Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/412

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గుంటూరు జిల్లా

9. బాపట్ల తాలూకా :

విస్తీర్ణము 670 చ. మై.
గ్రామములు 102
పురములు (చీరాల, బాపట్ల, పొన్నూరు, వేటపాలెం) 4
జనాభా (1951) 4,03,509
పురుషులు 2,03,558
స్త్రీలు 1,99,951
జన సాంద్రత 602
1961 లెక్కల ప్రకారము జనాభా 4,87,213

నైసర్గికస్థితి : ఒంగోలు తాలూకా జిల్లా కంతకు దక్షిణమున సముద్రతీరమున నున్నది. రేపల్లె, బాపట్ల, ఒంగోలు తాలూకాలు బంగాళాఖాతముయొక్క తీరమును కలిగి యున్నవి. పల్నాడు తాలూకా వాయవ్య దిశలో నున్నది. దీనికి దక్షిణముగా వినుకొండ తాలూకా కలదు. వీటికి తూర్పుగా గుంటూరు, సత్తెనపల్లి, తెనాలి తాలూకా లున్నవి.

చిత్రము - 103

జిల్లాలో తెనాలి, రేపల్లె, బాపట్ల తాలూకాలు కృష్ణానదియొక్క డెల్టా భాగమందున్నవి. వీటికి కృష్ణ కాలువల నీరు లభించుటచే ఇచట పల్లపు సేద్యము జరుగును. పల్నాడు, సత్తెనపల్లి, గుంటూరు, నర్సారావుపేట తాలూకాలు తూర్పు కనుమలతో కూడిన మెట్ట తాలూకాలు. పల్నాడు, సత్తెనపల్లి తాలూకాలయందు తూర్పు కనుమలు, నర్సారావుపేట తాలూకాలో కొండవీటి గుట్టలు, ఒంగోలు తాలూకాలో చీమకుర్తి కొండలు ఈ జిల్లాలో ముఖ్యమగు గుట్టలు. మిగిలిన భాగము నల్ల రేగడి నేలను కలిగియుండును.

నదులు : జిల్లాకు ఉత్తర సరిహద్దుగా నున్న కృష్ణానది ముఖ్యమగు నది. ఇది కొంత భాగమునకు తూర్పు సరిహద్దుగా కూడ నున్నది. ఈ నదియే గుంటూరు జిల్లాను నల్లగొండ, కృష్ణా జిల్లాలనుండి వేరుచేయు సరిహద్దుగా నున్నది. ఈ నదికి విజయవాడ వద్ద నొక ఆనకట్ట నిర్మింపబడి అటనుండి ఇరువైపుల పెద్ద పెద్ద కాలువలద్వారా పొలములకు నీరు అందించబడుచున్నది. మాచర్ల సమీపములోనున్న నందికొండ వద్ద కూడ నొక గొప్ప జలాశయము నిర్మింపబడుచున్నది. గుండ్లకమ్మ అను మరియొక నది, కర్నూలుజిల్లాలోని కంబం చెరువు నుండి బయలుదేరి వినుకొండ, ఒంగోలు తాలూకాల గుండా ప్రవహించుచున్నది. ఇది వర్షకాల మందే ప్రవహించు చుండును. నాగులేరు వినుకొండ తాలూకాలోని కొండలలో పుట్టి ఉత్తరముగా ప్రవహించి కృష్ణలో కలియుచున్నది. అట్లేచంద్రవంక యను మరియొక చిన్ననది కూడపల్నాడుతాలూకాగుండా ప్రవహించి కృష్ణలో కలియును.

363