గృహజంతువులు, పెంపుడుజంతువులు
సంగ్రహ ఆంధ్ర
ఈ పెంపుడు జంతువుల ఉత్పత్తివిషయములో 'జాతి' (breed) ప్రధాన మైనట్టి, నిశ్చితమైనట్టి పాత్ర వహించును. సరియైన ఆహారము నొసగి, సమర్ధవంతముగ వాటిని పెంచి పోషించిననే గాని, వాటి ఉత్పత్తి పాటవము శక్తిమంతము కాజాలదు. పెక్కు మేలిరకములకు చెందిన పెంపుడుజంతువుల ఉనికి కొన్ని నిర్ణీత ప్రాంతములకే పరిమితమై యున్నది. అట్టి నిర్ణీత ప్రాంతముల యందు పెంచుటవలననే, వాటి పాటవము అభివృద్ధి నొందగలదు. దాదాపు విస్పష్టమైన పన్నెండు జాతులకు చెందిన భారతీయ జంతుసంతతి ప్రముఖముగ పేర్కొన బడుచున్నది. పనిచేయుటకైనను లేక పాలనిచ్చుటకైనను పనికివచ్చు మేలిజాతి జంతువులను వాటి జన్మస్థలము నుండియే యేరుకొని తేవలయును. అచ్చటి జంతువుల యందు శుద్దరక్తము హెచ్చు శాతములో నుండగలదు. దానికి తోడుగా, ప్రభుత్వ వ్యవసాయ క్షేత్రముల యందును, ఇట్టి జంతువ్యాపారము చేయువారి యొద్దను సిసలైన శుద్ధజాతి జంతువులు లభ్యము కాగలవు. గుఱ్ఱములకు సంబంధించిన ఇట్టి సమాచారము 'టర్ఫ్క్లబ్బుల' యందు దొరకగలదు. అండోత్పత్తికి గాని, మాంసోత్పత్తికిగాని ఎల్లప్పుడును సిసలైన మేలుజాతి కోళ్ళనే ఎన్నుకొనవలెను. ఇవిగూడ ప్రభుత్వ వ్యవసాయక్షేత్రము లందును, కొందరు ఇతర వ్యక్తులవద్దను లభించును.
ఆధునిక కాలమున ప్రభుత్వ కేంద్రములయందు ఆవులకును, గుఱ్ఱములకును, గొఱ్ఱెలకును, మేకలకును మేలి జాతి జంతువులయొక్క శుక్లములతో ఉచితముగ కృత్రిమ గర్భధారణము బహుళముగా గావింపబడుచున్నది. ఉన్నత పశుసంపదాభివృద్ధికి ఇట్టి అవకాశములను వినియోగించుకొనవలసి యున్నది.
గృహవసతి : ఎట్టి ఆచ్ఛాదనముతో నిర్మించిన శాలల యందైనను వివిధములైన గృహజంతువులను ఉంచ వచ్చును. ప్రధానముగా యజమానియొక్క ఆర్థిక పరిస్థితి ననుసరించి, మానవులకు వలెనే ఈ జంతువులకును వాసయోగ్యమైన ఆశ్రయము నేర్పరుప దగును. బలమైన గాడ్పులు వీచు ప్రదేశములలో ఈ శాలలకు గోడలు అవసర మగును. పాదములు దిగబడకుండునట్లును, జారుటకు వీలులేనట్లును నేలభాగమును రాతితోగాని, సిమెంటుతోగాని బలిష్ఠముగా నిర్మించవలెను. ఇట్లు చేసినచో పశువులశాల పరిశుభ్రముగ నుండగలదు. ప్రత్యేకముగా అమర్చిన తొట్టెలయందు వీటికి ఆహారము నొసగెదరు.
కోళ్ళను వృక్షములుగల పశువుల దొడ్డిలోనుంచి, చుట్టును ఇనుపతీగచే అల్లికను నిర్మింపవలెను. ఆ ప్రాంత మంతయు నేలపై సున్నపు నీటిని చిలుకరించవలెను. గ్రుడ్లు పెట్టుటకై చిన్నచిన్న పేటికల నేర్పరుపవలెను. నడుమనడుమ కోళ్ళను ఇంటిగదులయందుగూడ నుంచ వచ్చును.
ఈ జంతువులకు సమీపముననే ఎల్ల వేళలయందును నీరు సిద్దముగా ఉంచవలెను. లేదా, దినమునకు అధమము నాలుగు పర్యాయములయినను వాటికి దాహ మార్పవలెను. ఒంటెవిషయములో ఈ నియమము అవసర ముండదు. ఈ జంతువునకైనను అవకాశమున్నపుడెల్ల నీటిని అందించుచునే ఉండవలెను.
ఇతర జంతువులకంటె గేదెలకు, దున్నలకు భిన్నమగు లక్షణమొకటి కలదు. ఈ రెండుజాతుల జంతువులును ఉష్ణప్రాధాన్య లక్షణముగలవి. ఇవి త్వరగా వాటి శరీరములనుండి ఉష్ణమును పోగొట్టుకొనజాలవు. అందులకై ఇవి బురదగుంటలయందును, చెరువులయందును, కాలువల యందును వాటి శరీరమును శీతలమొనర్చు కొనుటకై తనివితీరునట్లుగా దీర్ఘ కాలము పడియుండును.
గృహజంతువుల పరిపోషణమునకై తమ తమ ఆర్థిక పరిస్థితికి తగినట్లు సౌకర్యముల నొనగూర్చుచుందురు. పెంపుడు జంతువుల విషయమున అట్లుగాక, పసిబిడ్డల రక్షణమునకు గైకొను శ్రద్ధాసక్తులే వాటియెడలగూడ మనము చూపెదము; అట్టి గారాబమే వాటియెడలకూడ చూపెదము . పసిబిడ్డలకువలెనే వాటికిగూడ సమాన స్వేచ్ఛ నొసగెదము. సామాన్యముగ కుక్కలు, పిల్లుల కొరకు ప్రత్యేకముగా పరుపులు కుట్టించి పరుండ బెట్టుటయో, లేక మనప్రక్కలలోనే అవిపడుకొనుటయో జరుగుచుండును. సీమకుందేళ్లు, సీమపందికొక్కులు కొయ్య పెట్టెలయందును, గడ్డిపరుపుల మీదను పండుకొనును. కొన్ని అసాధారణమైన పెంపుడు జంతువుల నివాసమునకై, వాటి సహజగృహము (natural abodes) లను బోలు ఆశ్రయములు నిర్మింపబడును..
422