విజ్ఞానకోశము - 3
గురుత్వాకర్షణము
పంతులుగారి వ్యావహారిక భాషోద్యమమునకు అప్పారావుగారు కుడిభుజమై నిలిచిరి. గిడుగువారి లక్షణములకు అప్పారావుగారి రచనములు లక్ష్యము లయ్యెను.
అప్పారావుగారు ఉపన్యాసకులుగా నుండినప్పుడే 1896 లో కన్యాశుల్కమను నాటకమును, సంఘసంస్కర ణోద్యమమును బలపరచుటకును, తెలుగుభాష నాటకరంగమునకు అనుకూలమైనది కాదు, అను అపోహ నెదుర్కొనుటకును తాము వ్రాసినట్లుగా చెప్పుకొన్నారు. గిరీశంపాత్ర అప్పారావుగారి సృష్టి. ఆంధ్రదేశ మా పాత్రము నెన్నటికిని మరువజాలదు. ఇతివృత్త స్వీకరణము తన్నిర్వహణము, హాస్యరసపోషణము, పాత్రోన్మీలనము, ఇత్యాద్యంశముల యందు తెలుగు నాటకములలో కన్యాశుల్కము అత్యుత్తమమైనదని విమర్శకుల అభిప్రాయము. సాంఘిక వాస్తవికత దర్పణమునందువలె యథాతథముగా ప్రతిబింబించిన కళాఖండ మిది. కొండు భట్టీయమనునది కూడ కన్యాశుల్కము వలెనే సామాజికేతివృత్తమును స్వీకరించి, హాస్యరస ప్రధానముగా రచింపబడిన మరియొక సంపూర్ణ నాటకము. ఈ రెండింటికిని పోలిక లనేకములు గలవు. సంపూర్ణమైనచో విషాదాంతముగా పరిణమించి యుండెడి నాటక మిది. అప్పారావుగారు రచించిన మరియొక అసంపూర్ణ నాటకము బిల్హణీయము. ఇది ప్రాచీన శృంగార కథాసంబంధి యైనను పాత్రములు మాత్రము యథార్థ ప్రపంచమునుండి గ్రహింప బడినట్లు పండితుల అభిప్రాయము. అప్పారావుగారి సమకాలికులైన విజయనగరాస్థాన కవిపండితుల ప్రవృత్తులు, ఈర్ష్యాసూయలు బిల్హాణీయమున చిత్రింపబడినవని పరిశోధకులు అభిప్రాయపడిరి. పూర్వ సంస్కృతాంధ్ర బిల్హణీయ కథలకన్న అప్పారావుగారి బిల్హణీయకథ భిన్నమును ఉదాత్తమునునై యున్నది. అప్పారావుగారు ఆంగ్లమున చిత్రాంగి నాటకమును రచించినారు. ఆధునిక కథానికా రచనమున కాద్యు లెవరు?- శ్రీ గురుజాడ వారా? శ్రీ మాడపాటివారా? అనునది పరిశోధింప దగిన విషయము. గురుజాడవారి డైరీలు, లేఖలు, ఇంగ్లీషు కవిత్వము మున్నగు రచనలను విశాలాంధ్ర ప్రచురణాలయమువారు ఇటీవల ఆరు సంపుటములుగా ప్రచురించినారు. తాము పరిశోధించి వ్రాయదలచిన పూసపాటి గజపతుల చరిత్ర, విశాఖ చాళుక్యుల చరిత్ర, కళింగ చరిత్ర మున్నగువాటికి కావలసిన వస్తుజాతమును గురుజాడవారు ప్రోగుచేసిరట ! కాని చరిత్ర రచనము మాత్రము జరగలేదు. ఆధునికాంధ్ర వాఙ్మయాకాశమునకు అరుణోదయముగా భాసిల్లిన శ్రీ గురుజాడ మనజాతికి ప్రాతస్స్మరణీయుడు.
బి. రా.
గురుత్వాకర్షణము (Gravitation) :
ఎట్టి ఆధారము లేని భౌతికపదార్థము క్రింద పడునను విషయము అంద రెరిగినదే. అంద రెరిగినదే అయినను, పదార్థ విజ్ఞానశాస్త్రములో మార్గదర్శకులైన పెక్కురకు ఇదియొక పరిశోధన విషయమై యున్నది. ఇది భౌతిక శాస్త్రాభివృద్ధిలో అత్యంత ప్రముఖమైన విషయము. రాకెట్లు, స్పుట్‌నిక్కులు గల ఈ కాలమందు గూడ ఈ ప్రాథమిక సమస్యకు పరిష్కార మేర్పడి యుండలేదు. గురుత్వాకర్షణ మనునది స్పష్టముగా గుర్తింపబడవలసిన ప్రకృతిశక్తులలో మొట్టమొదటిదియై యున్నను, దాని స్వభావము ఇంతవరకును బోధపడ లేదు. ఒక భౌతిక పదార్థము మరియొక భౌతిక పదార్థమును ఆకర్షించుటకు గల అసలు కారణమేదియో ఇప్పటికిని మనకు తెలియనే తెలియదు. సర్వసామాన్య గురుత్వాకర్షణ సూత్రమును కనిపెట్టిన గౌరవప్రతిష్ఠలు న్యూటనుకే దక్కవలసి యున్నను, గతిశాస్త్రమందు (Dynamics) గెలిలియో కావించిన ప్రతిభావంతములైన పరిశోధనములను, కెప్లర్ దీర్ఘకాలము శ్రమచేసి అనుమేయించిన (deduced) గ్రహసంబంధ (planeto) చలనములను గూర్చిన ప్రయోగ సిద్ధసూత్రములను (empirical laws), ఇతడు ఉపయోగించుకొనకున్నచో, ఇతని ప్రయత్నములు నిష్ఫలములై యుండెడివి. పైన పేర్కొన్న శాస్త్రజ్ఞులకు తాను ఋణపడియున్నట్లు న్యూటన్ అంగీకరించెను. “నేను నా పరిశోధనములో ముందుకు పోగలిగి యుండుటకు కారణము, నేను మహామేధావులగు శాస్త్రజ్ఞుల భుజములపై నిలచి యుండుటయే" అని అత డొప్పుకొనెను. ఐనప్పటికిని న్యూటన్ భిన్నభిన్న క్షేత్రముల నుండి సంపాదించిన జ్ఞానమును సంశ్లేషణ మొనర్చి ప్రముఖ భావో పేతములైన అట్టి సూత్రములను జయ
395