Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/548

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గౌతమీపుత్త్రశాతకర్ణి

16. కన్నడగ్రంథములు.

17. ఓఢ్రగ్రంథములు.

18. సంపుటములు.

19. తాళపత్ర గ్రంథములు, తెలుగు, సంస్కృతము వ్రాతప్రతులు కలవు.

ఇంతేకాక ఇండియాకును, ప్రపంచమునకును సంబంధించిన చరిత్రకును, సారస్వతమునకును, వివిధశాఖలకును చెందిన ఆంగ్ల గ్రంథములును, పత్రికలును ఈ గ్రంథాలయమున గలవు.

ఇట్లు వివిధ అమూల్యగ్రంథములు గల ఈ గ్రంథాలయము నేడు సాహితీపరుల దృష్టిని విశేషముగ ఆకర్షించి యున్నది. ముందుతరములవారికి గూడ ఉపయోగకారిగ నుండగలదు. ఈ గ్రంథాలయమునకు విశాలమైన ఆవరణము గలదు. ఇందు గ్రంథాలయ ముఖ్య కార్యకర్తలలో నొకరగు శ్రీకంచుమర్తి వేంకట సీతారామచంద్రరావు గారు తమ కూతురి స్మారకచిహ్నముగ 'శ్రీ కంచుమర్తి బాబాయమ్మ మెమోరియల్ హాలు' అను పేరున పెద్ద హాలుగల మేడను నిర్మింపించి ఇచ్చియున్నారు. ఈ హాలు సాహిత్యసభలు, సమా వేశములు, సంగీత కచ్చేరీలు, హరికథలు, భరతనాట్యములు మొదలగు ప్రజాహిత కార్యక్రమములకు మిక్కిలి ఉపయోగపడుచున్నది.

బో. శి.


గౌతమీపుత్త్రశాతకర్ణి :

దాదాపు నాల్గున్నర శతాబ్దముల కాలము దక్షిణా పథమునందు ఏకచ్ఛత్రాధిపత్యము నెరపి, ఆంధ్రులకు గర్వకారణమై యొప్పిన వంశము శాతవాహన వంశము. ఇట్టి మహావంశమునందు ఉద్భవించిన విజేతలలో, మేధావులలో, గౌతమీపుత్ర శాతకర్ణి మిక్కిలి కొనియాడ దగినవాడు. ఇతడు చిరస్మరణీయమైన గౌతమీబాలశ్రీ కుమారుడు. శివస్వాతి మహారాజు ఈతని తండ్రియని కొందరు తెల్పుచున్నారు. కాని ఈ యంశము వివాదాస్పదము. శివస్వాతి తరువాత ఆంధ్ర సామ్రాజ్యలక్ష్మిని వరించి పట్టము కట్టుకొనిన మహావీరుడు గౌతమీపుత్త్రశాతకర్ణి.

గౌతమీపుత్త్ర శాతకర్ణికి పూర్వము శాతవాహన సామ్రాజ్య పరిస్థితులు మిక్కిలి క్లిష్టముగను, సందిగ్ధముగను ఉండెను. ఉత్తర హిందూస్థానమునందలి కుషాణుల విజృంభణము వలనను, హాలశాతవాహనుని తరువాత వచ్చిన పాలకులు సమర్థులు కాక పోవుట వలనను, క్షహరాటులును, ఉజ్జయినీ క్షాత్రపులును శాతవాహన సామ్రాజ్యముయొక్క పశ్చిమ భాగమును, పశ్చిమోత్తర దేశమును ఆక్రమించుకొని పరిపాలనము సాగించుచుండిరి. పాటలీపుత్త్రముపై ఆంధ్రుల ఆధిపత్యము అంతరించి యుండెను. శకులు దేశమున బహుభాగముల నాక్రమించి స్వతంత్రరాజ్యముల నెలకొల్పిరి. ఇట్లు అరాజకము ప్రబలుటయే గాక నాటి హిందూసంఘమునందు గూడ కల్లోలము లేర్పడినట్లు గోచరించును. నహపాణుడు మున్నగు క్షహరాటులును, రుద్రదాముడు మున్నగు ఉజ్జయినీ క్షత్రపులును విదేశీయులయ్యు, హిందూమతము నవలంబించి క్షత్రియోచితములగు రాజ, మహరాజ బిరుదములను వహించిరి. ఇతర ప్రాంతములందు కొందరు యవనులు హిందూ మతావలంబకులైరి. ఇట్టి సంక్షుభిత వాతావరణమున గౌతమీపుత్రుడు క్రీ. శ. 78 ప్రాంతమున సింహాసనము నధిష్ఠించి క్షీణదశలో నున్న శాతవాహనవంశ కీర్తి ప్రాభవములను సముద్ధరించుటయేగాక గొప్ప విజేత యయ్యెను.

ఆత్మరక్షణము, వంశగౌరవ పాలనము ఇతనిని విజయ యాత్రోన్ముఖుని జేసినవి. వైజయంతీ సైన్యముయొక్క విజయస్కంధావారమునుండి చేయబడినదాన శాసనమును బట్టియు, గౌతమీబాలశ్రీ వేయించిన నాసిక శాసనమును బట్టియు ఇతడు రెండు విజయయాత్రలను చేసినట్లు తెలియుచున్నది. ఇతడు మొదట పశ్చిమ దిగ్విజయము చేసి యుండును. దీనిని ఫలితముగనే ఇతనికి అసిక, అసక, ముళక, సురఠ, కుకుర, అపరాంత, అనూప, విదర్భ, అక రావంతి అను రాజ్యములు లభించెను. ఇతని పశ్చిమ దిగ్విజయము ప్రాగాంధ్రము నుండి ప్రారంభింపబడి మహోత్సాహముతో వరుసగ, ముళక, అసిక, అకరా వంతి, విదర్భ, సౌరాష్ట్రముల విజయముతో పూర్తి గావింపబడెను. పశ్చిమ దిగ్విజయమును ముగించుకొని, ఈ రాజు దక్షిణ దిగ్విజయమునకు బయలుదేరెను. నాడు ఆంధ్ర ద్రవిడదేశముల మధ్యభాగమున అరువలారును, నాగులును ప్రబలురుగ నుండిరి. శాతకర్ణిమహారాజు

495