విజ్ఞానకోశము - 3
గోతముడు (అక్షపాదుడు)
ప్రత్యభాద్వదతాంవరం' అని వ్రాసెను. 'నైయాయి కస్త్వథపాదః' అని కీల్హారన్ సంపాదితమైన అమరకోశమున గలదు. మహాభారత టీకలో నీలకంఠుడుకూడ “కణభక్షమక్షచరణం జైమిని కపిలౌ పతంజలించనుమః" అని దర్శనకర్తల ప్రసంగములో అక్షచరణుని కీర్తించెను.
న్యాయ సూత్రకర్తయగు గోతముడు అక్షపాదుడని నిరూపించు రెండు కథలుకూడ లోకమున ప్రచారమున కలవు. వ్యాసుడు బ్రహ్మ సూత్రములలో 'తర్కాప్రతిష్ఠానా దన్యథాప్యనుమేయమితిచేదేవమప్య నిర్మోక్షప్రసంగః' అని సూత్రించి తర్క (న్యాయ) శాస్త్రము అప్రతిష్ఠితము, అనగా ప్రమాణము కాదని నిందించెనట. గోతముడు కుపితుడై వ్యాసుని మొగమును చూడనని ప్రతిజ్ఞ యొనర్చెను. ఒకప్పుడు వ్యాసుడే గోతమ దర్శనార్థమై ఏగెను. అపుడు గోతముడు వ్యాసునివైపు తనకాలు సాచి అందులో కన్ను మొలిపించి తన్మూలమున ఆతని జూచి సంభాషించెనట. ఇది మొదటికథ. గోతముడు తర్కమూలమున జీవేశ్వరభేదమును సాధించెనను కారణమున వ్యాసుడాతని మొగమును జూడ నొల్లడయ్యెనట ! గోతము డాతని జూచి సంభాషించుటకు తన కాలిలో కన్ను మొలిపించుకొనె ననునది రెండవకథ. కాగా, న్యాయసూత్ర కర్తయగువాడు గోతముడు; అతడు అక్షపాదుడని తేలినది. ఈ గోతము డెక్కడివాడు అనునది విమర్శనీయము.
విదేహదేశము న్యాయశాస్త్రమునకు పుట్టిల్లు. న్యాయ దర్శనమున ఉద్దండ పండితులయిన ఉదయనాచార్యుడు, వాచస్పతి మిశ్రుడు, గంగేశోపాధ్యాయుడు అనువారు మైథిలులు కావున గోతముడును మైథిలుడను హేతువు సమంజసముగ కనిపించును. మాథ్యందినుల శతపథబ్రాహ్మణము నందలి ఒకటవ కాండమునగల 4 వ అధ్యాయములో 'విదేఘోహ మాధవో౽గ్నిం వైశ్వానరం ముఖేబభార తస్య గోతమో రాహుగణ ఋషిః పురోహిత ఆసతస్మై హస్మామన్త్రయాణోన ప్రతిశృణోతి తన్మేగ్నిర్వైశ్వానరో ముఖాన్నిప్పద్యా ఇతి' అనునదియు గోతముడు విదేహవాసియనియు, ఆతడు రాహుగణుడగు గోతముడనియు తెలుపుచున్నది. ఇతడు ఉశిజుని కొడుకుగాని, ఉళిక్కు కొడుకుగాడు.
శ్రీమద్రామాయణము నందలి బాలకాండమునుబట్టి గోతముని ఆశ్రమము విదేహరాజధానియగు మిథిలకు సమీపమున నున్నట్లు తెలియుచున్నది. అతని కొడుకగు శతానందగౌతముడు మిథిలాధిపతియగు జనకునకు పురోహితుడని భవభూతివాక్యము సాక్ష్యమిచ్చుచున్నది. ఆ గోతముడు అహల్యాపతియని 'యద్యాన్తిక సుఖదుఃఖ హానరూపం కైవల్యం కథమశపద్భవానహల్యాం' అను నీలకంఠ దీక్షితుని శ్లోకము విశదీకరించుచున్నది.
గోతముడు న్యాయసూత్రములను రచించెను. వీటికే న్యాయదర్శనము అని పేరు. ఈ శాస్త్రము వేదాది ప్రమాణముల నాదరించి, తదవిరుద్ధముగ ప్రవర్తించినది. కణాదుని వై శేషికదర్శనముకన్న ఈ న్యాయదర్శనము తరువాతిదే. ఆదర్శన మిట "ప్రతితంత్ర" మనబడినది. ఆత్మస్వరూపము, శబ్దానిత్యత్వము, అనుమానము, హేత్వాభాసము వీటి చర్చలో గోతముని న్యాయదర్శనముయొక్క ఆర్వాచీనత కనిపించును. వైశేషికతంత్రములో లేని ఈశ్వరుడు, అతని జగత్కారణత్వము ఇందు విచారింపబడినవి. వై శేషికములో పదార్థనిరూపణము కలదు. అయితే ఇందులో ఆ విచారమున కెక్కువ ప్రాధాన్యము కలదు.
గోతముని న్యాయసూత్రములు అయిదధ్యాయములు గాను, ప్రతి అధ్యాయము రెండు ఆహ్నికములుగాను విభజింపబడినవి. గోతముడు ఈ శాస్త్రమును “ప్రమాణ ప్రమేయ-సంశయ - ప్రయోజన - దృష్టాంత - సిద్ధాంత- అవయవ-తర్క-నిర్ణయ వాద - జల్ప-వితండా- హేత్వాభాస - ఛల - జాతి - నిగ్రహస్థానానాం తత్త్వజ్ఞానా న్నిశ్రేయసాధిగమః" అను సూత్రముతో నారంభించెను. ప్రమాణాదులగు పదునారు పదార్థముల తత్త్వజ్ఞానము నిశ్శ్రేయసము నధిగమింపజేయును. అదెట్లనగా-“దుఃఖజన్మప్రవృత్తిదోష మిథ్యాజ్ఞానానాముత్తరోత్తరాపాయే తదనన్తరాపాయాదపవర్గః" అని రెండవ సూత్రములో గోతముడు బోధించెను. దానితీరు ఇది: తత్త్వజ్ఞానము మిథ్యాజ్ఞానమును తొలగించును. అది తొలగుటవలన దోషములు (రాగద్వేషములు) తొలగును. అందువలన ప్రవృత్తి కలుగదు. అది లేనిదే జన్మ మేది ? జన్మ లేదు కనుక సకల దుఃఖములును నివర్తించును. అదియే
443