Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/359

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గర్భధారణము - ప్రసవసమస్యలు

సంగ్రహ ఆంధ్ర

చేయబడుచున్నది. పంచదార, కాఫీ, కోకో ప్రధానములైన పంటలు. కొలది ప్రమాణములో, బంగారము దొరకు గనులు కలవు. ఆమెరికాయందు గల అల్యూమినియం కంపెనీ ఉపయోగముకొరకై బాక్సైట్ ఉత్పత్తి కాబడుచున్నది. దీనియొక్క రాజధానియైన 'పరమారిబో' యందు 50,000 మంది ప్రజలు నివసించు చున్నారు.

గయానాయందు గల మూడు వలసప్రాంతములలో ఫ్రెంచి ప్రాంతము మిక్కిలి తక్కువ ప్రాముఖ్యము కలది. దీని వైశాల్యము ఆంధ్రప్రదేశము యొక్క వైశాల్యములో మూడవవంతు మాత్రమే. కాని సాగుచేయబడుచున్న భూమి 12 నుండి 14 చ. మైళ్ళకంటె అధికముగా లేదు. రాజధానియైన 'కేయన్న' యందు మిశ్రమజాతులకు చెందిన 14,000 మంది ప్రజలు నివసించుచున్నారు. ఫ్రాన్సుదేశమునుండి పంపబడు నేరస్థుల నివాసమునకై కొంత ప్రాంతము ప్రత్యేకింపబడియున్నది.

కె. వి.


గర్భధారణము - ప్రసవసమస్యలు :

ఏ జాతియైనను వృద్ధి యగుటకు సంతానోత్పత్తి అవసరము. మానవులలో స్త్రీల యొక్క పాత్ర ప్రధానమైనది. స్త్రీ ప్రసవించుటకుముందు పిండము ఆమె గర్భములో తొమ్మిదినెలల కాలము పెరుగును.

గర్భధారణ చిహ్నములు: రెండురకములకు చెందిన స్త్రీలు కలరు. వీరి విషయమున ప్రత్యేక శ్రద్ధ అవసరము. (1) ఆలస్యముగా వివాహమైన స్త్రీలు, ముట్టు (రజస్సు) ఆగిపోవు సమయములో, తాము గర్భముధరించి యున్నట్లు తెలిపి వైద్యులను పెడత్రోవలో పెట్టుదురు. (2) అవివాహితలైన స్త్రీలు నీతివిరుద్ధముగా ప్రవర్తించి, గర్భమేర్పడునేమో యని భయపడి తెలిసియో తెలియకయో వైద్యులు పెడదారిపట్టు రీతిగా చెప్పుదురు.

గర్భధారణ చిహ్నములు కొన్ని ఈ క్రింద పేర్కొనబడినవి. వీటిలో ఒక్కొక్కటి వేర్వేరుగా కాక అన్నిటిని మొత్తముగా, సమగ్రముగా గ్రహించిన యెడల గర్భధారణమును గుర్తించుటకు అవి ఉపయోగపడగలవు.

1. ముట్టు ఆగిపోవును.

2. వేవిళ్ల చిహ్నములేర్పడును.

3. స్తనములు పెద్దవగును. చను మొనలు నలుపెక్కును. ఇది మొదటిసారిగా గర్భధారణము జరుగునప్పుడు గోచరించు చిహ్నము.

4. మూడవ మాసము మొదలుకొని గర్భాశయము (యుటిరస్) క్రమక్రమముగా పెద్దదియై 24 వ వారము నాటికి బొడ్డు ఎత్తునకు వచ్చును. 36 వ వారమునాటికి అది సుమారు కాలేయము (liver) తోను, క్రిందివైపున ప్రక్క ఎముకల (lower ribs) తోను సమానమైన మట్టమునకు వచ్చును. ఆఖరు 4 వారములలో దాని యెత్తు కొంచెము తగ్గును.

5. గర్భస్థమైన శిశువు చలించుట : గర్భధారణస్థితిలో స్త్రీ మధ్యకాలములో తన గర్భస్థపిండముయొక్క చలనమును తెలిసికొనగలదు.

6. తరచుగా మూత్రవిసర్జనము చేయవలెనను కోరిక కలుగును. ఇది తొలిదశలో కొన్నివారములలోను, చివర రెండు మూడు వారములలోను ఉండును.

7. వివిధములయిన వస్తువులు తినవలెనను కోరికయు, మానసిక స్వభావములో మార్పును, నిరాశయు, చిరాకును మొదలగు మానసిక లక్షణములు కనబడుచుండును. వీటితోపాటు ఆ కారములో వైకల్యము గోచరించును.

8. గర్భాశయముయొక్క ముఖద్వారము (cervix) మెత్తబడును.

9. భగ రంధ్రము నీలివర్ణముగా మారును.

10. గర్భస్థపిండముయొక్క భాగములను కడుపుమీద తడిమి గుర్తించవచ్చును.

11. గర్భాశయమునందుగల పిండముయొక్క గుండెధ్వని వినబడును.

12. యక్స్ రే ద్వారా గర్భస్థమైన పిండముయొక్క ఎముకలు గోచరించును.

గర్భధారణ పరీక్ష (అషిమ్ జొండల్ రియాక్షన్) :

ఈ పరీక్ష నూటికి 98 కేసులలో ఫలవంతము కాగలదు. గర్భధారణమైన తరువాత 15 రోజుల స్వల్ప కాలములోనే ఈ పరీక్ష సత్ఫలితము నొసగగలదు. ఉదయమున విసర్జించు మూత్రములో కొన్ని ఔన్సుల మూత్రమును తీసికొని, మూడు రోజులపాటు కొద్ది పరిమాణములో పరిపూర్ణావస్థ చెందని ఆడ చిట్టెలుకకు సూది ద్వారా

314