Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/494

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గోతముడు (అక్షపాదుడు)

జాలదు. ఇది ప్రమాణములతో అర్థమును జక్కగా పరీక్షించును. ప్రత్యక్షమునకును, ఆగమమునకును అవిరుద్ధముగా ప్రవర్తించి వానితో పరీక్షింపబడిన విషయమును సరిగా పరీక్షించునని దీనిని 'అన్వీక్షకి' అనియు నందురు. ప్రత్యక్షాగమములకు విరుద్ధ మగునేని అది న్యాయాభాస మగును. ఇట్లిది ప్రవర్తించి అన్వీక్షకి యనియు, న్యాయప్రధాన మగుటవలన, న్యాయవిద్య యనియు, న్యాయదర్శన మనియు పిలువబడుచున్నది.

దీనివలన ఎరుగవలసినవి నాల్గు విషయములు——- 1. హేయము, 2. దానిని నిర్వర్తించునది, 8. హానము, 4. దానికి ఉపాయము. దీని వివరణ మిట్లు : మోక్షమే గదా పరమ పురుషార్థము. మోక్షమన విడుచుట. దేనిని? ఆ విడువవలసిన దానిని తెచ్చి పెట్టిన దేది ? అసలు విడుచుట యననేమి ? దాని కుపాయము లెవ్వి? ఈ నాల్గింటిని సరిగా తెల్పు ఉపాయమగు ప్రమాణము సరిగా నుండవలెను. దీనిని సరిగా తెల్పునదే ప్రమాణము. అట్లు తెల్పనిచో ప్రమాణము కాదు. సరియగు జ్ఞానమును కలిగించిననే అనగా ప్రమితిని ఉదయింపజేసిననే ప్రమాణము సార్థకమగును. అది సార్థకమైననే, దానిని తన త్యాగభోగములకై ఉపయోగించుకొనునట్టి ప్రమాత సార్థకమగును. అపుడే ఆప్రమితియు సార్థకమగును; అందు గోచరమగునది ప్రమేయముగాను సార్థకమగును. ప్రమాణమే సార్థకముగానిచో, ఇవియేవియు సార్థకములు కాజాలవుకదా ! ఆప్రమాణము నాలుగు విధములు : 1. ప్రత్యక్షము, 2. అనుమానము, 3. ఉపమానము, 4. శబ్దము. అందు ప్రత్యక్షము రెండు రకములు : బాహ్యము, ఆభ్యంతరమును. బాహ్యేంద్రియములవలన కల్గునది బాహ్యము. అంత రింద్రియమగు మనస్సు మాత్రమున గల్గునది అభ్యంతరము. బాహ్యేంద్రియము లైదుగనుక, అప్రత్యక్ష మైదు రకములు. అంతరింద్రియ మొక్క టేకనుక అది యొకరకమే. ఈ జ్ఞాన ముదయించునపుడు ఆత్మ మనస్సుతోను, మనస్సు ఇంద్రియముతోను, ఇంద్రియము వస్తువుతోను కలియును. ఈ కలయికను సన్నికర్ష మందురు. ఇది యారురకములు 1. సంయోగము, 2. సంయుక్త సమవాయము, 3. సంయుక్త సమవేత సమవాయము, 4. సమవాయము, 5. సమవేత సమవాయము, 6. విశేషణవిశేష్యభావము. ఘటము ప్రత్యక్షమగునపుడు ఇంద్రియమగు చక్షుస్సునకును. విషయమగు ఘటమునకును ఉండు సంబంధము సంయోగము. దానిరూప ప్రత్యక్షములో సంయుక్త సమవాయము ఆ రూపమందున్న నీలత్వపీతత్వాదుల ప్రత్యక్షములో సంయుక్త సమవేత సమవాయము, శబ్దపు ప్రత్యక్షములో గగనమగు శ్రోత్రమునకు శబ్దము గుణమేకనుక, గుణగుణులకు సంబంధము సమవాయమే. ఆ శబ్దమందలి శబ్దత్వ జాతి ప్రత్యక్షములో సమవేత సమవాయము. "భూతలము ఘటాభావము కలది" అను అభావ ప్రత్యక్షములో భూతలమునకును ఘటాభావమునకును విశేషణ విశేష్యభావమేకదా సంబంధము. ఇట్లు విషయములగు ద్రవ్యగుణక్రియా - జాతి - సమవాయ - అభావములకును ఇంద్రియములకును ఉండు సంబంధములే సన్నికర్షములు - అని గోతముడు నిరూపించెను.

ఈ నిరూపించిన ప్రత్యక్షమును బట్టి ప్రవర్తించు ప్రమాణము అనుమానము. ఇది (1) స్వార్థము (2) పరార్థము అని రెండురకములు, మొదటిదానిలో వాక్యముపైకి ప్రయోగింపకున్నను ఆలోచనము అట్లున్ననే, తత్త్వ నిర్ణయమగును. రెండవదానిలో ఐదవయవములు ఉపయోగింపబడును. ఆ మహావాక్యమే న్యాయము . దానిలోని అవాంతర వాక్యములే అవయవములు అని తెలియుచున్నది. దీని ఉపయోగప్రక్రియ ఇట్లు చెప్పబడినది. ఒకడు ఒక కొండకడ కేగినపుడు, అతనికి అచ్చట పొగ అగపడును. ప్రక్కనున్న వాడు తానిదివరలో నిప్పునకును గల వ్యాప్తిసంబంధమును ఎరుగును గనుక, నిప్పు నూహించి, అది తెలియని తన సహచరునకు పైరీతిగా మాటలతో (న్యాయముతో) బోధించును. ఇతడు అదివరకే ధూమమును కొండమీద (పక్షధర్మత) జూచెను కనుక, ఆ న్యాయమువలన వహ్నిధూమముల వ్యాప్తిని తెలిసికొనును. పిమ్మట వెనుకటి పదధర్మతాజ్ఞానము జ్ఞప్తికలిగి ఈ రెంటికిని పరామర్శకలుగును. "ఈ కొండమీద నిప్పును వీడనిపొగ యున్నది" అని వెంటనే కొండమీద నిప్పున్నదని అనుమితి కల్గును. ఇచ్చట పక్షత, వ్యాప్తి, పక్షము, సపక్షము, విపక్షము అనునవియున్నవి. నిషాధయిషా విరహావిశిష్టసిద్ధ్యభావము పక్షతయనబడును.

445