Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/360

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గర్భధారణము - ప్రసవసమస్యలు

ఎక్కింతురు. ఆ స్త్రీ గర్భవతి యైనచో ఆ చిట్టెలుక యొక్క అండకోశములు (ఓవరీస్) పెద్దవి యగును. అందు ఎర్రని చుక్కలు గోచరించును.

గర్భధారణ కాలము : గర్భోత్పత్తికిని ప్రసవమునకును గల మధ్యకాలము 265 రోజులకంటె హెచ్చుగను, 273 రోజులకంటె తక్కువగను ఉండును.

ప్రసవమునకు ముందు తీసికొనవలసిన శ్రద్ధ; గర్భధారణ సమయములో ఆచరించవలసిన ఆరోగ్య విధులు : ప్రసవమునకు ముందు తీసికొను చర్యలవలన కలిగినంతటి సత్ఫలితములు ఏ ఇతర వైద్యశాఖకు చెందిన చికిత్స వలనను కలుగలేదు. క్షయ, గుండెజబ్బు, అతిమూత్రము, రక్తక్షయరోగము మొదలగు ఎట్టి తీవ్రవ్యాధులకైనను అవకాశము లేకుండ మొదటనే రోగిని పరీక్షింప వలయును. గర్భధారణము జరిగిన తొలి నెలలలోనే పై వ్యాధులను కనుగొనిన యెడల వాటిని నయము చేసి ప్రసవకాలములో గర్భవతికి సాధ్యమైనంత ఎక్కువ ఆరోగ్యస్థితి కలుగునట్లు చేయవచ్చును.

రక్త వర్గీకరణము (Blood grouping) జరుపవలెను. రక్తము, వాసర్ మన్ రియాక్షన్ ప్రకారము రోగ పరిస్థితిని సూచించిన యెడల, అనగా సాంకేతిక పరిభాషలో 'పాజిటివ్ ' అయినచో, అందుకు తగిన చికిత్స చేయవలెను. రక్తపుపోటు యొక్క కొలతలు తీసికొనవలెను. మూత్రము పరీక్షింపవలెను. వ్యాధి తొలిచిహ్నములు గోచరించినయెడల వాటిని వారించు విషయమున శ్రద్ధ వహించవలెను. ప్రసవమునకు ముందుగా ఈ క్రింది విషయములను కనుగొనినయెడల ప్రసూతి సమయములో తీసికొనవలసిన చర్యలను ముందుగా నిర్ధారణ చేసికొన వచ్చును. అవి పెల్విస్ (కూపకము) యొక్క కొలతలు, గర్భస్థమైన పిండపు తలయొక్క పరిమాణము, శిశువు లోపలి భాగము క్రిందికి ఉన్నదా అను విషయములు.

గర్భవతియైన స్త్రీ యొక్క ఆహారము : ఇందు మాంస కృత్తులు, విటమినులు (శరీరపోషక పదార్థములు) సమృద్ధిగా నుండవలెను. దీనిచే గర్భములోని పిండము యొక్క పెరుగుదలకు అవకాశమేర్పడును. పాలు, మాంసకృత్తులు సమృద్ధిగాగల ఆహారము మంచిది. స్తనములను గూర్చియు, చను మొనలను గూర్చియు తగినంత శ్రద్ధ తీసికొనవలెను. చను మొనలకు చివరి వారములలో వేసిలైను పట్టించి మర్దన చేయవలెను. అందువలన అవి చిట్లుటకు అవకాశముండదు.

గుండెలలో మంట ఉన్న యెడల క్షారపుపొడుల (అల్కలైన్ పౌడర్స్)తో దానిని నయముచేయవచ్చును.

గర్భవతి యొక్క మనస్తత్వమును గ్రహించి ఆమెకు ధైర్యము, ప్రోత్సాహము కల్గించవలెను. ప్రసవసమయములో చిక్కు పరిస్థితులు కల్గునని అనుమానము కలిగిన యెడల గర్భవతిని ముందుగా వైద్యశాలలో ప్రవేశపెట్టుటకై ఏర్పాటు చేయవలెను. లేనిచో అనుకూలమైన, పరిశుభ్రమైన ఒక గదిని ప్రసవము కొరకు కేటాయించ వలెను. క్రిమిసంహారక వస్తువులు మొదలగు వాటిని సిద్ధముగా పెట్టి ఉంచవలయును.

సాధారణ ప్రసవము : సాధారణముగా ప్రసవము సమీపించుననగా, చివరి రోజులలో దాని సూచనలు గోచరించును. గర్భాశయములోనుండి రసము ఎక్కువగా స్రవించును. ఆ స్రవము కేవలము లాంఛనమాత్రముగా గాక ఎక్కువగా ఉండును.

ప్రథమ దశ : గర్భాశయము ఎక్కువగా సంకోచము చెంది నొప్పులు కొంతకాలమున కొకసారి వచ్చును. క్రమముగా తరచుగావచ్చుటకు మొదలుపెట్టును. గర్భాశయ ముఖద్వారము (cervix) సడలిపోవును. నెత్తురు మరకలు చిందిన గుర్తులతో స్రవించుట జరుగును. ఈ పరిస్థితి 12-18 గంటలవరకు ఉండును. ఈ దశ ముగియగానే గర్భాశయ ముఖద్వారము పూర్తిగా సడలి, సంచి పగిలి, గర్భాశయద్రవము వెలుపలికి వచ్చును.

రెండవ దశ : నొప్పులు ఆగిన కొన్ని నిముషముల తరువాత రెండవసారి అంతకన్న పెద్ద నొప్పులు ప్రారంభమగును. ఈసారి వచ్చిన నొప్పులు పై నుండి క్రిందికి వ్యాపించును. ఈనొప్పుల ఫలితముగా పిండము పెల్విస్ ద్వార క్రిందకు త్రోయబడుట ప్రారంభమగును. యోని తెరచుకొనుట ప్రారంభమగును. పెరీనియం (గుదద్వారమునకును యోనికిని గల మధ్యప్రదేశము) ముందునకు త్రోసికొనివచ్చును. పిండము యొక్క నెత్తిమీది వెండ్రుకలు కనబడును. నొప్పులు ఎక్కువైనకొలదియు, తలయొక్క ఎక్కువభాగము వచ్చి యోని ద్వారముపై

315