Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/358

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గయానా (భూగోళము)

నాలోను సంవత్సరమునకు సగటున 75 నుండి 100 అంగుళముల వరకును, ఫ్రెంచివారి అధీనమందున్న గయానాలో అంతకంటె గాఢముగా వర్షపాతముండును. ఒక్కొక్కప్పుడు అది సంవత్సరములో 150 అంగుళముల వరకు పెరుగును. ఉద్భిదజాలము (vegetation) అసాధారణమైన సమృద్ధి గలదిగాను, ఫలవంత మైనదిగాను ఉండును. అసంఖ్యాకములైన వృక్షములు లభించును. వాటి కలప గృహ నిర్మాణమునకు, నౌకా నిర్మాణమునకు, ఇండ్ల కప్పులకు, బీరువాల నిర్మాణమునకు పనికివచ్చును. అచటి శీతోష్ణస్థితిని బట్టి ఉష్ణమండలానుగుణములైన ఫల పుష్పములు తప్పక ఎడతెగక లభించును. గయానా దేశమునందు సాంబ్రాణి, లక్క, చెట్టుపట్ట (bark). నారపీచు, నూనె, పోకచెక్కలు, ఇండియా రబ్బరు, బలాటా (Balata), సింకోనా, కొ పెయి బాబల్ సామ్ (మందుగా నుపయోగించు సాంబ్రాణి వంటి జిగురు పదార్థము), కరప అను గింజల నూనె. సుగంధిపాలవ్రేళ్లు. చిక్కుడు, ప్రత్తి, పొగాకు మొదలగునవి పండును. అన్నిటికంటె అత్యుత్తమములైన ఈ క్రింది ఆహారపు పంటలు గయానాలో పండుచున్నవి. 'కాసరా' అను దుంపజాతి, చిలగడము, కేప్సికమ్ అను స్పానిష్ జాతికి చెందిన మిరియములు, టుమాటో ఫలములు, గావా, చెర్రీ ఫలములు, అరటి ఫలములు, ఖర్బూజా ఫలములు, అనాస ఫలములు మున్నగునవి గూడా లభించును. ఇవి కాక పలురకముల తీగెలు, అడవి మొక్కలు, పుష్ప వృక్షములు మొదలగునవియు కలవు. గయానాలోని జంతువర్గములో (fauna) స్టింక్ బైరల్, రాబందులు, గుడ్లగూబలు, 'ఆసకప్పెరగాడు' (right jars), బెల్స్, బాతులు, నీటిలో లోతునకు మునుగగల పక్షులు ముఖ్యములైనవి. సస్తనజాతి జంతువుల (Mammals) లో ఒక రకపు చిరుతపులులు, టైగర్ కాట్స్, టాపిక్స్, దేవాంగి పిల్లులు (sloths), చీమలను తిను జంతువులు (ant-eaters), కేపి బారాస్, రక్కూన్స్, కోటీస్, ఉడుతలు, కోతులు, ముంగిసలు మొదలగునవి ముఖ్యమైనవి. జలచరములలో మొసళ్ళు, షార్క్ అను చేపలు, ఎండ్రకాయలు, కప్పలు మొదలగునవి ముఖ్యములైనవి.

బ్రిటిష్‌వారి అధీనమందున్న గయానాలో ఆసియా జాతులవారికి చెందిన ప్రజలుండుట గమనించదగిన అంశము. వీరిలో కొందరు చైనా కార్మికుల సంతతివారును, కొందరు హిందువుల సంతతికి చెందినవారును కలరు. అచ్చటి హిందువులందరు పూర్వము ఉత్తర హిందూదేశమునుండి గయానాకు వలస వెళ్ళినవారి యొక్క సంతతివారు. వీరు తమ మాతృదేశములో ఉష్ణాధిక్యమగు వాతావరణమునకు అలవాటుపడినవారుకారు. దాదాపు ఒకశతాబ్దమువరకు ఉష్ణాధిక్యముగల గయానాలో నివసించుచున్నందున అచ్చటి వాతావరణము ఫలితముగా కలుగు రోగముల వాతబడి హిందువులు శారీరకముగను, మానసికముగను దుర్బలులయిరి. 'అమెరికన్ ఇండియనుల' సంఖ్య గూడా క్రమముగా క్షీణించుచున్నది. కొలదివేల మంది మాత్రమే దేశాంతర్భాగమున జీవనము చేయుచున్నారు.

బ్రిటిష్ గయానా, అననుకూలమగు శీతోష్ణస్థితి కారణముగా, దేశాభివృద్ధికి వలయు పెట్టుబడులను ఆకర్షించ లేక పోవుచున్నది. సాగుబడి క్రిందకు వచ్చిన భూభాగములో మూడవవంతు ప్రదేశమునందు చెరకుపంట ప్రధానమైనది. బ్రిటిష్ గయానాలో ఏడాదికి 2 లక్షల టన్నుల పంచదార ఉత్పత్తి యగుచున్నది. బియ్యము ఉత్పత్తి రెండవస్థానము నాక్రమించియున్నది. హిందువులకు బియ్యము ప్రధానమగుటయే ఇందుకు కారణము. కొలది మాత్రముగ బంగారమును, ఎక్కువగా వజ్రములును ఈ దేశమునందు ఉత్పత్తి అగుచున్నవి. అల్యూమినియం పరిశ్రమకు అనువైన బాక్సైట్ ఆను ముడి లోహము జార్జిటౌన్ నుండి విదేశములకు ఎగుమతి చేయబడుచున్నది. జార్జిటౌన్ యొక్క జనాభా 66,000.

డచ్ గయానా భూభాగము 'సూరినమ్' అని గూడ వ్యవహరింపబడుచున్నది. దీని వైశాల్యము 58,000 చ. మైళ్ళు. అనగా ఆంధ్రదేశముయొక్క వైశాల్యములో ఇది సగము కలదు. ఇక్కడి జనసంఖ్యలో, ఒక లక్ష అరవై వేలమంది ముఖ్యముగా నీగ్రోలు, అసియా జాతులవారు, సంకరజాతులవారు అయియున్నారు. 2000 మందికి లోపుగా శ్వేతజాతీయు లున్నారు. నదులకు చేరువగా సముద్రప్రాంతమునందు మాత్రమే నూతనముగా సాగులోనికి తీసికొని రాబడిన ప్రదేశమునందు వ్యవసాయము

313