Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/474

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గృహజంతువులు, పెంపుడుజంతువులు

ప్రాక్తనజాతి (protozoam) క్రిమికీటకములు శరీరమును కృశింపజేసి నిర్వీర్యము చేయును. ఇట్టి పరాన్న జీవులచే (parasites) ఉత్పన్నమగు దాదాపు అన్ని రోగములను శ క్తిమంతముగా నివారింపవచ్చును. కాని అట్టి రోగములు సంక్రమింపకుండ అరికట్టుటకు ఇతోధికముగా కృషిచేయవలసి యున్నది.

జంతుజాల మంతయు, చెడుగాలులు వీచుతరుణములో నెమోనియా (ఊపిరితిత్తులవాపు) జాడ్యమునకు గురి యగును. అల్పజంతువులు చికిత్స చేయబడక పూర్వమే మృతి జెందును. సల్ఫానమైడులు (sulphanamides), ఆంటిబయటిక్సు (antibiotics) ప్రయోగము వలన ఈరోగము నివారణ మగును.

పశువులలోను, గొఱ్ఱెలు, మేకలలోను పొదుగువాపు (Mastitis) విరివిగా గోచరించును. ఇట్టి జాడ్యముల వలన సంసారులకు ఆర్థికముగ నష్టముగలుగుట యధార్థమైన విషయము. ప్రారంభదశలో ఈ పొదుగువాపును ఆంటీబయటిక్సు సహాయముతో నివారించనిచో, పొదుగు శాశ్వతముగా నిరుపయోగమై చెడిపోవును. రోగగ్రస్తమైన అట్టి పొదుగునుండి తీసినపాలను త్రాగినచో, గొంతు వ్రణములును, క్షయరోగములుకూడా ప్రాప్తించును.

ప్రేగు సంబంధమైన రోగములవలన, గుఱ్ఱములకును, గాడిదలకును తీవ్రమైన శూలనొప్పి (colic) జనించును. విరేచనము కావించుటచేతను, ఔషధములిచ్చుట చేతను. ఈ బాధనుండి వాటికి విముక్తి కలిగించవచ్చును. శ్రమించి పనిచేయు జంతువులకు ఏర్పడు కుంటితనమును నివారించుట యొక సమస్యగా పరిణమించినది. ఈ కుంటితనము అనేక కారణములచే సంభవించుచున్నది. ఈ రోగ కారణములను నిపుణులైన వైద్యులు నిర్ణ యింపవలసియున్నది. సాధారణముగా ఇది కౌంటర్ ఇర్రిటేషను (counter-irritation) వలన నివారణ మగును.

కుక్కలు అజీర్ణరోగమునకు గురియగును. వీటికి చికిత్స చేయ వీలగును. కోళ్ళయొక్క గొంతు క్రిందిభాగము విస్తరించుటచే, (enlargement) ఒక్కొక్కప్పుడు గింజలు తిను సమయమున అవి గొంతుకకు అడ్డుపడి ఊపిరియాడక బాధపడును. పక్షులుగూడ అట్టి సందర్భమున అటునిటు కొట్టుకొనును. అడ్డుపడిన గింజలను శస్త్రచికిత్సచే లాగివైచి వాటి బాధను బాపవచ్చును. ఒక్కొక్క తరుణమున గ్రుడ్లు పెట్టునపుడు అవి అతుకుకొనును. ఆ ప్రదేశమున గ్లిజరిన్ వంటి జిగురు పదార్థమును ప్రయోగించినచో గ్రుడ్డు సులభముగ బయటకు వచ్చివేయును. ఆహార కారణము వలనను, విషపునీరు, క్రిమికీటకాది పరాన్నజీవులవలనను, అన్నిజాతుల జంతువులలో సామాన్యముగా నీళ్ళ విరేచనములు (diarrhoea) జిగటవిరేచనములు (dysentery) సంభవించును. క్రమబద్ధమైన ఆహారము వలనను, సల్ఫాస్ (sulfas), ఆంటీబయటిక్స్ (anti-biotics), క్రిమి సంహారకౌషధముల వలనను ఇట్టి రోగములను నివారణ చేయవచ్చును.

క్రిమి, విషపునీటి రోగములు (Bacterial of Viral diseases):— పైన పేర్కొనిన సాధారణ జాడ్యములే కాక, జంతువులు కొన్ని నిర్ణీతకాలములలో క్రిమి రోగములకును (bacterial) విషపునీటి (Viral) రోగములకును గురియగును. దాదాపు క్రిమిసంబంధమైన జాడ్యములన్నియు సల్ఫాస్, ఆంటిబయటిక్స్ ఔషధములను ప్రయోగించుటవలన నివారణమగును. కాని విషపునీటి రోగములలో ( Viral diseases) ఏదియును ఔషధముల వలన నివారణ కాజాలదు. టీకాలు పొడిపించుట వలనను, ఆంటిసీరా (antisera) ను ప్రయోగించుటవలనను పెక్కు రోగములు చికిత్సచే లొంగుట కవకాశముగలదు.

ఒక్కసారి టీకాలుపొడుచుట వలననే జీవితములో ఎన్నటికిని జంతువులకు రిండర్ పెస్ట్ (rinderpest) అను అంటువ్యాధి సోకకుండునట్లు రక్షణచర్యలు తీసికొన వచ్చును. ప్రతి సంవత్సరము తొలకరి వర్షములు ప్రారంభమగుటకు పూర్వమే బ్లాక్ క్వార్టర్ (Blackquarter), హెమరాజిక్ సెప్టిసీమియా (hemorrhagic septicemia) అను రోగములను జంతువులకు టీకాలు వేయుటవలన నివారింప సాధ్యమగును. ఈ మూడు విధములయిన టీకాలు జంతువులను అంటురోగములనుండి కాపాడగలుగును.

స్ట్రాంగిల్సు (Strangles), ఫార్సియా (Farcia) అను రోగములనుండి గుఱ్ఱములను రక్షించుటకై ప్రతి సంవత్సరమును వాటికి టీకాలు పొడిపించవలెను. ఇటీవల ఒకవిధమగు ఆఫ్రికా గుఱ్ఱపుజాడ్యములు అంటురోగ రూపములో భారతదేశమున పలుప్రాంతములందు తలయెత్తినట్లు

425