Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/510

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గోదావరిజిల్లా (పశ్చిమ)

గ్రామములు 85; పురములు 4 (పాలకొల్లు, నర్సాపురం, మొగల్తూరు, ఆచంట) ; జనాభా 2,93,773; గ్రామవాసులు 2,27,186; పురవాసులు 66,587; పురుషులు 1,45,863; స్త్రీలు 1,47,910; జనసాంద్రత 1053.

నేలలు : ఈ జిల్లాలో సహజసిద్ధముగా మూడు విభాగము లున్నవని చెప్పవచ్చును. అవి యేవనగా సారవంతమై ఉత్తమశ్రేణికి చెందిన వండుమట్టి నేలలు నల్ల రేగడి నేలలు ఎఱ్ఱగరప నేలలు అనునవి. చింతలపూడి, పోలవరము తాలూకాలలో కాక మిగిలిన అన్ని తాలూకాల యందును సారవంతమైన వండుమట్టి నేలయే అధికము. 1. వండుమట్టి నేలలు విస్తృతముగా భీమవరము, తణుకు నరసాపురం తాలూకాలలో గలవు 2. పశ్చిమముననున్న ఏలూరు, భీమవరము తాలూకాలలో విశేష విస్తీర్ణము గలిగిన నల్ల రేగడి నేలలు గలవు. 3. ఉత్తరమునందలి పోలవరము, చింతలపూడి, కొవ్వూరు, తాడేపల్లిగూడెము తాలూకాలయందు విశేషించి ఎఱ్ఱమట్టి నేలలు కలవు.

పర్వతములు : కాన్‌స్లూరు గుట్టలు, ఆదకొండ గుట్టలు ఇంచుమించు జిల్లాకు ఉత్తరముగ 200 మైళ్ళ నిడివిగలిగి యున్నవి. ఈ గుట్టలు పోలవరము తాలూకా యంతయువ్యాప్తమయి యున్నవి.

పోలవరము తాలూకాలో తూర్పు కనుమలు వ్యాపించి యున్నవి. చింతలపూడి తాలూకా పూర్తిగను, తాడేపల్లి గూడెము, కొవ్వూరు, ఏలూరు తాలూకాల ఉత్తరభాగములు మెట్ట ప్రదేశములు ; మిగిలిన భాగము అంతయు పల్లపుభూమి.

నదులు : కృష్ణా, గోదావరీనదుల కాలువలద్వారా ఈ జిల్లాయందలి భూమి అధికభాగము సాగుబడికి తేబడుచున్నది. వ్యవసాయోప యుక్తములగు చెరువులకు వివిధములగు కాల్వలు జలసమృద్ధి నొనగూర్చు చున్నవి. గోదావరీ నదీజలముచే తాడేపల్లిగూడెము, తణుకు, భీమవరము, నరసాపురం తాలూకాలు అధికలాభము నొందుచున్నవి. ఎఱ్ఱకాలువ, బైనేరుకాల్వ, కొవ్వాడకాల్వ, జల్లేరునది, గుండేరునది మొదలగు వాగులు చెరువులను నింపుచు వ్యవసాయమున కుపయోగించు చున్నవి. చింతలపూడి ఏలూరుతాలూకా భాగములలో తమ్మిలేరును, కొవ్వూరు తాలూకాలో ఎఱ్ఱకాలువయు పోవుచున్నవి. పోలవరము తాలూకాలో బైనేరునదియు, జల్లేరునదియు, కొవ్వాడ కాలువయు ప్రవహించుచున్నవి. ఏలూరు తాలూకాలో గుండేరును, కొవ్వూరు తాలూకాలో రాళ్ళమడుగును పోవుచు ఆ ప్రాంతములను సస్య శ్యామల మొనర్చు చున్నవి. కొల్లేరుసరస్సు ముంపులు ఏలూరు తాలూకా యందు ప్రసిద్ధములు. ఏలూరు తాలూకా దక్షిణము నందు ఈకొల్లేరు సరస్సుగలదు. ఈ సరస్సు గోదావరీ నదియొక్క డెల్టాల చుట్టును ఎత్తుభాగములగుటచే నేర్పడినది. ఆ డెల్టా భాగములనుండియే అధికమగు మురుగునీరు ఈ సరస్సునకుఁ జేరును. ఉప్పుటేరుద్వారా కొంతనీరు సముద్రమునకు చేరుచుండును.

అడవులు : ఈ జిల్లాయందు 384.30 చదరపుమైళ్ళ ప్రాంతము అరణ్యావృతమై యున్నది. పోలవరము తాలూకా యందలి సురక్షితారణ్యములందు వెదుళ్లు. వంటచెఱకు, కలప, సమృద్ధిగా కలదు. భీమవరము తాలూకా అడవులందు రావిచెట్లు అధికము.

శీతోష్ణము; వర్షపాతము : ఈ జిల్లాయందలి శీతోష్ణస్థితి మొత్తముపై అనుకూలముగ నుండును. సెప్టెంబరు, జనవరి నెలలయందు మాత్రము కొండప్రాంతమగు పోలవరము తాలూకాయందు డెల్టాభాగందుకన్న చలి అధికముగా నుండును. ఈజిల్లాకు గలుగు అధికమగు వర్షపాతము జూన్, సెప్టెంబగు నెలలయందు నైరృతీ ఋతుపవనముల వలనను; అక్టోబరు, నవంబరులయందు ఈశాన్య ఋతుపవనముల వలనను కలుగుచుండును. వర్షపాతము, సగటున 37" నుండి 45" వరకు ఉండును.

నీటి పారుదల : తణుకు, భీమవరము, నర్సాపురము, తాడేపల్లిగూడెము, ఏలూరు తాలూకాలు డెల్టాలచే నేర్పరుపబడిన వగుటచే సారవంతమైనవి. గోదావరి, కృష్ణా కాలువలవలన ఈభూమి సాగుబడి యగుచున్నది. చెఱువులచే కొన్ని ప్రాంతములందు వ్యవసాయము నడుప బడును. అందు కొన్ని సహజ ప్రవాహములచే నిండునవి. నూతుల సహాయమున తోటలను పెంచుదురు. తాత్కాలికముగ తీయబడుదొరువులు సముద్రతీర ప్రాంతములం దధికములు. ఇంకను అధికమగు నీటివనరులు కల్పింప బడవలసి యున్నవి. పోలవరము తాలూకా బైనేరుకొండ వాగుచేతను, వర్షాధారితమగు చెరువులచేతను నీటిపారు

461