద్దును శంఖధ్వానములవలన గాని, జేగంటల రవమువలన గాని తెలుపుచుండువారు. (ఉదా : "మును గడియారంబునఁ గట్టిన పెను జేగంట రవము ఠే యను నెడ.")

ఇట్టి గడియారములు దేవాలయములలోనేగాక మహారాజుల మోసాలలోను నుండెడివనుటకు


'ఉడువీథిన్ శిఖరావలంబియగు నంధ్రోర్వీశు మోసాల పై
గడియారంబున మ్రోసె రెండెనిమిదుల్ ఘంటా ఘణాత్కారముల్
సడలెన్ భానుఁడు పశ్చిమంబున'

అన్న క్రీడాభిరామమందలి పద్యమే తార్కాణము.

ఘటికాస్థానీయునికి ఘడియశాసి, ఘటశాసి, ఘళిశాసి, ఘైసాసి అను గౌరవబిరుదు వాచకములు కూడ శాసనములయందు గానబడుచున్నవి. ఇవి యన్నియు సమానార్థకములు. ఘడియశాసి, ఘటశాసి యన్నవి. ఘటికాశాసి యను పదము రూపాంతరములే. వికృతులే. ఘళిసాసి, ఘైసాసి యన్నవియు భ్రష్టరూపములే.

542