Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/383

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గానము

సంగ్రహ ఆంధ్ర

లక్ష్య ప్రపంచజ్ఞానముచే దేశవ్యాప్తము స్థిరమైన ఉత్తమ ప్రమాణములతో నూత్న వినూత్న ప్రబంధ నిర్మాణ మొనర్చి తద్వారా సత్ఫలితములను సాధించుట, గాన కళచే సంవర్ధితములగు నాట్యాది ఇతర కళలను కూడ నిర్దుష్టముగ సంపుష్ట మొనర్చుట, లోకుల అభీష్టము ననుసరించి ఎప్పటికప్పుడు పెరిగిపోవుచున్న బహువిధములగు లక్ష్యప్రబంధములలో గల లోపములను, దోషములను ఎప్పటికప్పుడు సంస్కరించుచు, సత్పరిణామములకు గతి కల్పించుచు లోకమంగళస్థితిని సంరక్షించుట, వాగ్గేయకారులకుమార్గదర్శకమై ఆయాగాయకుల చిత్తప్రవృత్తుల యందలి మాలిన్యమును తొలగించి ఉత్తమ గాన కళావిర్భావమునకు తగినట్లు వారి మానసిక ప్రవృత్తులను సంస్కార మొనర్చుట అనునవి శాస్త్రమువలన గానకళకు కలుగు ప్రయోజనములై యున్నవి.

గానకళయం దొక ప్రధానాంశమైన 'ఆర్చిక, గాథిక, సామిక, సర్వాంతర, ఔడవ, షాడవ' పద్ధతులలో నడచిన రాగముల చరిత్ర ముఖ్యముగ గానకళకు శాస్త్రము వలన కలుగు ప్రయోజనమును ఉటంకించుటకు ఉపకరించు చున్నది. చరిత్ర కందని ప్రాచీనకాలము నందును, ఋగ్వేద కాలము నందును, వేదమును ఉదాత్త అను దాత్తాది స్వరభేదము లేకుండ ఒకే స్వరములో ఉచ్చరించెడువారు. దీనినే ఏకస్వర గాయన పద్ధతి యనియు, ఆర్చికపద్దతి - అనగా అర్చా= పూజాపద్దతి - యనియు నందురు. తరువాత గాథలను గానము చేయవలసి వచ్చినపుడు రెండు స్వరముల నుపయోగించెడువారు. దీనినే గాధికమందురు. తరువాత ఉదాత్తానుదాత్త, స్వరితరూపములగు త్రిస్వరములతో వేదమును గాన మొనర్చిన పద్ధతినే త్రిస్వరగాయన పద్దతి యనియు, సామవేద కాలమునాటికి ఆచార వ్యవహారసిద్ధమై యుండుటచే సామికమనియు వ్యవహరించిరి. తరువాత క్రమముగ సర్వాంతర అనగా నాలుగు స్వరములతో గానపద్దతి ఔడవ-షాడవ అయిదు, ఆరు స్వరములతో గీతపద్ధతి - వాడుకలోనికి వచ్చినది. ఇంకను కాలము జరిగిన కొలది, సామవేద కాలమునాటికే సప్తస్వరములతో కూడిన గానపద్ధతి ప్రచారములోనికి వచ్చుటయు, సామవేదము ఆ స్వరములను ఉత్కృష్ట, ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ, మంద్ర, స్వరితనామములతో వ్యవహరించుటయు గానశాస్త్రజ్ఞులకు బాగుగ తెలిసిన యంశమే. తరువాత ఈ సప్తస్వరములే శ్రుతిభేదములతో శతాధికముగ ప్రస్తరింపబడుటయు సువిదితము. ఈ స్వరపరిణామ చరిత్రమును, భరతుడు మొదలు సుబ్బరామ దీక్షితుల వరకు గల సంగీత శాస్త్రజ్ఞు లెల్లరు గుర్తించుచు ఆయా స్వరములకు ప్రమాణత్వమును కల్పించుచునే వచ్చిరి.

ఇట్లే రాగముల విషయమున గూడ జరిగిన పరిణామమును ఆయా శాస్త్రవేత్తలు శాస్త్రసమ్మత మొనర్చి యుండిరి. బృహద్దేశి యను గానశాస్త్రమునకు కర్తయగు మతంగుని కాలము నాటికి వ్యవహారమునందున్న. టక్క, బోట్ట, సౌరాష్ట్ర, ఘూర్జరి, ఆంధ్రి, మాలవి, షాడ్జోదీచ్య, గాంధారి, సౌవీర, ఆభీరి, హిందోలక, అను స్వల్పసంఖ్యా పరిమితరాగములతో చాలవరకు ఆయా దేశముల పేర్లే రాగముల పేరులుగా నున్నట్లు తెలియ గలదు. మరి ఇప్పుడో, ప్రస్తారపద్ధతి వలనను, జన్యజనక పద్ధతి వలనను అన్యదేశ గానపద్ధతి సంసర్గము వలనను రాగములు అనంతములుగా నుప్పతిల్లినవి. భిన్నభిన్న దేశములయందలి, విశిష్ట సౌందర్య స్ఫూర్తితో అభిరుచుల కనుగుణముగ క్రొత్తక్రొత్తరుచులను సంతరించు కొనుచు బలసిపోయిన రాగ ప్రపంచమున రంజకత్వధర్మము మిక్కిలి హెచ్చుగా కన్పట్టు చుండుట చేతనే, అంతకుపూర్వము భరతాచార్యుడు చెప్పిన “రజ్యతేయేనయః కశ్చిత్ సరాగః" అను రాగ లక్షణమును జనసామాన్యమంతకును వర్తించునట్లుగా మార్చి, రాగముల యందలి ముఖ్యపరిణామ మగు రంజక ధర్మమును గుర్తించి “రంజకో జన చిత్తానాం సరాగ ఉదాహృతః" అని తీర్చిదిద్దినాడు. తరువాత ఇంకొక ముఖ్య విశేష మేమన: స్వరములు సప్తస్వర పద్ధతికి వివృద్ధము చేయబడినప్పుడు 'మ, గ, రి, స, ని, ద, ప, ' అను రీతిగా సప్తస్వరము లుండెడివి. ఈ స్థాయీ స్వరపద్ధతి కనిపెట్టిన విధానమే చాలా ముఖ్య మైనదియు, అప్పటినుండియే సంగీతకళ యథార్థముగా ప్రారంభమై అనంతములైన రాగములను సృష్టించుటకు అనువుపడినదనియు, భారతీయ సంగీతశాస్త్రజ్ఞులు వ్రాసియుండిరి. అట్టియెడ ఆధునిక గానప్రపంచమున 'సరిగమపదని, సనిదపమగరి' అను విధముగ షడ్జమముతో ఆరోహణ అవ

334