Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/495

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గోతముడు (అక్షపాదుడు)

సంగ్రహ ఆంధ్ర

సాధ్యమును హేతువు వీడకుండుట వ్యాప్తి, సాధ్యమును ఊహించు చోటు (పర్వతాదికము) పక్షము, దృష్టాంతము సపక్షము (వంటఇల్లు). సాధ్యము లేనిది విపక్షము (నీళ్ళనుడుగు). ఈ సామగ్రితో వాది ప్రతివాదులు నడపు ప్రసంగము కథయనబడును. వా రిరువురు సంప్రతిపత్తితో వస్తుతత్త్వము తెలియు తలంపుతో చేయునది వాదము. విప్రతిపత్తితో, నొకరి నొకరు జయించు తలంపుతో నొనర్చునది జల్పము. ఒకడు మరొకని వాదమును ఖండించుటే కాని తానొక పక్షము స్వీకరింపక నడుపునది వితండము. మొదటిదానిలో హేత్వాభాసములు మాత్రమే ప్రసక్తించును. వీనిలో అవియేకాక ప్రతివాది నిగ్రహమునకు ఉపయోగించు ఛలము, జాతి, నిగ్రహస్థానములు ఉపయోగింపబడును. ఈ అనుమానము మరొక త్రోవను బట్టి మూడురకములుగా చెప్పబడినది. (1) పూర్వవదనుమానము (2) శేషవదనుమానము (3) సామాన్యతోదృష్టానుమానము అనునవి ఈ మూడురకములు. కారణముతో కార్యము నూహించుట - మబ్బుపట్టగా వర్షము వచ్చుననుకొనుట పూర్వవదనుమానము. అథవా, పూర్వమువలె - వెనుకటి మోస్తరుగా కనిపించిన వహ్నిధూమములను బట్టి ధూమ మగుపడగా, వహ్నినూహించుటయు నిదే కార్యముతో కారణము నూహించుట శేషవదనుమానము. ఏటికి వేగముతో క్రొత్తనీరు తగులగా, పైన నెక్కడో వాన కురిసినదని ఊహించుట, అథవా చిట్టచివరకు తేలిన యూహకూడ అనగా పరిశేషానుమానముకూడ, శేషవదనుమానమే. హేతుసాధ్యములకు సాక్షాత్సంబంధ మగపడకున్నను, ఏదో సామ్యమునుబట్టి సాధ్యము నూహించుట సామాన్యతో దృష్టానుమానము. ఇచ్ఛాదులకును, ఆత్మకును సాక్షాత్తుగా సంబంధమగపడకున్నను, ఇచ్ఛాదులు గంధాదులవలె గుణములు కావున, వాటి ఆశ్రయము ద్రవ్యమే- అది ఆత్మయే అని ఊహించుట. ఈ అనుమానప్రమాణము సదసత్తులనుగూర్చి ప్రవర్తించును. దీనికి మూలమగు ప్రత్యక్ష మొక సత్తునందుండుదానిని వర్తమానమునం దుండుదానినిగూర్చి ప్రవర్తించును. అనుమానము కాలత్రయమం దుండువాటినిగూర్చి కూడ ప్రవర్తించును. ఇదియే ప్రత్యక్షమునకును అనుమానమునకును భేదమగు చున్నది. ప్రసిద్ధమైన దానితోడి పోలికనుబట్టి తెలుపవలసిన దానిని తెలుపుట ఉపమానము. ఉదా : గోవుతోడి పోలిక కనబడగానే ఇది గవయమని తెలియుట. పేరునకును, వస్తువునకును సంబంధము బోధపడుట ఈ ప్రమాణము యొక్క ఫలము.

ఆప్తుని ఉపదేశము శబ్దప్రమాణము. తాను సరిగా ఎరిగిన దానిని ఇతరులకు తెలుపు ఇచ్ఛతో తెలుపువాడు ఆప్తుడు. ఆప్తి అన విషయమును సరిగా తెలియుట. ఈ లక్షణము ఋషులకు, ఆర్యులకు, అనార్యులకుకూడ సాధారణమే కనుక అట్టివారందరి మాటలను పరిగ్రహించియే వ్యవహారము నడచును. ఈ శబ్దము ఒక దృష్టవిషయముననేగాక, కనిపించని స్వర్గనరకాదులయెడ గూడ ప్రమాణమే. అవి అనుమానమునకు గోచరములేగదా !

ఈ ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, శబ్దములు అను ప్రమాణములను నాల్గింటిని ఉపయోగించి తెలియవలసినది ప్రమేయము. అది ఆత్మ, శరీరము, ఇంద్రియములు, అర్థములు, బుద్ధి, మనస్సు, ప్రవృత్తిదోషములు, ప్రేత్య భావము, ఫలము, దుఃఖము, అపవర్గము అనునవి. ఇందు మొదట ఎవడీ ప్రపంచమునంతయు జూచుచు అనుభవించుచున్నాడో అట్టి ఆత్మను ఎరుగుట అత్యంతావశ్యక మేగదా ! ఆ యాత్మకు భోగస్థానము శరీరము. భోగోపకరణములు ఇంద్రియములు. భోగగోచరములు అర్థములు, భోగమే బుద్ధి. బాహ్యాంతర విషయముల నన్నింటిని తెలిసికొనుటకు సాధనమైనది మనస్సు. దాని ద్వారముననే పుణ్యపాపకర్మలందు ప్రవృత్తి కల్గును. కల్గించునవి రాగద్వేష మోహములు. ఇవే దోషములు. ఈ శరీరము ఈ ఆత్మకు ఇదివరలో నున్నదియుకాదు. ఇకముందుండునదియుకాదు ఇట్టివెన్నియో యైనవి. ఇది తొలగి తిరిగి జనించుట ప్రేత్యభావము. సుఖదుఃఖములను ససాధనముగా ననుభవించుట ఫలము ఇచట దుఃఖమనగా దానితో నిత్యానుషక్తమగు జన్మమే. దీనిని ఇట్లు ఏకాగ్రముగా భావించుటకే “దుఃఖ" మని యుపదేశము. ఇట్లు భావింపగా నిర్వేదము కలిగి వైరాగ్య మొదవును. దానివలన అపవర్గము - మోక్ష మేర్పడును. జనన మరణముల నిరంతర ప్రవాహమింకిపోయి దుఃఖములన్నియు తొలగుటయేకదా ఇది !

446