గ్రీసుదేశము (భూ)
సంగ్రహ ఆంధ్ర
గింపుగా నుండును. ఈ పర్వతములు ఇచట ఎక్కువ వెడల్పుగా నుండి ప్రత్యేక శాఖలుగా చీలియున్నవి. ఇచట పరస్పరము వేరుపడుచున్న అనేకములయిన నదీ పరివాహక ప్రాంతములుకలవు. ఆల్ఫియోస్, ఇవ్రోటాస్ అను నదులు వాయవ్యమునుండి ఆగ్నేయమునకు పోవు ఒక నిర్మాణాత్మకమగు కందకము వెంబడి ప్రవహించును. ఉత్తర, పశ్చిమ తీరముల వెంబడి నిమ్న భూమండలము కలదు. ఇచటి పట్రాయి (పట్రాస్) అను పట్టణమునందు 79,500 మంది జనులు కలరు. ఇది కోరింత్ సింధుశాఖపై ముఖ్యమగు రేవుపట్టణముగా నున్నది. ఈ నగరమునకును, ఏథెన్సు నగరమునకును ఒక రైలుమార్గముచే సంబంధము ఏర్పడియున్నది. ఇచటినుండి ముఖ్యముగా చిన్న రకపు నల్లద్రాక్షపండ్లు ఎగుమతియగును. ప్రపంచములో నెల్ల ఇట్టి ద్రాక్షపండ్లను మిక్కిలి విస్తారముగా ఎగుమతిచేయు దేశము గ్రీసే. ఈ భాగముయొక్క ఆగ్నేయదిశలో, సింధుశాఖల ముఖముల వద్ద చిన్న చిన్న మైదానములు కలవు. వీటిలో ఆర్గోస్, స్పార్టా అనునవి ప్రాచీన కాలమందు ప్రసిద్ధములై యుండెను కాని నే డివి చిన్న నగరములుగా ఉన్నవి. పూర్వకాలమందు సముద్రపు దొంగల భయమువలన నగరములు పెక్కులు కొండల మీద కట్టబడెను. కోరింత్‌లో 10,000 మంది జనులు మాత్రమే కలరు. పెలోపోనెస్సస్ యందలి శీతోష్ణస్థితి పశ్చిమ గ్రీసుదేశము నందలి శీతోష్ణస్థితికంటె సౌమ్యమైనది. ఎత్తైన ప్రదేశములలో దేవదారు వృక్షములు పెరుగును. కాని ఏటవాలు భాగములందలి అడవులు నరికివేయ బడుటచే అవి (ఆ భాగములు) విశేషముగా కోతపడి భయదము లగుచున్నవి. గోదుమ, ఆలివ్, ద్రాక్ష ప్రధానముగా పండించబడును. చిన్న నల్లద్రాక్షపండ్లు ముఖ్యమైన ఎగుమతి వస్తువులు. ఇచట మేకలు పెంచబడును. కాని వాటివలన చిన్న చెట్లకు మిక్కిలి హాని జరుగుచుండును.
నీలసముద్రమునుండి పైకి లేచియున్న నిమ్నోన్నతములగు పర్వతముల మూలమున గ్రీసుదేశము సుందరముగా నుండును. కాని వ్యవసాయదృష్టిచే గ్రీసుదీవులు మిక్కిలి తక్కువ విలువకలవి. ఆ దీవులలో కొన్ని మేకలు మేయుటకు మాత్రమే ఉపయోగపడుచున్నని. వీలగుచోట్లలో ఆలివ్, ద్రాక్ష, స్వల్పముగా గోధుమలు పండించబడుచుండును. ప్రాచీన గ్రీకుచరిత్రలో ఈ దీవులు ప్రసిద్ధికెక్కి యుండెను. కాని టర్కీచే జయించబడిన పిదప ఈ దీవులు తమ ప్రాముఖ్యమునెల్ల కోల్పోయినవి.
క్రీటుద్వీపము అన్నిటికంటె పెద్దది. ఇది ఏజియన్ సముద్రములోనున్న ఇతర ద్వీప సముదాయములకు దక్షిణముగా నున్నది. తూర్పు పడమరలుగా దీని నిడివి 160 మైళ్లు. ఉత్తర దక్షిణములుగా దీని నిడివి 36 మైళ్లు. ఇందు దక్షిణతీరమునకు నిట్టనిలువుగా వ్రాలియున్న పర్వతమధ్యభాగము కలదు. ఉత్తరతీరమందు కొద్దితీరపు మైదాన మొకటికలదు. ఈ ప్రాంతమందు గ్రీసుయొక్క ఇతర ప్రాంతములందువలె మధ్యధరా మండలమునకు చెందిన మాక్వి (Maqui) అనబడు సతతహరిత గుల్మజాతికి చెందిన వృక్షసంపద కలదు. పల్లపు భూములలో వ్యవసాయము జరుగుచుండును. కాని నీటికొరతయు, భూమి కోతబడుటయు వ్యవసాయమునకు ప్రతిబంధకము లగుచున్నవి. ఉత్తరతీరమందున్న చిన్న ఓడ రేవులనుండి ఆలివ్ నూనెయు, ఎండు ద్రాక్షపండ్లును ఎగుమతి యగు చుండును.
గ్రీసు ద్వీపకల్పమునకు పశ్చిమముగానున్న అయోనియన్ దీవులందు మిగిలిన గ్రీసుదేశ మందుకంటె ఎక్కువ వానలు కురియును. వీటియందు శీతోష్ణస్థితి సౌమ్యముగను, జనాభా దట్టముగను ఉండును. పర్వతపువాలు లందు ఆలివ్‌వృక్షముల తోపులుండును. కిస్‌మిస్ పండ్లు ఎగుమతి యగుచుండును కోర్ఫు, ఇథాకె (ఒడెస్సెలోని ఇథాక), సెఫెలోనియా, జంటా అనునవి ఈ దీవులలో ముఖ్యమైనవి.
ఏజియన్ సముద్రములో టర్కీకిని, థ్రేసునకును సమీపములో థ్రేసియన్‌దీవులు కలవు. వాటిలో లెమ్నాస్‌లో మంచి వ్యవసాయానుకూలమగు భూమి కలదు. ఇచట సురక్షితమయియున్న మండ్రోస్ అను రేవు కలదు. సామోథ్రేస్, థాసోస్ అనునవి అడవులతో నిండియున్నవి. ఉత్తరముననున్న 'స్పొరాడీస్' అను చిన్నదీవులు శిలా మయములు.
సైక్లేడులు : ఇచటనున్న 20 దీవుల సముదాయమునకు చక్రీయదీవులు (cyclades) అని పేరు. వీటిలో నాక్సస్
534