Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/579

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గ్రీసుదేశము (చ)

పలాయన మొనర్చిరి. ఈ విధముగ ఏథెన్సు రాజ్యమువారు గ్రీకుదేశపు కీర్తి గౌరవములను నిలువబెట్టిరి.

చిత్రము - 140

పటము - 2

గ్రీక్ రాజనీతివేత్త పరిపాలకుడు - పెరిక్లీస్

ఏథెన్సురాజ్యపు స్వర్ణయుగము- పెరిక్లీసు పరిపాలనము : పారసీక యుద్దములలో విజయము సంపాదించిన తరువాత, ఏథెన్సురాజ్యము చాల బలపడెను. వారు సామ్రాజ్య నిర్మాణమునకు పూనుకొనిరి. క్రీ. పూ. 460-429 వరకును రాజనీతిజ్ఞుడును, మహాసమర్థుడు నైన పెరిక్లీసు అను నాతడు ఏథెన్సు రాజ్యమును పాలించెను. ఈతడే ఏథెన్సు నగరముచుట్టును బలమైనకోటను కట్టించెను. పెరిక్లీసు అనేక సంస్కరణలను గావించి, ఉత్తమమగు ప్రజాస్వామ్య పరిపాలనమును నెలకొల్పెను. ఏథెన్సు నివాసులను ఉత్తమపౌరులను గావించుట ఈతని ఆశయము. పెరిక్లీసు కాలమున ఏథెన్సునగరము నందలి ఎథీనీదేవత యొక్క దేవాలయము సర్వాంగ సుందరముగ పునర్నిర్మింపబడెను. ఈతని కాలమున శాస్త్రములును, గ్రీకు సారస్వతమును అత్యద్భుతముగ పెంపొం దెను. పెరిక్లీసుయుగము ఏథెన్సు రాజ్య చరిత్రలో స్వర్ణయుగముగా కొనియాడబడుచున్నది.

పెలో పొనీసియన్ యుద్ధములు - పౌర రాజ్యముల పతనము : పారసీకుల నోడించి, పారద్రోలిన అనతికాలము లోనే గ్రీకు పౌర రాజ్యములలో కలతలు, విభేదములు ప్రారంభమయ్యెను. గ్రీకురాజ్యముల కూటమి యొకటి ఏర్పడెను. దానికి నాయకత్వము నెవరు వహింపవలెనను విషయమున ఏథెన్సు స్పార్టా రాజ్యములకు వైర మేర్పడెను. తత్ఫలితముగ ప్రారంభమైన యుద్ధములే “పెలోపొనీసియన్ యుద్ధములు". ఈ యుద్ధములలో ఏథెన్సు బలము క్షీణించెను. కొంతకాలమువరకు (క్రీ. పూ. 404-377) గ్రీకురాజ్యములకు స్పార్టా నాయకత్వము వహించెను. కాని త్వరలోనే మరల అంతఃకలహములును యుద్ధములును చెలరేగెను. పౌర రాజ్యములన్నియు ఈ పోరాటములవలన క్రీ. పూ. 362 వ సంవత్సరమునాటికి పూర్తిగా దుర్బలములును, తేజోవిహీనములు నయ్యెను.

చిత్రము - 141

పటము - 3

గ్రీక్ చరిత్ర రచయిత హెరోడటస్

గ్రీకుల నాగరికత - సంస్కృతి: ప్రాచీన యుగమునాటి జాతులలో గ్రీకులు అత్యుత్తమమగు నాగరికతను, సంస్కృతిని పెంపొందించుకొనిరి. గ్రీకు సారస్వతము కూడ అత్యున్నతస్థాయినందు కొనెను. భారతీయులకు వాల్మీకివలె, గ్రీకులకు హోమరు ఆదికవి యయ్యెను. ఇతడు రచించిన “ఇలియడ్", “ఒడెస్సీ” అను మహా కావ్యములు జగత్ప్రసిద్ధములు. ఎస్కైలెస్, (క్రీ. పూ. 525–456), సోఫోక్లీసు (క్రీ. పూ. 496-406), యురిపిడిస్ (క్రీ. పూ. 480 - 406) అను గ్రీకుకవులు ఉత్తమమగు నాటకములను రచించి ఖ్యాతిగాంచిరి. చరిత్ర రచనారంగమున కూడ గ్రీకులు చాల కీర్తిని గడించిరి. హెరోడోటస్, థ్యూసిడైడ్స్, జెనోఫన్ అనువారలు గొప్ప గ్రీకుచారిత్రికులై వరలిరి.

గ్రీకులలో విద్యాభ్యాసము: గ్రీకులు తమ బాలకులకును, బాలికలకును చక్కగ విద్య గరపెడివారు. వారి పాఠశాలలలో చదువుట, వ్రాయుట, లెక్కలు, కవిత్వము సంగీతము బోధింపబడుచుండెను. పైథాగరస్, ప్లేటో, అరిస్టాటిల్ మున్నగువారు “అకాడమీలలో” ఉన్నత విద్యలను బోధించెడివారు. గ్రీకు విద్యావిధానములో శరీర వ్యాయామమునకు కూడ ప్రత్యేకస్థాన ముండెను. వ్యక్తిని సంపూర్ణ మానవునిగా జేయుటయే వారిలక్ష్యము.

మతము : వైదికార్యులవలెనే గ్రీకులు ప్రకృతి దేవతలను ఆరాధించుచుండిరి. వారి ప్రధాన దైవమయిన జ్యూస్ మన పురాణములలోని ఇంద్రుని పోలియుండును. తమ దేవతలు ఒలింపస్ కొండపై నివసింతురని గ్రీకులు భావించెడివారు. వారు తమ దేవతలకొరకై ఆలయము

525