విజ్ఞానకోశము - 3
గోదావరిజిల్లా (పశ్చిమ)
హైస్కూళ్లు 42 ; బేసిక్ ట్రైనింగ్ పాఠశాలలు 3 ; వికలాంగుల బడి 1; బాలుర మిడిల్ స్కూళ్ళు 6; ఎలిమెంటరీ పాఠశాలలు 1,576; బేసిక్ పాఠశాలలు 52; వయోజన విద్యాలయములు 33 కలవు. కుష్ఠరోగుల కొరకై ఒక విద్యాలయము నరసాపూరు నందు కలదు.
భారీపరిశ్రమలు : ఈ జిల్లాలో బియ్యపు మిల్లులు ప్రధానమై యున్నవి. మొత్తము 97 మిల్లులు కలవు. ఒక గోనెసంచుల మిల్లు ; 11 తోళ్ళ కార్ఖానాలు; 9 పొగాకు బేరనులు ; 9 ఉక్కు పెట్టెలుచేయు కార్ఖానాలు గలవు. వీటిలో మొత్తము 9,492 మంది కార్మికులు పనిచేయుచుండిరి.
కుటీరపరిశ్రమలు : నరసాపూరు, చింతలపూడి తాలూకాలయందు భారీ పరిశ్రమలు లేవు. మిగిలిన తాలూకాల యందు 127 ఫ్యాక్టరీలు గలవు. నూలునేత, నూలు అద్దకము, ఉన్ని వడకుట, నేయుట, పట్టునేత, త్రాళ్ళను పేనుట, నూనె గానుగలు, పొగాకుతో బీడీలు మొదలగు వస్తువులను తయారొనర్చుట, కుండలు జేయుట, తట్ట లల్లుట, పాడి చేయుట, బెల్లము వండుట, జరీ అల్లికలు అల్లుట - ఈ జిల్లాలోని ముఖ్యమగు కుటీర పరిశ్రమలు.
మతము : హిందువులు 15,64,551; క్రైస్తవులు 99,005; ముస్లిములు 34,147 ; జైనులు 4; ఇతరులు 20 మంది. మొత్తము 16,97,727 మంది జనాభా గలదు.
భాషలు : మాట్లాడువారి సంఖ్య : (1) తెలుగు 16,47,308 ; (2) ఉరుదు 22,979; కోయభాష 19,812; తమిళము 1,908 ; హిందీ 1,320; హిందుస్థానీ 1,022; ఒరియా 786 ; లంబాడీ 610; కన్నడము 589 ; మళయాళము 490 ; బెంగాలీ 287 ; మరాఠీ 250 ; కొరవ 220 ; గుజరాతీ, అరబిక్, ఇంగ్లీషు మాట్లాడువారు బహు అల్ప సంఖ్యాకులుగ నున్నారు.
చరిత్ర : పశ్చిమగోదావరి జిల్లా వేంగి దేశములోని భాగమైయుండెను. గోదావరినది వేంగీదేశమును కళింగ దేశమునుండి వేరుచేయుచుండెను. క్రీ. పూ. మూడవ శతాబ్దమునుండి సుమారు నాలుగున్నర శతాబ్దములు ఈ ప్రాంతమంతయు శాతవాహన సామ్రాజ్యములో చేరియుండెను. ఆనాడు గోదావరీ ముఖద్వారమువద్ద ప్రాలూరను రేవుపట్టణముప్రసిద్ధిచెంది యుండెనని “టాలెమీ” అను భూగోళ శాస్త్రజ్ఞుని వ్రాతలనుబట్టి తెలియుచున్నది. ఈ జిల్లాలోని గుంటుపల్లి అను గ్రామములో నొక బౌద్ధ సంఘారామము ఆకాలమందుండి యున్నట్లును, ఆసంఘారామములో “సూయజ్ఞ నాథుడ”ను శ్రమణకుడు బౌద్ధమతాన్ని బోధించినట్లును, అక్కడ దొఱకిన శాసనాలను బట్టి తెలియుచున్నది. శాతవాహనుల తరువాత ఇక్ష్వాకులు ఈ ప్రాంతమునకు పాలకులైరి. వీరు మొదట శాతవాహనులకు సామంతులుగా ఉండిరి. వారు బలహీనులైన సమయములో స్వతంత్రులైరి. తరువాత కృష్ణా, గోదావరీనదుల మధ్యప్రాంతమును బృహత్ఫలాయనులు పరిపాలించిరి. క్రీ. శ. నాలుగవ శతాబ్దములో శాలంకాయనులు వేంగీదేశమున కధిపతులయిరి. వీరికాలముననే వేంగీనగరము రాజధానిగా నిర్మించుకొనబడెను. తరువాత 500 సంవత్సరములవరకు వేంగీనగరము ఆంధ్రపాలకులకు ముఖ్యనగరమై యుండెను. తూర్పు చాళుక్యరాజైన మొదటి అమ్మరాజు రాజధానిని వేంగి నుండి రాజమహేంద్రవరమునకు మార్చెను (క్రీ. శ. 10వ శతాబ్దములో). శాలంకాయనుల తర్వాత విష్ణుకుండినులు అధికారమునకు వచ్చిరి. వీరి రాజధాని ఏలూరునకు సమీపమందున్న దెందులూరు. ఈ వంశపు రాజైన మూడవ మాధవవర్మకు, చాళుక్యరాజైన రెండవ పులకేశికి కొల్లేటి చెరువుదగ్గర పెద్దయుద్ధము జరిగెను. ఆ చాళుక్యులే తరువాత వేంగీచాళుక్యులై ఆంధ్రను పాలించిరి. వీరినే తూర్పుచాళుక్యు లందురు. వీరి తర్వాత 14వ శతాబ్దములో వెలనాటి చోడులు పశ్చిమ గోదావరీ ప్రాంతమును ఏలిరి. 13వ శతాబ్దములో కాకతీయులు ఇతర తీరపుజిల్లాలతోపాటు, వేంగీప్రాంతమును కూడ లోబరచుకొనిరి. కాకతీయులు ఢిల్లీ సుల్తానులచే ఓడింప బడగా, కాకతీయసామ్రాజ్యము ఢిల్లీ చక్రవర్తుల వశమయ్యెను. మహమ్మదీయులను ధిక్కరించి, కొండవీటి రాజులు ఆంధ్రను ఏలిరి. రాజమహేంద్రవరపు రెడ్డి రాజులకు, కొండవీటి రెడ్డిరాజులకు అనేక యుద్ధములు జరుగుచూ వచ్చెను. 1424 లో కొండవీటిరాజ్యము పతనమయ్యెను. ఏలూరుకోట కొండవీటిరాజులు నిర్మించినదే. తరువాత విజయనగర చక్రవర్తులు మిగతా ఆంధ్రప్రదేశముతోపాటు దీనినిగూడ వశపరచుకొనిరి. తళ్ళికోట
463