Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/493

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గోతముడు (అక్షపాదుడు)

సంగ్రహ ఆంధ్ర

కదా నిశ్శ్రేయసము – మోక్షము. ఈ మోక్షమును కలిగించు తత్త్వజ్ఞానము, ఈ శాస్త్రమువలన కలుగునని ప్రయోజనమును, మొదటనే గోతముడు ప్రదర్శించి, తన శాస్త్రమున ప్రవృత్తిని కలిగించెను.

ఈ న్యాయశాస్త్రము సంశయాది పదార్థములతో పయనించినది. కనుకనే ఈ శాస్త్రము ఉపనిషత్తులవలె నొక అధ్యాత్మశాస్త్రము మాత్రముగా కాక త్రయి, దండనీతి, వార్తలతో బాటుగా నొక పృథక్ప్రస్థానపు శాస్త్రమైనది.

త్రయి (వేదత్రయము) యందు ఊరక విషయములు తెల్పబడినవే కాని, వానికి ఉపపత్తి తగినంత చూపబడ లేదు. అది శబ్దప్రధానము కదా! అందు విషయమై ఆస్తికులకు గానీ, నాస్తికులకు గానీ విశేషదర్శనము-ఉపపత్తి నిరూపింపబడక పోవుటవలన సంశయము తప్పదు. దానినిబట్టియే, పక్ష ప్రతిపక్షములు - న్యాయ ప్రవృత్తి ఏర్పడును. దానివలన తత్త్వము నిర్ధరింప నగును. కనుక ఈ దృష్టిలో సంశయాదులు ప్రధానములే కదా ! అవి లేకున్న న్యాయమెట్లు ప్రవర్తింప గలుగును? ఇట్టి న్యాయమును సవిస్తరముగా ప్రవర్తింప జేయునది న్యాయదర్శన మనియు, న్యాయశాస్త్ర మనియు పేర్వడసినది.

అన్యాయ ప్రవిస్తర మేమనగా - స్వార్ధానుమానము, పరార్ధానుమానమునని. ఇట ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము అనునవి నాల్గు ప్రమాణములు. ఈ నాలుగును ఒకే విషయమున ప్రవర్తించి, అర్థమును నిర్ణయించును. ఇట్లు సర్వ ప్రమాణముల సమాహార మగుటచే ఈ న్యాయము ప్రధానతమము.

అది ఎట్లనగా - ఈ న్యాయమునకు అయిదు అవయవము లున్నవని గోతముడు తెలిపినాడు. ప్రతిజ్ఞ, హేతువు, ఉదాహరణము, ఉపనయము, నిగమనము అనునవి ఆ యవయవములు . (భద్రబాహుడు మొదలగు జైనులు- మరొక అయిదు అవయవములను-జిజ్ఞాస, సంశయము, శక్యప్రాప్తి, ప్రయోజనము, సంశయ వ్యుదాసము - అను వాటిని కలిపి పది అవయవములనిరి. కాని అది సరిగాదు) మొదటిది ప్రతిజ్ఞ . ఉదా : కొండయందు నిప్పున్నది ఇది శబ్ద ప్రమాణము. ఇది పరునిగూర్చి తాను స్వతంత్రముగా నిర్దేశించు శబ్దముగదా ! రెండవది — హేతువు. ఉదా : పొగయున్నది కనుక. ఇది అనుమానము. మరొ= దానిని సాధ్యమును (నిప్పును) అనుమానింపజేయు సాధనము కనుక . మూడవది—ఉదా : పొగయున్నచోట నంతను నిప్పుండును ; వంటయింటిలో వలెనే ఇది ప్రత్యక్షము. నాల్గవది—ఉపనయము. ఉదా : ఆ వంటయింటి వలెనే ఈ కొండయు పొగతో నున్నది. ఇది ఉపమానము. అయిదవది నిగమనము. ఉదా : కనుక ఈ కొండయందును నిప్పుండును. వెనుకటి ప్రమాణములన్నియు నొక చోటచేరి అర్థమును సాధింపగల్గినవని వాని సామర్థ్యమును ఇది ప్రదర్శించి నిగమించును అని గోతముని సిద్దాంతము.

ఈ న్యాయము సంశయములేనిదే ప్రవర్తింపదు. అది ఎట్లనగా——అసలేమియు తెలియనపుడుగానీ, బాగా తెలిసి నపుడుగానీ, మన మూహింపబోము. కొంత తెలిసి, కొంత తెలియక సందిగ్ధముగా నుండునపుడే మనయూహ ప్రసరించును. కనుక న్యాయప్రవృత్తికి సంశయము ముఖ్యమే కదా! అట్లే ప్రయోజనమును ముఖ్యమే. కాకదంత పరీక్ష నొనర్పముకదా ! న్యాయ ప్రయోజనమగు సిద్ధాంతము దృష్టాంతముతోనే నిర్ణయమగును. ఇదియు నూహా పోహలతోనె——తర్కముతోనే ఏర్పడును. ఊహపోహాత్మకమగు విచారము లేకున్న ప్రతికూలములెట్లు తొలగును? కనుక ఈవిచారమున తర్కసాహాయ్యమత్యావశ్యకము. ఈ విచారమును - వాదము, జల్పము, వితండయని మూడు రకములుగా గోతముడు విభజించి యున్నాడు. ఈ మొత్తమును కథ యందురు. ఛలము, జాతులు, నిగ్రహ స్థానములు, హేత్వాభాసములు ఈకథలోనే ఉపయోగించును. వీనిని సరిగా తెలియనిచో తత్త్వము ఎరుకపడదు. అంతేకాక తర్కసాహాయ్యమున ఛలాదులను తొలగించి ప్రమాణసర్వస్వ మగు న్యాయమును ఉపయోగింపనిచో తత్త్వ మవధారింప వీలు కలుగదు. ఇక నిశ్శ్రేయస మెట్లు? కనుక ఈ ప్రమాణ సంశయాదులతో పృథక్ప్రస్థానము సాగించి, కడమ శాస్త్రములచే ఇది గతార్థము కాకపోగా, సకల శాస్త్రములను ప్రదీపమువలె ప్రకాశింపజేయును. అన్ని పనులకును ఉపాయమగును. అన్ని ధర్మములును దీని నాశ్రయించియుండును. ఇది లేనిదే మరేదియు నిష్కృష్టమగు జ్ఞానమును కలిగింప

444