Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/354

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గద్వాల సంస్థానము

రించెను. ఈ దేవకీనందన శతకకర్తకు సంబంధించిన వివరములు అలభ్యములు. కాని ఇతడు అప్పకవికంటె ప్రాచీనుడని ఊహించుటకు ఆధారములు కలవు. ఈ కవి 'దేవకీ నందనా !' అను మకుటముతో సుమారు కొన్ని వేల పద్యములు రచించినట్లు తెలియుచున్నది.

పెదసోమభూపాలుని ఆస్థానమున (క్రీ. శ. 1650) నున్న బుచ్చివేంకటాచార్యు లనువారు అభినవ శృంగార రసమంజరీ భాణము, కల్యాణ పురంజనము, శృంగార సర్వస్వము, వేదాంతకారికావళి అను సంస్కృత గ్రంథములను రచించిరి. ఈతని ఆస్థానముననే కొటికలపూడి వీరరాఘవకవి అను వైష్ణవ పండితుడు రాజాశ్రయమున నుండి 'యథా శ్లోకతాత్పర్య భారత' మను సంస్కృత భారతము నందలి ఉద్యోగ పర్వమును పద్యములలో ఎనిమిది ఆశ్వాసముల గ్రంథముగా తెనిగించి, రాజుల ఇంటి ఇలవేలుపైన చెన్నకేశవస్వామికి అంకిత మిచ్చెను. ఈ కవికి 'అభినవ తిక్కన' యని రాజుచే బిరుద మియ్యబడినది.

ఈ పెదసోమభూపాలుడు స్వయముగాకూడ సంస్కృతాంధ్రముల సమగ్రాభినివేశమును, నిరర్గళ కవితా ధారయు కలవాడు. ఇతడు జయదేవుని 'గీతగోవిందము' నుండి ప్రతిశ్లోకమును తెలుగుపద్యముగను, ప్రతి అష్టపదిని ఒక చూర్ణికగను తెనిగించెను.

క్రీ. శ. 1761 నుండి 1794 వరకు పాలించిన చినసోమ భూపాలుడును కవి పండిత పోషకుడే కాక, స్వయముగ సంస్కృతాంధ్ర పాండితీ కవితా విధేయుడు. ఇతని ఆస్థానమున 'అష్టదిగ్గజము' లను పేరందిన ఎనమండుగురు కవులుండినట్లు తెలియుచున్నది. ఇతనికి 'సారస్వత వైభవాభినవభోజరాజు' అను బిరుదము కలదు. ఇతడు సంస్కృతమున హరిహరభట్టు వ్రాసిన 'రతిరహస్యము'ను తెనుగు పద్యకావ్యముగ అనువదించెను. ఈ చిన సోమ భూపాలుని ఆస్థానపండితులలో కాణాదం పెద్దన సోమయాజి ముఖ్యుడు. ఆశు, బంధ, చిత్ర, గర్భ అను 'చతుర్విధ కవితానవద్య' బిరుదాంకితుడు. ఇంకను కొత్తపల్లి రామాచార్యులు, గార్గేయపుర సుబ్బాశాస్త్రి, కామసముద్రం అప్పలాచార్యులు, తిరుమల కృష్ణమాచార్యులు, శేషకవి, సోమనాథశాస్త్రి, ధర్మవరం రామకవి మున్నగు సాహితీ ధురీణులు, విద్వత్కవి కుంజరులు, అష్టభాషా కవితా వైభవ దురంధరులు సంస్థానాశ్రయమున నుండి భగవతి భారతీదేవి నారాధించుచుండిరి.

క్రీ. శ. 1840 - 1900 వరకు పాలించిన రాజారామ భూపాలుడు తమ విద్యాగురువులగు పురాణం దీక్షా చార్యులవారి 'సంస్కృత ఛందోముకుర'మను అలంకార గ్రంథమును తెనిగించిరి. ఈ దీక్షాచార్యులు సంస్కృతమున పెక్కు గ్రంథములు వ్రాసిరి. వీరు రామచంపువు, ఛందోముకురము, రామనృప కర్ణామృతము, కేశవ సుప్రభాతము, కావ్యోత్కర్షలు అను గ్రంథములను రచించిరి. హొసదుర్గం కృష్ణమాచార్యులనువారు 'కార్తీకోత్సవ దీపిక' అను గ్రంథమును రచించినారు. ఇందు సంస్కృత శ్లోకరూపమున గద్వాలలో జరుగు కార్తీక సభలు మొదలగునవి వర్ణితములు.

క్రీ. శ. 1901 నుండి 1924 వరకు ఏలిన సీతారామ భూపాలుని కాలము గద్వాలకు ఒక విధముగ స్వర్ణయుగమని చెప్పవచ్చును. వీరి కాలముననే తిరుపతి కవులకు గజోత్సవములు జరిగినవి. వీరి పండితకవి సన్మానములకే సంస్థానము దాదాపు 40 లక్షలవరకు (సాలీనా 12 లక్షల ఆదాయము కాక) ఋణముచేసెను. వితరణమున ఈ మహారాజుది ఎముకలేని హస్తమని ప్రతీతి. వీరి కాలమున జీవించిన బైరంపల్లి తిరుమలరాయకవి యను నతడు సంస్కృతాంధ్రముల యందు ఆశుకవితా చక్రవర్తి. ఈరాజు కాలమునను, ఇతని అనంతరమును, ఇతని భార్య ఆదిలక్ష్మీదేవమ్మ కాలమునను, కడపజిల్లా పర్లపాడు గ్రామస్థుడు చెమికల చెన్నారెడ్డి అను పండితుడు సంస్థానముచే సత్కరింపబడెను. ఇతడు రచించిన 'సంగీత హరిశ్చంధ్ర', 'గద్వాల కేశవశతకము', 'మదన మోహన శతకము' మొదలగునవి ప్రశస్తికెక్కినవి. ఇతని కవిత ద్రాక్షా పాకము. వీరుకాక ఆస్థానపండితులు అనేకులు కలరు. కీ. శే. హొసదుర్గం వేదాంతాచార్యులు గద్వాల సంస్థాన ధర్మాధికారులు. వీరి ముద్రితరచన "శ్రీకృష్ణ బ్రహ్మతంత్రార్య వేదస్తవము.” అముద్రిత రచనలు గూడ పెక్కులు కలవు. కీ. శే. పుల్ల గుమ్మి వేంకటాచార్యులు వైయాకరణి; ఆస్థానపండితుడు. 'ఆదిలక్ష్మీ కర్ణపూరము' అను అలంకార గ్రంథమును ప్రతాపరుద్రీ

309