Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/384

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గానము

రోహణ విధానము సప్తస్వరములు ప్రవర్తింపజేయబడు చుండుట గమనింపదగినది. ఈ పరిణామమును గూడ ఆధునిక శాస్త్రజ్ఞులు గుర్తించి ఈ పద్ధతికి గూడ శాస్త్రప్రమాణమును కల్పించిరి. ఈ సందర్భముననే నారదుని రాగవిభాగ పద్ధతి, మతంగ, పార్శ్వదేవుల రాగవిభాగ పద్ధతి. రామామాత్యుని రాగవిభాగ పద్ధతి, వాటి యందుండు భేదములు, పార్శ్వ దేవుని రాగపద్ధతి క్రమముగ నాచారమునుండి తొలగుటయు, శౌర్య, వీర్య, శృంగారాది రస భావ గుణ వ్యంజకత్వము స్ఫుటముగగల్గి గంభీరమగు గమనపద్ధతి కల్గిన అయిదు ప్రధాన రాగములను ఘనరాగ పంచకమని నిర్దేశించుటయు, ఆరాగములలో ప్రత్యేకించి వాగ్గేయకార చక్రవర్తియగు త్యాగబ్రహ్మ ధాతు మాతువుల గంభీరత స్పష్టపడునట్లుగా అయిదు కృతులను రచించుటయు. గమనించినచో, రాగ ప్రపంచమున కలిగిన మార్పులును, వాటికి శాస్త్రకారులు ప్రామాణికత్వమును కల్పించి, వాగ్గేయకారులకు నూత్న మార్గములను చూపి దోహద మొసంగుటయు మనకు ద్యోతకము కాగలదు. ఇట్లే గ్రామముల సందర్భమునను శాస్త్రకారులు విభిన్న మతములను, ఆయా కాలములనాటి ప్రాధాన్యమునుబట్టి ప్రమాణములు మారుటయు మనము తెలిసికొనగలము. షడ్జ, మధ్యమ, గాంధార గ్రామములలో గాంధార గ్రామము సప్తస్వరములు కలదియై గానయోగ్యముగ నున్నదని ప్రాచీన లక్షణకర్తయైన రామామాత్యుడు చెప్పియుండెను. అన్ని దేశీయరాగములు నీషడ్జ గ్రామమునకు చెందినవే యని కూడా ఆతడు పేర్కొనెను. పంచమమునకు ఒక శ్రుతి మాత్రము తక్కువగా నుండి, సప్తస్వరములుకల మధ్యమ గ్రామముకూడా గానయోగ్యమైనదనియే శాస్త్రకారు లభిప్రాయ పడిరి. ఇక మూడవదగు గాంధార గ్రామము సప్తస్వరములు కలదైనను, మానవప్రాణికి గానయోగ్యము కాని వికృతస్వరములతోకూడి యుండుటచే, ప్రాచీనలక్షణ కారులే ఊరక శాస్త్రమున ఈగాంధార గ్రామమున్నదను విషయమును చెప్పుటయేకాని, వ్యవహారమునుండి దానిని తొలగించిరి. నాట్యశాస్త్రముకూడ దీనినిగూర్చి ప్రస్తావింపకపోవుటకూడ దీనికి ఉపబలక ము. ఇట్టి యెడ వాగ్గేయ కారులకును, గాయకులకును, శాస్త్రజ్ఞానమువలన కలుగు ప్రయోజనమును గూర్చి చెప్ప నవసరములేదు.

ఇక తాళ విషయమునకూడ శ్యామశాస్త్రిచే కనిపెట్టబడిన 'శరభానంద తాళము', రఘునాథనాయకునిచే కనిపెట్టబడిన 'రామానంద తాళము' మున్నగువాటిని గూర్చి పరిశీలించినచో, సమర్థుడగు వాగ్గేయకారుడు సృష్టియొనర్చుచో నూతనతాళాదులు కూడ స్వీకార యోగ్యములే యను నంశము స్పష్టపడి ఆధునిక వాగ్గేయకారులకు శాస్త్రము ప్రోత్సాహము కల్గింపజాలుచున్నది. లక్ష్యలక్షణ గీతములు రచించిన వెంకటమఖి, పురందరదాసు మున్నగు శాస్త్రకారులచే గానప్రపంచమునకు కలిగిన మేలు అనూహ్యము. ఈ సందర్భమున మతంగుడు 49 దేశీప్రబంధములను పేర్కొని యుండుటయు, శార్జదేవుడు 75 ఇతర ప్రబంధములను పేర్కొనియుండుటయు, ప్రాచీనములగు, ఠాయాదిప్రబంధములకు, సూళాదులకు గల తారతమ్యములను గుర్తించి ఆయా లక్షణ భేదములను శాస్త్రప్రమాణ పూర్వకముగ శాస్త్రజ్ఞులు ప్రజల కర్పించుటయును గమనింపదగినది.

ఈ పట్టున గమనింపదగిన ఇంకొక ముఖ్యాంశము కలదు. పదకవితాపితామహుడని ప్రసిద్ధినొందిన తాళ్ళపాక అన్నమాచార్యులు గానశాస్త్రమున తనకు పూర్వము వ్యవహారమునందున్న సంగీత రచనలకు పదము, గేయము అను పేర్లు కలవనియు, తాను సృజించిన ఒకానొక సంగీత రచనను 'సంకీర్తన'మని వాడ దగుననియు సూచించెను. సంకీర్తనమను సంగీతరచనకు సంస్కృతమున “హరేర్వా, ప్రభోర్వా, కీర్తనమ్ సంకీర్తనమ్" అను నిర్వచనము కన్పడుచున్నది. ఈ సంకీర్తనమే' కీర్తనమై గాయక త్రిమూర్తులలో నొకడు త్యాగబ్రహ్మరచనాకాలము నాటికి 'కృతీనామ సౌభాగ్యము' వడసినది. 'కృతి'యను పదమున నిపుణుడగు వాగ్గేయకారుని రచనాచాతుర్యమే ప్రధానముగ ధ్వనించుచున్నది. ఈ పరిణామములన్నియు ఆ యాకాలపు శాస్త్రకారుల ఆమోదముద్రను పొందుచునే వచ్చినవి. దీనికిగల మూలకారణమేమన ప్రసిద్ధులగు ఏ వాగ్గేయకారులు కాని, తమతమ రచనలకు పరమేశ్వర లీలాసంకీర్తనమును ఆదర్శముగ తీసికొనుటను నిరాకరింపక యే అమేయము, అపారమునగు స్వకీయప్రజ్ఞలను

335