Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/355

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గన్నవరము కుల్యవాహిక (అక్విడక్టు)

సంగ్రహ ఆంధ్ర

యము, నరస భూపాలీయముల శైలిలో ఇతడు గద్వాల రాణిపేర విరచించెను. వీరి కుమారుడగు శ్రీనివాసాచార్యులు కూడ వ్యాకరణపండితులు. సంస్కృతమున 'వేదపాదస్తవము' 'సంస్కృత భాషా బోధిని' మొదలగునవి వీరిరచనలు. పోకూరి కాశీపతియను పల్నాటి వాస్తవ్యుడు గద్వాల ఆస్థానముననుండి శుద్ధాంధ్ర నిరోష్ఠ్య, నిర్వచన హరిశ్చంద్రోపాఖ్యానమును, సారంగధరీయమను త్ర్యర్థికావ్యమును రచించి గద్వాలప్రభువులకు అంకితము చేసెను. గాడేపల్లి వీరరాఘవశాస్త్రియను నతడొక శతావధాని; గద్వాల ఆస్థానపండితుడుగా ఇతడు ప్రసిద్ధి కెక్కినవాడు. కవిత్వమున ఇతడు పోని పోకడలులేవు. భూమ్యాకాశములంత పొడవుగల సమాసములైనను, అత్యాశువున చెప్పగలశక్తి వీరికి పుట్టువిద్య. ఇతడు బహుకావ్య నిర్మాత.

గొ. కృ.


గన్నవరము కుల్యవాహిక (అక్విడక్టు) :

గన్నవరము అనెడి యూరు రాజమహేంద్రవరమునకు దక్షిణమున 32 మైళ్ల దూరములో, గన్నవరము కాలువ పొంత, వైనతేయమను నదీ శాఖ యొక్క ఒడ్డున కలదు. గన్నవరమునకు గరుడపుర మని పూర్వము పేరుండెనట ! దేశవిఖ్యాతిగాంచిన మహాదాత్రి డొక్కా సీతమ్మ నివసించినది ఇచ్చటనే. ఇచ్చట కాలువ నీరు, 31/2 ఫర్లాంగుల పొడుగు గల యొక తొట్టివంటి కట్టడము ద్వారా నదీ శాఖ మీదుగా ఎడమనుండి కుడివైపునకు దాటింపబడుచు నగరము ఖండమను తాటిపాక సీమకు తీసికొనిపోబడుచున్నది. ఈ తొట్టియే గన్నవరము అక్విడక్టు. పామరులు దీనిని అక్కి లేరందురు.

గోదావరీనది అఖండ గౌతమి యను పేరుతో రాజమహేంద్రవరము వరకును ప్రవహించి, అట ఏడుశాఖలై సప్తసాగరములు అను ఏడు చోట్ల సాగరములో సంగమించుచున్నది. "తుల్యా౽౽త్రేయీ భరద్వాజీ, గౌతమీ వృద్ధ గౌతమీ, కౌశికీచ వసిష్ఠాచ, సప్త శాఖాః ప్రకీర్తితాః". ఈ ఏడు బాహువులతో గోదావరీమాత డెల్టా భూదేవి నాలింగనము చేయుచున్నది. ఈ శాఖలలో తుల్య, ఆత్రేయి, భారద్వాజి, వృద్ధ గౌతమి, కౌశికి అనునవి మురుగు కాలువలుగా రూపాంతరము నొందినవి. కౌశికీ (కౌంతేయ) నదీప్రాంతము కోనసీమ యనబడును. శ్రీనాథ మహాకవి కౌశికీ తీరస్థ పలివెల క్షేత్రమును దర్శించి, కోనసీమ నుండి తూర్పుగా, భీమఖండమునకు బోవుచు గోదావరీ సప్తశాఖలను స్మరించెను. గౌతమీ మాత తన యేడు ముఖములతో అపార జలరాశిని సాగరములో పారబోయుచుండ ప్రక్కభూముల జనులు తమ పంటలకు నీరులేక మేఘుని వైపు బిక్క మొగములతో చూచుచుండిరి. ఈ గౌతమీ శాఖల కడ్డముగా ధవళేశ్వరము, బొబ్బర్లంక, విజ్ఝేశ్వరముల కడ బ్రహ్మాండమైన ఆనకట్టలు కట్టి, నదీజలము నాపి, కాలువలు త్రవ్వించి, లాకులు కట్టించి, దేశమును సస్య శ్యామలము గావింప సంకల్పించిన మహాశయుడు సర్ ఆర్థరు కాటను. ఈతడీ ఆనకట్టలను 1842-1852 సంవత్సరములలో నిర్మించి, నదిని జయించుటలో కృతకృత్యుడాయెను. ఈతని అఖండ నిర్మాణములోని భాగమే గన్నవరము అక్విడక్టు. ఈ ఆనకట్ట, అక్విడక్టులకు పూర్వము పెక్కుమార్లు వరపులచే కాటకములు సంభవించి ప్రజలు నశించిరి. పెక్కండ్రు వలసపోయిరి. అప్పుడు మెట్టపంటలును కొబ్బరి, మామిడి తోటలును ఉండెను.

ధవళేశ్వరము, విజ్ఝేశ్వరము ఆనకట్టల మధ్య బొబ్బర్లంక యొద్ద గన్నవరము కాలువ పుట్టెను. ఈ కాలువ గన్నవరము కడ వైనతేయమును దాటిన గాని నగరము ఖండమునకు నీరులేదు. నగరము ఖండము వైనతేయ, వసిష్ఠలకు మధ్య సముద్రము వరకు వ్యాపించియున్న డెల్టాభాగము. ఇది ఇప్పటి రాజోలు తాలూకాలోని దిగువ భాగము. వైనతేయ మిచ్చట అరమైలు వెడల్పు. ఇది గోదావరియొక్క యేడు శాఖలలో నెన్నబడలేదు. గన్నవరమునకు మీదుగా 11/2 మైలు దూరములో భర్తృ హరి మడుగు అనుచోట నిది వసిష్ఠ యొక్క యెడమ బాహువుగా విడిపోయినది. కోనసీమకు తాటిపాకసీమకు మధ్యగా ప్రవహించి, ఇది బెండమూర్లంక కడ కడలిని చేరుచున్నది.

వసిష్ఠుడు గౌతమీజలమును సముద్రగామిగా గొనిపోవుచు అనుష్ఠానము కొరకు కమండలము నేల నుంచగా వైనతేయుడు (= గరుత్మంతుడు) తన ముక్కుతో కమండల జలము హరించి వైనతేయ మను పేరున ప్రవహింప

310