Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/387

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గానశాస్త్ర చరిత్ర

సంగ్రహ ఆంధ్ర

యించిరి. యక్షటిక, కీర్తిధరులు భాషా-విభాషాంతర భాషలు అను విధమున మతంగుని మతము ననుసరించి రాగములను విడంబించిరి.

నారదుడు 7 వ శతాబ్దమున “సంగీత మకరందము" అను గ్రంథమును రచించెను. అందతడు 22 శ్రుతులు;[1] 29 స్వరతానములు, 93 దేశీరాగములు, స్త్రీ - పుం నపుంసక రాగములు, 108 చచ్చత్పుటాదులు వివరించెను.

అభినవగుప్తుడు (క్రీ. శ. 1050) : భరతుని నాట్యరీతులు 14 వ శతాబ్దికి అనంతరము దేశకాలముల ననుసరించి మారుచుండుట వింతగొల్పదు. మార్గ సంగీతము శాస్త్రీయమైనది. దేశి సంగీతము గూడ ఆదరణీయమని ఆయా కాలములందలి శాస్త్రజ్ఞులు చెప్పుచుండిరి. అభినవ గుప్తుడు 96 రాగములను తెలిపి, వాటిని (1) శుద్ధ, (2) భిన్న, (3) గౌడ, (4) వేసారి, (5) సాధారణములు అని పంచవిధములుగ విభజించెను. ఒక శతాబ్దము పిదప 'నాన్యభూపాలుడు' (క్రీ.శ. 1093-1133) అభినవగుప్తుని పంచవిధ రాగములకు భాష, విభాషలను చేర్చి, వాటిని ఏడు విధములుగ చెప్పెను. ఇతడు భరతుని అంతర్భాషలను చెప్పలేదు.

శారదా తనయుడు (క్రీ. శ. 1175-1250) : “భావ ప్రకాశన" యందు 104 రాగముల వరకు చెప్పెను. భరతుని భాషాదులనే అనువదించెను. క్రీ శ. 1165 కాలమునాటి పార్శ్వదేవుని “సంగీత సమయసారము"న 108 తాళములు, భాషాది రాగ విధానములు చెప్పబడెను.

శార్జ్గ దేవుడు (క్రీ. శ. 1210-1247): ఇతడు “సంగీత రత్నాకరము" అను స్వతంత్ర గ్రంథమును రచించెను. షడ్జ, మధ్యమ గ్రామములే కాక, గాంధార గ్రామముకూడ చెప్పెను. కాని అది గంధర్వలోకముననే ఉండినట్లు చెప్పెను. ఇతడు 14 మూర్ఛనలతో గ్రామ రాగముల నెంచి అందు భరతుని వలె ఏడు జాతి రాగములను చెప్పెను. మరియు యక్షటికుని భాషాదిరాగ విధానము పూర్వోక్తముగా గణించి రాగములను రాగాంగోపాంగ భాషాంగ క్రియాంగములు అను నాలుగు విధముల పేర్కొనెను. మార్గదేశిరాగముల మొత్తమును 264 గా చెప్పెను. రాగాలప్తి, రూపకాలప్తి విధానములు జెప్పెను. ఇతడు రాగమునకు "శ్లో. గ్రహాంశతార మంద్రాశ్చ న్యాసా పన్యాసకౌ తథా ! అపి సన్యాస విన్యాసౌ బహుత్వం చాల్పతా తతః | ఏతా న్యంతర మార్గేణ సహలక్ష్మాణి జాతిషు | షాడవౌడువితే క్వాపీ త్యేవమాహుస్త్రయోదశ" (సం. ర.) అని 13 లక్షణములను చెప్పెను. రాగనిరూపక గమక విషయమున (1) తిరుపము, (2) స్ఫురితము, (3) కంపితము, (4) లీనము, (5) ఆందోళితము, (6) వళి, (7) త్రిభిన్నము, (8) కురీళము, (9) ఉల్లాసితము, (10) ప్లావితము, (11) హుంపితము, (12) ముద్రితము, (13) నామితము, (14) మిశ్రితము, (15) అహతము - అనునవి చెప్పెను. వీటి నిప్పుడును గ్రహింతుము-ఇతడు భరతుని తాళదశప్రాణములను, చచ్చత్పుటాది 108 తాళములను వివరించెను. మరికొన్ని తాళములను, స్వకల్పితమగు నిశ్శంక తాళమును కలిపి 120 తాళములను చెప్పెను.

పాల్కురికి సోమనాథుడు (క్రీ. శ. 1199-1260) : ఇంచు మించు శార్జ్గదేవుని కాలము నాటి వాడు. ఇతడు తన "పండితారాధ్య చరిత్రమున" గాన విషయము గూడ వివరించుచు ద్వావింశతి శ్రుతుల పేర్లు, ద్వివిధ గ్రామములు, 14 మూర్ఛనలు, 32 శుద్ధతానములు, రాగాంగోపాంగ– భాషాంగ – రాగ విభాగములు సంపూర్ణ షాడవ ఔడవ రాగ విధములు, స్త్రీ - పుం - నపుంసక రాగములు, చచ్చత్పుటాది అష్టోత్తరశతతాళములు, జాతీయ, దేశీయ నృత్యరీతుల వర్ణనలు, ప్రేరణ, ప్రేంఖన, కుండలి, తాండవ లాస్య నృత్యములు, 108 కరణములు చెప్పెను. పెక్కు రాగముల పేర్లు శార్జ్గదేవు డెంచిన చొప్పున ఇతడు తెలిపెను.

తిక్కన సోమయాజి కూడ (13వ శతాబ్దము) దేశీయ నృత్యము లిట్లు అర్జునుని నోట పలికించెను-


"అభ్యసించితి శైశవ మాదిగాగ
 దండలాసక విధమును, గుండలియును,
 ప్రేంఖణంబు తెఱంగును బ్రేరణియును"

ఈనాటి కవుల గ్రంథములను బట్టి అప్పటికి వీణ, వేణు, మృదంగములు; ఆనకములు, కాహళము, పటహము, భేరి, ఢంకా, బుడుబుడుక్క, డమరుకము మున్నగు
  1. భరతుడు చెప్పిన పేర్లకు భిన్నములుగ నున్నవి.

338