Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/385

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గానశాస్త్ర చరిత్ర

సంగ్రహ ఆంధ్ర

ప్రదర్శించి గానకళను అత్యున్నతస్థితికి తీసికొనివచ్చుటయే. కావుననే, సుప్రసిద్ధ వాగ్గేయకారకుడైన క్షేత్రయ్య మధురభావ భక్తిపూర్వకముగ శృంగార పదరచనము నొనర్చి, అతని రచనమునకు ఆలంబనముగ గోపాలదేవు నాశ్రయించుటయు కల్గినది. సంగీత కళయందు రసికత పెచ్చు పెరిగి కేవల శృంగారమునకు దారితీసినను విశ్వ శ్రేయోపాదనమే ప్రధాన కర్తవ్యముగ శిరసావహించిన 'మాబ్రహ్మనిరాకరణమస్తు'అను శ్రుతివాక్యమును ఏ మరజాలక పోయిరను నంశము తెల్లమగుటయేకాక “కం - పరమాత్మానం -లాతి గృహ్ణాతీతి" (పరమాత్ముని గ్రహించునదియే కళ) అను కళాశబ్దముయొక్క నిర్వచనమునకు భంగము రాకుండ 'హరిసంకీర్తనమును కాని, ప్రభుసంకీర్తనమును కాని చేయునది'యే కీర్తనమని-కీర్తన లక్షణమును శాసించి యుండిరనిన, 'గానకళ' లౌకిక ప్రయోజనములకు కాక, ఆధ్యాత్మిక ప్రయోజనములకే నిర్దేశింపబడవలయునని శాస్త్రజ్ఞులు సంకల్పించియుండిరని తెలియుచునే యున్నది. కావుననే "సంగీతవిజ్ఞానమే కంహి సాక్షాన్మోక్షప్రదాయకమ్" అనికూడ నొక్కి చెప్పుటయు సంభవించినది.

ఇంతకంటె గానశాస్త్రమువలన గానకళకు సిద్ధించు పరమప్రయోజనము ఇంకొకటి యేమికలదు? ఇంత కంటెను సూక్ష్మముగ శాస్త్రమును పరిశీలించినచో బయల్పడు నొక మహారహస్యము గమనింపుడు. వాగ్గేయకార లక్షణముల నిచ్చుచు 'రోషద్వేషపరిత్యాగమును, సార్ద్రత్వమును, ఉచితజ్ఞత్వమును' వాగ్గేయకారునకు విధిగా నుండదగు గుణములుగా శాస్త్రకారులు నిబంధించి యుండిరి. రోషద్వేషములవలన అనాలోచితముగ ప్రబంధములయందు సంధింపబడు కటువాక్యరచనాదులను ఎంత సూక్ష్మదృష్టితో శాస్త్రకారులు నిషేధించిరో, గానకళవలన లోకమున కెట్టి భద్రస్థితిని వారు ఆమంత్రించి యుండిరో ఊహింపనగును.

భరతముని కాలమునుండి వ్యవహారమునందున్న 'ఆంధ్రి' యను రాగపుపేరునుబట్టి ఆంధ్రదేశమునందలి సంగీతాభిమానమునేకాక, ఆనాడే ఆంధ్రులొక ప్రత్యేక సంగీతశాఖను వెలయింపగలిగిన ప్రజ్ఞావంతులుగ నుండిరను నంశము స్పష్టపడుచున్నది. అంతియేకాక దేశీయ, విదేశీయ, అంతరరాష్ట్ర గానపద్ధతులలోకల భేదములను, ఆయాపద్ధతుల సమ్మేళనమువలన కలుగు నూతన సృష్టిని గుర్తింపగల్గుట శాస్త్రాధారమువలననే. ఉదాహరణమునకు హిందూస్థానీ కర్ణాటక సంగీతములను తీసికొనవచ్చును.

ఇక ఒక్కొక్క నిషిద్ధస్వర వర్ణసమ్మేళనముతోకూడిన విరుద్దరాగముల మేళనమువలన కలుగు ఉత్పాతములను తెలియజేయునది శాస్త్రమే. అట్లే అనుకూల రాగ, స్వర, వర్ణసమ్మేళనము నెరుకపరచుటకును శాస్త్రమే సమర్థమైనది. తత్తత్కాలాలాపనోచిత రాగజ్ఞానము కల్గించుటకును శాస్త్రమే ఆధారము. దీపకాది రాగములచే కల్గు విదాహకత్వమును పరిహరించుటకు మేఘరంజన్యాది రాగములు సమర్థములను విషయపరిజ్ఞానము శాస్త్రము మూలమునగాక ఎట్లు లభ్యపడును? అద్భుతశక్తి, మహత్తర ప్రజ్ఞయు కల గానకళచే అధిక సస్యోత్పత్తి సాధించుట, తలంచినపుడు వర్షములు కురిపింప జేయగల్గుట, పశువులకు అధికక్షీరోత్పత్తి కలిగించుట, అసాధ్య రోగనిదానము కలిగించుట మున్నగు అద్భుత సంఘటనలు, అద్భుత పరిణామములును కల్గించుటకు వలసిన స్వర, రాగ, వర్ణ సమ్మేళనమును గూర్చి తెలుపునదియు శాస్త్రమే.

గానశాస్త్రమువలన గానకళకు కలుగు ప్రయోజనములు అనంతములు. ముఖ్యముగ కళను విశ్లేషించి కళాస్వరూపము తెలియజేయుటకును, కళను అవినింద్యముగ అభివృద్ధి యొనర్చుటకును, లోకకళ్యాణమునకై కళను ఆవర్తింప జేయుటకును శాస్త్రము చక్కగ తోడ్పడును.

ఊ. ల.


గానశాస్త్ర చరిత్ర :

ప్రాచీన కాలముననే ఈజిప్టు, గ్రీసు, మున్నగు దేశముల వారికి భారతీయ సంగీతము ఆదర్శకముగ నుండెనని హెల్ము హోల్ట్సు (Helm Holts), బ్లెస్‌రినా (Blessrina) మున్నగు పాశ్చాత్య శాస్త్రజ్ఞులు తెలిపిరి.

గానశాస్త్ర మనగా సంగీత శాస్త్రము. సంగీతము వలన ధర్మము, అర్థము, కామము, మోక్షము అను చతుర్వర్గ ఫలములు కలుగ గలవని చెప్పబడెను. అందు

336