Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/593

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గ్రీసుదేశము (భూ)

అను దీవి మిక్కిలి పెద్దది. వీటిలో పెక్కుదీవులు పర్వతమయములు. కొన్నిమాత్రమే తక్కువ ఎత్తుకలవి. ఇచట కొలది భూవసతులు కలిగిన బీద కర్షకులు జనసంఖ్య మాత్రము కొంత కలదు. ఈ రైతులు గొఱ్ఱెలను, మేకలను పెంచుదురు. వీరు ద్రాక్షలను, గోధుమలను పండింతురు.

మిటిలీస్ (లెషోస్), ఖియోస్ (khios), సమోస్ అను దీవులు విశాలమైనవి. ఇవి టర్కీ తీరమునకు మిక్కిలి సామీప్యమున నున్నవి. వీటికి దక్షిణముగా స్పోరాడెస్, డొడెకనీస్ అను చిన్నదీవులు కలవు. రోడ్సు (Rhodes) అనునది డొడెకనీస్ దీవులలోకెల్లపెద్దదీవి. ఇది గ్రీసుదేశమునకు 1945 లో యుద్ధ ఫలితముగా సంక్రమించెను. ఈ దీవులన్నియు గుట్టలతో నిండియున్నవి. ఇచటి వాతావరణము సౌమ్యమై వ్యవసాయమునకు అనుకూలముగా నుండును. ఈ దీవులన్నిటిలోను జనసంఖ్య ఎక్కుడుగా నున్నది.

గ్రీకుదేశము ఇతర బాల్కనుదేశముల వలె, వ్యవసాయమే ప్రధానవృత్తిగాకలది. దేశమందలి పాటకజనులలో నూటికి 63 మంది కర్షకులే. భూములు సారవిహీనములు; భూవసతి స్వల్పము; వ్యవసాయపద్ధతులు పురాతనమైనవి. అందుచేత ఫలసాయము స్వల్పముగా నుండును. అధిక భాగమందు సక్రమముగా పంటలను, ఎరువులను మార్చుట జరుగదు. గోధుమ, ఆలివ్, ద్రాక్ష, పొగాకు ముఖ్యమగు పంటలు. ద్రాక్ష, ఆలివ్ నూనె, కిస్‌మిస్, పొగాకు కూడ ఇక్కడి ముఖ్యమగు ఎగుమతులు. వ్యవసాయ రంగమందు పూర్వముకంటె మేలైన పద్ధతులు, పరికరములు ఇందు ప్రవేశపెట్టు విషయములో అమెరికాదేశము సహాయము చేయుచున్నది. గ్రీసుదేశములో కొద్ది మొత్తములలో లిగ్నైటు, సీసము, మేగ్నసైటు, బాక్సైటు, ఎమెరీ (Emery) అను ముఖ్యములగు ఖనిజములు లభించుచున్నవి. బొగ్గు దొరకదు. ఇనుప గనులు తక్కువ. అందుచే ఇచట యెట్టి ఉత్పాదక పరిశ్రమలు అభివృద్ధి కాజాలకున్నవి. ముడి ఖనిజములే ఎగుమతి చేయబడుచున్నవి. ఉన్ని, తోళ్ళు, పొగాకు, ప్రత్తి- వీటికి సంబంధించిన లఘుపరిశ్రమలు ముఖ్యముగా ఏథెన్సు, థెస్సెలోనికా, అను పట్టణములలో నెలకొని యున్నవి. ఈ పరిశ్రమలలో అధికభాగము టర్కీనుండి వలసవచ్చిన గ్రీకులచే ప్రవేశపెట్టబడినవి. యంత్రసామగ్రి, రాసాయనికములు, లోహసామగ్రి, నేత లేక అల్లిక వస్తువులు (textiles), ఇంకను కావలసిన ఇతరసామగ్రి గ్రీసుదేశము దిగుమతి చేసికొనుచుండును.

ప్రదేశముయొక్క నిమ్నోన్నత స్వభావమునుబట్టి అవసరమగు రవాణాసౌకర్యములు బాగుగా అభివృద్ధి చెందలేదు. తీరపుమైదానములు అనేకములు సముద్రము గుండా ఇతరప్రాంతములతో విశేషసంబంధమును కలిగి యున్నవి. ఇరుగుపొరుగున నుండు లోయలతో రవాణా సంబంధములు లేకుండుటచే పూర్వకాలమున అనేకములగు చిన్న చిన్న నగరరాష్ట్రములు ఏర్పడియుండెను. గ్రీకులు నౌకాయాన సంప్రదాయమున పెంపొందుటకు కూడ ఇదియేకారణము. గ్రీకులు గొప్పనావికులు. వారికి వ్యాపారోపయోగ కరమైన నౌకా సంపత్తి విస్తారముగా కలదు. మంచి రోడ్లు స్వల్ప సంఖ్యాకములు మాత్రమే కలవు. పర్వత ప్రాంతములందు నాటుదారులు మాత్రమే కలవు. గ్రీసు ద్వీపకల్పముయొక్క పశ్చిమ భాగమున రైలు మార్గ మొకటికూడలేదు. తూర్పు తీరమున థెస్సెలోనికా (సొలోనికా) నుండి ఏథెన్సు నగరమునకు ఒకే ఒక ప్రధానమైన రైలు మార్గము కలదు. పెలెపోనిసస్ యొక్క పశ్చిమ తీరము వెంబడి మెస్సీనా సింధుశాఖ మీదనున్న కలమటా గుండా ఈ రైలుమార్గము పొడిగింపబడినది. థ్రేస్, థెస్సాలె, అట్టికాలలో చిన్న శాఖామార్గములు కలవు. మధ్య గ్రీసులో కాని, పశ్చిమ గ్రీసులోకాని రైలుమార్గ మేదియులేదు. దేశమందలి మొత్తము రైలు మార్గము పొడవు 1700 మైళ్లు. ఏథెన్సు నగరము యూరపు నందును, ఆసియా యందునుగల అన్ని ముఖ్యపట్టణములతోను విమాన మార్గములచే కలుపబడి ఉన్నది. గ్రీసులో దేశీయ వాయుమార్గములుకూడ కలవు. ఇప్పటికిని గ్రీసులో పెక్కు భాగములలో రోడ్లుగాని, రైలుమార్గములుగానిలేవు. రహదారి సౌకర్యములు అభివృద్ధి పరచబడినచో, పరిశ్రమలు చక్కగా నిర్వహింపబడుచో గ్రీసుయొక్క ప్రాచీన ఆలయములు, స్మారక చిహ్నములు కారణముగా వచ్చుచు పోవుచుండు యాత్రికుల మూలమున ఆదాయ మేర్పడి, అదియొక పరిశ్రమగా నెలకొన

535