గోదావరిజిల్లా (పశ్చిమ)
సంగ్రహ ఆంధ్ర
దలను పొందుచున్నది. చింతలపూడి తాలూకాయందు తమ్మిలేరు, ఎఱ్ఱకాల్వ, జల్లేరనెడి ముఖ్యమగు కొండ వాగులు కలవు. వాని కడ్డకట్టలు లేని కారణమున అధిక ప్రయోజనము నీయజాలకున్నవి. తమ్మిలేరుపై అడ్డకట్ట నిర్మింప బడుచున్నది. కొవ్వూరు తాలూకా యందు రాళ్ళమడుగు కాల్వ వ్యవసాయోపయోగి. గుండేరు, కొల్లేరు సరసు ఏలూరు తాలూకా భూముల కుపయోగ పడుచున్నవి. యనమదుర్రు, ఉప్పుటేరు కాల్వలు భీమవరము తాలూకాయందు ప్రధానమగునవి నరసాపురం కాల్వ, గోస్తనీ నది, వేలూరుకాల్వ, అత్తిలి బ్యాంకు కాలువలు ముఖ్యములు. కానూరు లంక కాల్వ ప్రణాళికను ప్రభుత్వము అమలుచేయుచున్నది.
ఈ జిల్లాలో 976 చిన్న రకపు నీటి వనరులు కలవు. వీటిక్రింద 38,899.69 ఎకరముల ఆయకట్టు గలదు. పెద్ద రకపు నీటి వసతులక్రింద మొత్తము 7,45,883 ఎకరముల ఆయకట్టు గలదు.
పంటలు: నరసాపూరు తాలూకా యందలి పాలకొల్లును, చింతలపూడి తాలూకాయు నారింజపండ్ల (Batavian Oranges) తోటలకు ప్రసిద్ధములు. తణుకు, నరసాపూరు తాలూకాలయందు కొబ్బరి తోట లధికము. ఈ జిల్లాయందు వరి ధాన్యము ముఖ్యమగు ఆహారపు పంట. చోళులు, కంబు, రాగి, కొర్ర, వరుగు, సమాయి (Samai), జొన్నలు కూడ పండుచుండును. మెరప, చెఱకు, వేరుశెనగ, పొగాకు ఇక్కడ పండు వ్యాపారపు పంటలు. బియ్యము ఈ జిల్లానుండి ఇతర ప్రాంతములకు విరివిగా ఎగుమతి చేయబడును.
రహదారులు: ఈ జిల్లానుండి రహదారిబాటలు, కృష్ణాజిల్లా యందలి విజయవాడ, గుడివాడలకు వ్యాపించు చున్నవి. రోడ్ల నిడివి 1,172 మైళ్లు. ఇందు 40 మైళ్లు జాతీయ రహదారి మార్గములు. 47 మైళ్లు రాష్ట్రీయ మార్గములు; 515 మైళ్లు జిల్లా పెద్దబాటలు; 110 మైళ్లు ఇతర జిల్లా రోడ్లు; 348 మైళ్లు గ్రామ మార్గములు; 17 మైళ్లు పబ్లిక్ వర్క్సు మార్గము (Public Works), 95 మైళ్లు మునిసిపల్ మార్గములుకలవు. కొవ్వూరుతాలూకా యందు తప్ప మిగిలిన తాలూకాల యందలి రహదారి మార్గము లుత్తమ స్థితియం దున్నవి.
రైలు మార్గములు : ఈ జిల్లాయందు 1073/4 మైళ్లు పెద్ద రైలు మార్గము ; 133/4 మైళ్లు చిన్న రైలు మార్గము కలవు. మద్రాసు నుండి కలకత్తా పోవు పెద్ద రైలుమార్గముఏలూరు, తాడేపల్లిగూడెము, కొవ్వూరుతాలూకాల గుండా పోవును. నిడదవోలు నుండి నర్సాపురము వరకు ఒక బ్రాడ్ గేజ్ శాఖా రైలు మార్గము కలదు. దానిలోని భీమవరము నుండి ఒక మీటర్ గేజ్ రైలుమార్గము గుడివాడమీదుగా విజయవాడవరకు పోవును. పోలవరము, చింతలపూడి తాలూకాలు తక్క మిగిలిన తాలూకాలు రైలు మార్గములచే కలుపబడి యున్నవి.
తంతి - తపాలా ఆఫీసులు : ఈ జిల్లా యందు 288 బ్రాంచి పోస్టాఫీసులును, 17 పోష్టు-టెలెగ్రాఫు ఆఫీసులును, 19 సబ్ -తపాలా ఆఫీసులు (Non-combined Sub-post Offices) ను గలవు.
వైద్యము : ఈ జిల్లాలో 8 పెద్ద హాస్పిటలులు గలవు. 21 చిన్న వైద్యశాలలు గలవు. తణుకునందు కుష్ఠరోగ నివారణాలయము గలదు. హెడ్ క్వార్టర్సు అగు ఏలూరు నందున్న హాస్పిటలులో ఎక్సురే విభాగమును, కండ్ల విభాగమును గలవు. మరియు ఇది మంత్రసానుల (Maternity Assistants) ను తయారుచేయు శిక్షణాలయముగ గూడ పనిచేయుచున్నది. నరసాపురమునందలి మిషను హాస్పిటలు అన్నిటికన్న పెద్దది. ఇందు 160 మంచములు గలవు. పంపులద్వారా నీరు ఏలూరు, పాలకొల్లు, నరసాపురములకు పంపించబడుచున్నది. 362 బావులు నిర్మింప బడినవి.
జాతరలు : ఈ జిల్లాలో 10 యాత్రాస్థలములు గలవు. పాలకొల్లు, ఆచంట, ద్వారకాతిరుపతి, పట్టి సంగ్రామములు చెప్పదగిన యాత్రాస్థలములు. 4 సంతలు గలవు. పాలకొల్లు సంతయందు లక్షలకొలది వ్యాపారము జరుగుచుండును. విలక్షణమైన చరిత్రగలిగిన "పేరంటాలు" తిరుణాలు చింతలపూడి తాలూకా లింగపాలెము గ్రామములో జరుగుచుండును.
విద్య : ఈ జిల్లాయందు మొత్తము 1,717 సంస్థల ద్వారా విద్యాప్రచారము జరుగుచున్నది. వీటియందు విద్య నేర్చెడివారు బాలురు 1,07,838 మంది, బాలికలు 68,352 మంది గలరు. విద్యాసంస్థలలో కళాశాలలు 4;
462