గృహజంతువులు, పెంపుడుజంతువులు
సంగ్రహ ఆంధ్ర
గుచో, పశువైద్యుని పిలిపింపవలెను. అట్టి సమయమున తెలిసీ తెలియని వైద్యము చేయుట తరచుగా హానికర మగును.
ప్రసవానంతరము మూడు, నాలుగు దినములవరకు పశువులకు తేలిక యైన ఆహార మియ్యవలెను. లేనిచో, ఒక్కొక్కప్పుడు శ్రమచేయు సమయములో గర్భాశయము వెలుపలికి పొడుచుకొనివచ్చును. ఏ కారణముచేతనైనను అట్లు వెలికివచ్చిన యెడల, దానిని వెంటనే సరిచేయవలెను. లేనిచో గర్భాశయము తిరుగులేని తీవ్ర ప్రమాదమునకు గురియై, ప్రాణనష్టముగూడ సంభవింపవచ్చును. పాలిచ్చు పశువులకు పైన పేర్కొనిన అదనపు ఆహారము నియ్యవలెను.
దూడల రక్షణము : క్రొత్తగా పుట్టిన దూడలయొక్క ముక్కు రంధ్రములు రసితో నిండియుండి ఊపిరి యాడక బాధ పడుచుండును. పుట్టినతోడనే ముక్కులు పిండి. రసిని లాగివేయవలెను. అనంతరము వాటి శరీరములను గోనెసంచితోగాని లేక వస్త్రముతోగాని తడి ఆరునట్లుగా తుడువవలెను. పుట్టిన వెంటనే దూడ తల్లి యొద్ద జున్ను పాలు త్రాగునట్లు చేయుట అవసరము. సాధారణముగా సంభవించు బాలారిష్ట దోషములకు జున్నుపాలు విరుగుడుగా పనిచేయును.
పుట్టిన కొలది మాసములవరకు దూడలకు పాలే ముఖ్యాహారముగ నుండవలెను. తరువాత అవి ఇతర పదార్థములు తినగల్గును.
మొదటి ఒకటి, రెండు దినములవరకు కోడిపిల్లలకు ఆహారమే అవసర ముండదు. తరువాత అవి బియ్యపు నూకలను, కాయకూరలను తినగల్గును.
సాధారణ రోగములు : అధిక సంఖ్యాకములైన జంతువులకు ముఖ్యముగా అజీర్ణము, నులిపురుగుల బాధ, గాయములు సంభవించును. కాగా సూక్ష్మ విషక్రిముల (bacteria) వలనను, విషపునీరు (virus) వలనను కొన్ని కొన్ని ప్రత్యేకములైన జాడ్యములు వెంటాడును. కొన్ని జాతుల జంతువులను పట్టి బాధించు రోగములు చిత్ర విచిత్రములైనవి. ఉదాహరణమునకు, గుఱ్ఱములయందు కుంటితనము, ఆవులయందు స్తనపాకము (mastitis=పొదుగు వాపు) మున్నగునవి.
ఒక్కొక్కప్పుడు పశువులు, గొఱ్ఱెలు, మేకలు అమితముగా ఆహారమును తినుటచే, జీర్ణించుకొని సుఖముగా మలమును విసర్జింపజాలక యుండును. అట్టి సమయములో కృత్రిమముగా విరేచనౌషధ మియ్యవలెను. ఒక్కొక్క సమయములో కొన్ని పదార్థములు గర్భములో పులిసిపోయి విషపూరితమైన వాయువును విపరీతముగా సృష్టించును. ఇట్టి వాయువు బయల్వెడలజాలక పశువులకు తీవ్రమైనబాధ కల్గించును. ఇందువలన, విషవాయువు గర్భములో జీర్ణించి ఊపిరి సలుపక ప్రాణోపద్రవము కూడ సంభవింపవచ్చును. కర్పూరతైలము (turpentine), కార్బలి కామ్లము (carbolic acid). ఈ బాధను కొంతవరకు నివారింపగలవు.
రాయలసీమవంటి కొన్ని ప్రాంతములలో భూమియందు అధికమైన క్షారపదార్థము (calcium) లుండుటచే, జంతువుల మూత్రకోశమునందు సన్ననిరాళ్లు ఏర్పడును. వరిగడ్డి తినుటచే ఇట్టిరోగములు ప్రకోపించును. శస్త్ర వైద్యముచే ఇవి నివారింపబడగలవు.
భారతదేశము నందలి పశువులకు మాంసకృత్తులు (proteins) పోషకపదార్థములు (Vitamin A) గల ఆహారములు లేక ఆరోగ్యమున కుంటుపడియున్నవి. మాంసకృత్తుల కొరత, చాలినన్ని పాలు లేకపోవుటచే సంభవించును. ఇందువలన కుక్కపిల్లలకు బానకడుపు ఏర్పడును. ఈ బానకడుపు చికిత్సకు లొంగక తరచుగా మరణమునకు దారితీయును. ఇతరదేశములలో జంతురోగములు భాస్వరము (phosphorus), క్షారము (calcium) తామ్రము, (copper) మణిశిల (cobalt) వంటి లోహపదార్థముల కొరతవలన సంభవించుచున్నవని తెలియుచున్నది. బలవర్థకాహారములు లేమిచే జనించు జాడ్యములను అట్టి పదార్థములచే పూరించి నివారణ చేయవచ్చును.
పెక్కు రకములయిన పురుగులు (parasites) జంతువుల నాశ్రయించుకొని జీవించుటవలన, అనేకములైన జంతుజాతులు వర్దిల్ల లేక పోవుచున్నవి. ఈ పురుగులవలన వ్యవసాయదారునకు గూడ చాల నష్టము సంభవించును. ఒక్కొక్కప్పుడు ఈ పురుగులు ప్రాణాపాయముకూడ కలుగజేయును. రక్తమునం దిమిడియుండు కొన్ని
424