Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/513

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గోదావరిజిల్లా (పశ్చిమ)

సంగ్రహ ఆంధ్ర

యుద్ధములో (1565 లో) గోలగొండ సుల్తానులు విజయనగరాధిపతుల నోడించి ఆంధ్రదేశమును లోబరచుకొనిరి. 1628 లో గోలకొండ నవాబుల అనుమతితో డచ్చివారు నరసాపురములో ఇనుప ఫ్యాక్టరీని నిర్మించుకొనిరి. దానికి సమీపములోనున్న మాధవాయిపాలెంలో ఆంగ్లేయులు 1677 లో ఒక ఫ్యాక్టరీని నిర్మించుకొనిరి. నిజాం ఉల్ ముల్కు మరణానంతరము సలాబత్‌జంగును గోలకొండ సింహాసనము ఎక్కించినందుకు వానిచేకోస్తాజిల్లాలు ఫ్రెంచివారి కీయబడెను. తరువాత విజయనగరంరాజు సహాయముతో ఇంగ్లీషు సేనానియగు కల్నల్ ఫోర్డు ఫ్రెంచివారి నోడించి సలాబత్ జంగునుండి కోస్తాజిల్లాలను ఇంగ్లీషువారికి సంక్రమింపజేసెను.

1925 వరకు పశ్చిమ గోదావరిజిల్లా వేరుగా లేకుండెను. ఈ భాగమంతయు కొంత కృష్ణాజిల్లాలోను, కొంత తూర్పు గోదావరిజిల్లాలోను చేరియుండెను. 1925 ఏప్రిల్ 15 వ తేదీన తూర్పుగోదావరి జిల్లానుండి పోలవరం తాలూకాను, కృష్ణాజిల్లా నుండి మిగిలిన తాలూకాలను వేరుచేసి పశ్చిమ గోదావరి యను జిల్లా నేర్పాటుచేసిరి.

చ. హ.

II

చారిత్రక ప్రాముఖ్యముగల స్థలములు :

1. ఏలూరు : ఇది పూర్వము కొంతకాలము రెడ్డి రాజులకు ముఖ్యపట్టణముగ నుండెను. ఇపుడు మ్యునిసిపల్ పాఠశాల, తాలూకా కార్యాలయములున్న తావున రెడ్డిరాజులు కట్టించిన కోటయుండెడిది. అది ఇపుడు శిథిలమైనది. 1480 (క్రీ.శ.) వరకు ఉత్తరమునుండి ఒరిస్సా రాజు సైన్యములును, వాయువ్యమునుండి ముసల్మాను సైన్యములును, పడమటినుండి విజయనగర సైన్యములును ఏలూరు పరిసరప్రాంతమును వశపరచుకొనుటకు యుద్ధములు చేయుచుండెడివి. 16వ శతాబ్దమున ఏలూరు గోలకొండ నవాబులకు స్వాధీనమయినది. ఆతరువాత మొగల్ రాజ్యమునకు దక్కన్ సుబేదారుగా నున్న నిజామునకు లోబడి క్రమముగా బ్రిటిష్ పరిపాలనకు వచ్చినది. బ్రిటిష్ ప్రభుత్వ మేర్పడిన తరువాత ఏలూరు మచిలీపట్నము జిల్లాలో నుండెడిది. 1859 లో దీనిని గోదావరి జిల్లాలో చేర్చిరి. 1925 లో పశ్చిమ గోదావరిజిల్లా ప్రత్యేకముగా నేర్పడిన తరువాత నిది దానికి ముఖ్యస్థానమైనది .

2. పెదవేంగి : ఇది ఏలూరు సమీపమున నున్నది. తూర్పు చాళుక్య రాజ్యమునకు మూలపురుషుడయిన కుబ్జవిష్ణువర్ధనుడు ఇచటనే తూర్పు చాళుక్యరాజ్యమును స్థాపించెను. అతని కాలమునుండి అనగా క్రీ.శ. 642 నుండి 935 సం॥ వరకు నిది ఆ రాజ్యమునకు రాజధానిగా నుండెను. ఇతఃపూర్వము గోదావరి మండలమును పాలించిన సాలంకాయన రాజులకుగూడ వేంగి రాజధానిగా నున్నట్లు తెలియుచున్నది. సాలంకాయనులచే నిర్మితమైన సూర్యదేవాలయ మిచ్చట శిథిలావస్థయందున్నది. ఈ వంశపురాజగు విజయనందివర్మ సూర్యవిష్ణు భక్తుడనియు, ఇచటి విష్ణ్వాలయమున కనేక దానములుచేసి నాడనియు పెదవేంగి శాశనమువలన తెలియుచున్నది. వేంగీనగర మా ప్రాంతమున నుండుటచేతనే ఆంధ్రతీర ప్రదేశమునకు వేంగిమండలమని పేరువచ్చినది.

3. దెందులూరు : ఇది వేంగి సమీపమున నున్నది: విష్ణుకుండినరాజులకు ముఖ్యపట్టణముగా కొంతకాలము గౌరవము పొందినది.

4. నరసాపురము : ఇచట క్రీ. శ. 1665వ సం॥లో డచ్చివారు ఇనుపకార్ఖానాను నిర్మించినారు. 1677 సం॥న నరసాపురమునకు ఉత్తర భాగముననున్న మాధవాయ పాలెమను గ్రామమును, ఆంగ్లేయు లాక్రమించి ఒక ఫ్యాక్టరీ స్థాపించిరి. 1658 లో పరాసువారుకూడ ఒక కర్మాగారమును ఇచట నెలకొల్పిరి.

5. ప్రాలూరు ఓడరేవు : క్రీ. పూ. 3 శతాబ్దము మొదలుకొని సుమారు నాలుగున్నర శతాబ్దములవరకు శాతవాహనరాజులచే పరిపాలింపబడిన ఆంధ్రభూభాగమున పశ్చిమ గోదావరి జిల్లాకూడ ఉండెను. వీరికాలమున గోదావరీ ముఖమునందు ప్రాలూరు అను రేవుపట్టణము ఉండెడిదని టాలెమీ యను గ్రీకు భూగోళశాస్త్రజ్ఞుని వ్రాతలను బట్టి తెలియుచున్నది. కాని ఈ రేవుపట్టణ మిపుడు కనిపించదు. బహుశః ఇది సముద్రగర్భమున కలిసియుండవచ్చును.

6. గుంటుపల్లి బౌద్ధారామము : ఏలూరు తాలూకా గుంటుపల్లిలో శాతవాహనుల బౌద్ధసంఘారామ మొకటి

464