Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/591

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గ్రీసుదేశము (భూ)

తీరమును చేరును. అచట శీతాకాలమందు వర్షములు మిక్కుటముగా నుండును. భూమి వ్యవసాయమునకు అనుకూలముగ నుండును. జనాభా దట్టముగ నుండును. అచట గోధుమ, ద్రాక్ష, పొగాకు, ఆలివు, మొక్కజొన్న పండును. భూమి స్వల్పభాగములుగ విభజింపబడి యుండును. వ్యవసాయ పద్ధతులు మిక్కిలి అనాగరికముగ నుండును. అమెరికా దేశముయొక్క సాంకేతిక సాహాయ్యమువలన వ్యవసాయపద్ధతి క్రమమగు అభివృద్ధి నొందుచున్నది.

గ్రీసు దేశమంతటిలోను తూర్పు గ్రీసు చారిత్రకముగా అత్యంత ప్రాముఖ్యము కలది. ఇచట ఏథెన్సు, డెల్ఫి, థెహెస్ మున్నగు ప్రసిద్ధమయిన ప్రాచీన నగరములు కలవు. కాని వీటిలో ఏథెన్సు తప్ప మిగిలినవి ఇవుడు ఎట్టి ప్రాముఖ్యములేని చిన్న పల్లెలుగా నున్నవి. మధ్య పర్వత శ్రేణులు చిన్నచిన్నవి అనేకములు తూర్పుగాను. దక్షిణముగాను వ్యాపించి యున్నవి. వీటిమధ్య కొద్దిపాటి వండలినేలలు ఏర్పడి యున్నవి. ఇట్టి నేలలలో కిఫిస్సాస్ (దీనికి బొయోషియా అని ప్రాచీన గ్రీకు పేరు) అనునది మిక్కిలి పెద్దది. ఇది లోతులేని ఒక పెద్ద సరస్సు వట్టి పోవుటచే ఏర్పడి యుండెను. అటికామైదానము ప్రాచీన గ్రీకునాగరకతకు పీఠమై యుండుటచే దీనికంటె చిన్న దైనను ఎక్కుడు ప్రసిద్ధమైనది. కొన్ని గుట్టలు విడిగా నున్నవి. వాటిలో నొక దానిమీద ఏథెన్సుకు చెందిన ప్రసిద్ధమగు ఎక్రోపోలిస్ (Acropolis) కలదు. గ్రీసు యొక్క ముఖ్యపట్టణమగు ఏథెన్సు నగరము మొట్టమొదట గుట్టమీద వృద్ధి చెందెను. కాని మిక్కిలి విస్తరించి యుండుటచే సాలామిస్ (Salamis) సింధుశాఖలో నున్న పిరాయెన్సు రేవు నేడు దీనిలో చేరి యున్నది. ఏథెస్సు గ్రీకు ద్వీపకల్పమందు మిక్కిలి దక్షిణముగా నున్నప్పటికిని దీని ప్రాచీనకాలిక సంబంధమును బట్టియు, ఏజియన్ సముద్రమందు మధ్యగా నుండుటను బట్టియు ఇది యిప్పటికిని ప్రధాననగరముగా వరలుచున్నది. ఇప్పు డీనగరము గ్రీసుదేశమునం దెల్ల పెద్ద నగరమైయున్నది. ఇందు సమస్త ఆధునిక సౌకర్యములు కలవు. పిరయెన్సు నందును, ఇందును కలిసి 1951 వ లెక్కల ననుసరించి 1,378,586 మంది జనులున్నారు. దేశముయొక్క ఈ భాగమందు శీతకాలమున స్వల్పముగా వానపడును. వేసవి ఉష్ణముగ నుండును. జులై నెలలో సగటు ఉష్ణోగ్రత 80 ఫారన్‌హీటు డిగ్రీలవరకు పెరుగును. ధాన్యపు పంటలు, పండ్లతోటలు నీటిపారుదలమీద ఆధారపడును. పండ్లు, పొగాకు తూర్పుమైదానమునుండి ఎగుమతి చేయ బడును.

మధ్యగ్రీసునందలి పర్వతములకు తూర్పుభాగమున నదులచే కోయబడిన కొండల వరుసలు కలవు. వీటి ఎత్తు తక్కువ. ఉత్తరమున నున్న థెస్సలి మైదానము విశాలమైనది. అందు సారవంతములగు వండలి నేలలు కలవు. కాని వరదల మూలమున ఆ ప్రదేశమందు మలేరియాకు అనుకూలమగు శీతోష్ణస్థితి ఏర్పడినది. అందుచే అచట కొన్ని చిన్న నగరములు, పెక్కు గ్రామములు కలవు. వీటియందు నీటిపారుదల సహాయమున వ్యవసాయము చేయబడుచుండును. త్రిక్కాల, లారిస్సా అనునవి ఈ ప్రాంతమునకు ముఖ్యకేంద్రములు. లారిస్సా నగరము థెస్సలోనికానుండి ఏథెన్సుకు పోవు రైలుమార్గముమీద నున్నది. ఈ రైలుమార్గము ప్రసిద్ధమైన ఒలింపస్‌కొండ (ప్రాచీన గ్రీకుదేవతలకు నిలయము) కును, ఒస్సా అను కొండకును మధ్యనున్న లోయగుండా మైదానములలోనికి ప్రవేశించును. అట్లాంటే కాలువచే దేశముయొక్క ప్రధానభాగమునుండి ఇబోయియా అను ద్వీపము వేరు చేయబడినది. ఇది కొండల వరుసలతో ఇరుకుగా నున్నది. ఇది విచ్ఛిన్నమగు తీరపుమైదానములతో కూడియున్న దేశముయొక్క ప్రధానభాగమును విశేషముగా పోలియున్నది. పెలోపొన్నెసస్ అనునది కోరింత్, ఏజినా అను లోతైన, ఇరుకైన సింధుశాఖలచే ద్వీపకల్పరూపమున నున్న గ్రీసుభాగమునుండి వేరుచేయబడి, దానితో కోరింత్ అను ఇరుకైన భూసంధిచే కలుపబడియున్నది. కోరింత్భూ సంధియొక్క వెడల్పు 31/2 మైళ్ళుమాత్రమే. దీని గుండా ఓడలు పోవుటకు వీలగు ఒక కాలువ త్రవ్వబడుటతో పెలో పొన్నెసస్ పూర్తిగా ఒక ద్వీపముగా మారినది. ఈ కోరింత్ కాలువ ఏర్పడుటవలన గ్రీసుయొక్క తూర్పుభాగమునుండి పశ్చిమభాగమునకు సముద్రమార్గమున పోవలసిన గొప్ప దూరము తగ్గిపోయినది.

'పెలో పొన్నెసస్' పిండస్ పర్వతములయొక్క పొడి

533