Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/467

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుహావాస్తువు

సంగ్రహ ఆంధ్ర

తేల్చుట కష్టము. కాని అవి క్రీ. శ. 7 వ శతాబ్దికి పూర్వమే నిర్మింపబడియుండునని మాత్రము చెప్పవచ్చును.

'గణేశ్ ' రథమనునది చిన్నదైనను అసామాన్యమైన సౌందర్యము కలది. ఇది మిక్కిలి ప్రాచీన మైనదిగా గన్పట్టుచున్నది. దీని పొడవు 19 అడుగులు, వెడల్పు 11 అడుగుల 3 అంగుళములు; ఎత్తు 28 అడుగులు. దీనిలో మూడు అంతస్తులున్నవి. దీని గోపుర నిర్మాణము నందు సుందరమైన ద్రవిడ వాస్తు, కళాసంప్రదాయ వివరములు గోచరించు చున్నవి. పై కప్పు సూటిగా పోయి శివుని త్రిశూలాకృతిలో నున్నది. దేవాలయము నందలి స్తంభములు అతిరుచిరములుగ నున్నవి. వాటి చూళికలు ఏనుగుల ఆకారముననున్నవి. వాటి పీఠములు యాళి లేక సింహాకృతులతో శోభించుచున్నవి. ప్రవేశ ద్వారమునందు ఇద్దరు ద్వారపాలకులు గలరు. 'జయరాణ స్తంభుని' పేర్కొను శాసన మొకటి కలదు. నాల్గింటిలో 'ద్రౌపది' రథము ఉత్తరాగ్రమున కలదు. ఇది 11 చతురపు టడుగుల పరిమాణముకలిగి అన్నిటికంటె చిన్నదిగా నున్నది. దీని పైకప్పుభాగము వక్ర రేఖావృతమై 18 అడుగుల ఎత్తుననున్నది. గోపురాగ్రభాగమున చిత్రాలంకార కలశము ఉండియుండును. కాని ప్రస్తుత మది కనిపించుట లేదు. లోపలిభాగమున 6 అ. 4 అం. పొడవును, 4 అ. 6 అం. వెడల్పునుగల గది యొకటి కలదు. అందు వైష్ణవ లాంఛన భూషితయగు చతుర్భుజలక్ష్మి విగ్రహము కలదు. ఆమె పద్మాసనాసీనయై యున్నది.

దీనితర్వాత అర్జునరథము, పిదప భీమరథము కలవు. చివరనున్నది ధర్మరాజ రథము. కాని ధర్మజ, అర్జున రథములకు పోలిక కలదు.

అన్నిటికంటె భీమరథము మిక్కిలి పెద్దది. అందు రెండంతస్తులు మాత్రమే కలవు. అందలి చావడి ఒక పెద్ద ధర్మశాలవలె కన్పడును. దాని పొడవు 48 అడుగులు; ఎత్తు 25 అడుగులు; అందు కనిపించు అవశేషములనుబట్టి మధ్యభాగమునందు ఆనాడు 30 అడుగుల పొడవును, 10 అడుగుల వెడల్పును గల ఒక చిన్న చావడి తప్పక యుండవచ్చునని తోచుచున్నది. అందు కప్పుగల రెండు కుడ్యములును, కప్పులేని రెండు కుడ్యములును గలవు. దాని చుట్టును 5 అడుగుల వెడల్పుగల ఒక వసారాయున్నది. చిత్రిత కొయ్యనమూనాలను పురస్కరించుకొని స్తంభములు నిర్మింపబడినవి. అడుగు భాగమున సింహరూపములు చెక్కబడినవి. కాని పైకి పోనుపోను ఆ స్తంభముల మందము ఉద్దిష్టమైన విధమున చెక్కి తగ్గించకపోవుటచే ఆ నిర్మాణము కొంతకాలమునకు బీటలువారినట్లు కన్పించెను.

అదే శ్రేణిలో 2, 4 స్థానములయందున్న అర్జున, ధర్మరాజ రథములు వాస్తుశిల్ప దృష్ట్యా ఒకే రూపమున నున్నవి. కాని భీమ రథముకంటె రథము చిన్నది. పరిమాణమున, అర్జున రథము ద్రౌపది రథమును పోలియున్నది. . అర్జున రథము 11 అ. 6 అం. ల సమ చతురస్రాకారము కలది. అది మంటపము, వైపున 16 అడుగు లుండును: దాని ఎత్తు దాదాపు 20 అడుగులు. లోతట్టున నున్న చావడియందు 4 అ. 6 అం. పొడవును, 5 అ. వెడల్పును గల ఒక గది కలదు. ఇందుచేతనే కాబోలు పైనుండి క్రిందివరకు రథము వీగినది. శిఖర మందలి గోపుర కలశముయొక్క కొంత భాగముకూడ దొర్లిపడి యున్నది. దానికి రెండంతస్తులు కలవు, రెండంతస్తులును కృత్రిమము లయిన చిన్న గూళ్ళ వరుసలతో అలంకృతములై యున్నవి. ఇవి ద్రవిడదేశము నందలి దేవాలయములకు గల విశిష్ట లక్షణములు. గర్భాగారములో విగ్రహము లేదు. కాని మొదటి గ్యాలరి, ఒక్కొక్క దిశ యందు మూడు చొప్పున 12 విగ్రహములచే అలంకృతమై ఉన్నది.

ధర్మరాజ రథము అన్నింటికంటె మిక్కిలి సుందరమును మిక్కిలి గొప్పదియునై యున్నది. కాని అది పూర్తి గావింపబడియుండలేదు. దాని పొడవు 26 అ. 9 అంగుళములు, వెడల్పు 28 అ. 8 అంగుళములు. ఎత్తు 35 అడుగులు. ఈ రథము ఇంత పరిమాణము కలదయ్యు ఒక నమూనా మోస్తరుగానుండునే కాని ఏ విధముగను వాసయోగ్యమైన భవనముగా లేదు. అది సూచ్యగ్రస్తూపాకారములో ఒకదానిపై నొకటి నిలిచి యుండునట్లు నిర్మింపబడిన నాలుగు అంతస్తులుగల భవనము. అదియొక గోపురమును పోలియుండును. కాని గోపురములలో పై అంతస్తులు ఇటికలతో నిర్మింప బడెను. స్తంభముల యొక్క వేదికలు యాళి, లేక

418