Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/388

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గానశాస్త్ర చరిత్ర

వాద్యములు దేశమున విశ్రుతములై యుండినట్లు తెలియుచున్నది.

జయదేవుడు: 13 వ శతాబ్దము నందలి సంగీత శాస్త్రమును తెలిసికొనుటకు "సంగీత రత్నాకరము" వలె లక్ష్య విషయమున జయదేవుని “గీతగోవిందము" కూడ తోడ్పడును. ఇతడు 24 అష్టపదులందును "మాలవ, ఘూర్జరి, వసంత, రామక్రియ, మాళవగౌడ, కర్ణాట, దేశాఖ్య, దేశవరాళి, గుణకరి, వరాళి, విభాస, భైరవి" అను రాగములును, “రూపక, యతి, నిస్సారుక, ఏక, అష్టతాళము”లును చేర్చి పాడెను. ఇవి భక్త్యను సరణ, నృత్యానుకూల గేయములు. నాయికా నాయక భావభరితముగ నున్నవి. ఈ తాళములు చచ్చత్పుటాది 108 తాళవిధానము లందలివి. అనంతర కాలమున 15వ శతాబ్దము వరకు వేమభూపాలుడు, గోపేంద్ర తిప్పభూపాలుడు, సింగభూపాలుడు, వసంతరాయలు మున్నగువారు సంగీత గ్రంథములు వెలయించిరి.

ద్వివిధ సంగీతములు: ఇప్పుడు మనకు శ్రుతమగుచున్న హిందూస్థానీ, కర్ణాటక గానరీతులు 15 వ శతాబ్దికి వ్యాప్తిలో నున్నట్లు కానము. మొగలాయి రాజ్యము ఉత్తరమున స్థిరపడినప్పటినుండి హిందూస్థానీ పద్ధతి వెలసినట్లు చరిత్రము వలన తెలియుచున్నది. అప్పటికి పారశీక ఆఫ్ఘన్ స్థానములందలి సంగీత విద్వాంసులు తమ దేశపు ఏలికలతో ఢిల్లీప్రాంతములకు వచ్చి, స్థిరపడి తమగాన విధానమును నెలకొల్ప దొడగిరి. 17వ శతాబ్దినాటి అక్బరు ఆస్థాన గాయకులైన 'తాన్ సేన్', 'అమీర్ ఖుస్రు', 'రాజామాన్ సింగ్ ' మున్నగువారు 'ధ్రుపద్ ' గానము, 'సారంగ' వాద్యము, హమ్మీర్, కమాచ్, మాల్ కౌస్, బేహాగ్, సారంగ్ మున్నగు రాగములు తమ పద్ధతుల చొప్పున ప్రవేశపెట్టిరి.

మేళరాగకాలము (క్రీ.శ. 15, 16,17,18 శతాబ్దములు): విద్యారణ్యులు (క్రీ. శ. 1330-1450) కర్ణాట రాజ్యస్థాపన మొనర్చెను. ఇతడు శుద్ధ వికృత స్వరములను క్రమముగ జేర్చిన పంచదశ మేళ రాగములను[1] చెప్పిరి. ఇతడు తక్కినరాగములు వీటి జన్యము లని చెప్పెను. అనంతరము రామామాత్యుడు మున్నగువారు ఈ పద్ధతిని అనుసరించిరి.

తాల్లపాకవారు : 15, 16 శతాబ్దములందు తాళ్లపాకవారు సంకీర్తన పద్ధతియందు తమ గేయములను దేశీయ రాగములందు పాడిరి. అన్నమాచార్యుడు (1425 - 1503) శృంగార కీర్తనలలో, నాయకుని శ్రీ వేంకటేశ్వరునిగను, నాయికను అలివేలుమంగగను ఎంచి విశ్రుత రాగములందు రచించెను ఇతని కుమాళ్లు, మనుమలుకూడ కీర్తనలు రచించిరి. ఇప్పుడు ప్రచారమున కొంతవరకు తగ్గిన ఆహిరి, సామంత, పాడి, దేశాక్షి, ఘూర్జరీ మున్నగు రాగములు వీరి కీర్తనలందు కలవు.

రామామాత్యుడు (క్రీ. శ. 1550): “స్వరమేళ కళానిధి" అను గ్రంథమును రచించెను. ఏడు వికృత స్వరములలో 9వ శ్రుతిని పంచశ్రుతి ఋషభముగను, 10 వ శ్రుతిని సాధారణ గాంధారముగను, 11 వ శ్రుతిని అంతర గాంధారముగను, 12 వ శ్రుతిని చ్యుత మధ్యమముగను, 16 వ శ్రుతిని చ్యుతపంచమముగను, 22 వ శ్రుతిని పంచశ్రుతి ధైవతముగను, 1 వ శ్రుతిని కైశికి నిషాదముగను, 2 వ శ్రుతిని కాకలి నిషాదముగను తెలిపెను. శుద్ధములతోగూడ చేర్చి (1) ముఖారి, (2) మాళవగౌళ, (3) శ్రీరాగము, (4) సారంగనాట, (5) హిందోళము, (6) శుద్ధరామక్రియ, (7) దేశాక్షి, (8) కన్నడగౌళ, (9) శుద్ధనాట, (10) ఆహిరి, (11) నాదనామక్రియ, (12) శుద్ధవరాళి, (13) గౌళ, (14) వసంత భైరవి, (15) కేదారగౌళ, (16) హెజ్జజ్జి, (17) సామవరాళి, (18) రేవగుప్తి, (19) సామంత, (20) కాంభోజి అను మేళ రాగములను పేర్కొనెను.

సోమనార్యుడు : క్రీ. శ. 1609 వ సంవత్సరమున “రాగవిబోధ" అను గ్రంథమును రచించెను. ఈతని వికృత స్వరములలో (1) చతుశ్రుతి ఋషభము, (2) సాధారణ గాంధారము, (3) అంతరగాంధారము, (4) షట్ఛ్రుతి

మధ్యమము, (5) చతుశ్శ్రుతి ధైవతము, (6) కైశికి నిషాదము, (7) కాకలి నిషాదము అను వాటిని శుద్ధములతో చేర్చి (1) ముఖారి, (2) రేవగుప్తి, (3) సామ

  1. "తేషాం మతాః పంచదశ మేలాః" అని సంగీతసుధ అను గ్రంథమున కలదు.

339