Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/352

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గద్వాల సంస్థానము

లును (ద్వైతులు) కొంద రున్నారు. వివిధ ప్రభుత్వ శాఖలలో గ్రామకరణములే అధికారులుగ నున్నారు. ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతులకును, దేవాగారములకును, మహమ్మదీయులకును, వారి మసీదులకును సంస్థానముయొక్క ఆదరాభిమానములు లభించెను.

ఈ సంస్థానము దాదాపు 880 చ. మైళ్ళ వైశాల్యము గలది. రాయచూరు జిల్లాలోని దాదాపు 25 గ్రామములు సంస్థానమునకు సంబంధించిన తెలుగు గ్రామములే. పరిపాలనా సౌలభ్యమునకై గద్వాల తాలూకాలో తూర్పుననున్న దాదాపు 50 గ్రామములు అలంపురము తాలూకాలో చేర్చబడి గద్వాల, అలంపురము తాలూకాలు గ్రామముల సంఖ్యలో సరిసమానములుగా చేయబడినవి.

ఈ సంస్థానము సముద్రమట్టమునకు 1068 అడుగుల ఎత్తున నున్నది. 1345, 1347 ఫసలీల ప్రభుత్వపు లెక్కల నివేదిక ప్రకారము ఈ తాలూకాలో సగటు వర్షము 35 అంగుళములు. ఇందు 30,300 గృహములు దాదాపు 61,600 పురుషులు, 57,600 స్త్రీలును కలరు. ఇచ్చటి ముఖ్యమైన ఆహారపంటలు జొన్న, సజ్జ, కొఱ్ఱ. ముఖ్యమైన వాణిజ్యపు పంటలు పత్తి, వేరుసెనగ, కంది, పెసర వంటి కాయధాన్యములుగూడ ఇచ్చట పండును. పూర్వ మొక కవి నుడివినట్లు, "కలిగియు గృష్ణనెత్తిన జగజ్జన కల్మష నాశన క్రియామలగుణ పుష్టదర్శన విమర్దిత లౌకిక తృష్ణక్రిందనే ! పొలిచియు తుంగభద్ర నిజ భూరి తరంగసముద్ర గద్దువాల్ తలగలవ్రాలదేమొ వరిధాన్యము సేద్యము శూన్య మెప్పుడున్". సంస్థానములో నాటికిని, నేటికిని కేవలము బావులక్రింద పండించుకొనిననేగాని వరియన్నము లభ్యముకాదు.

సంస్థానముయొక్క రెవెన్యూ ఆదాయము 1,97,413 రూపాయలు. (26 జాగీర్లు కాక 102 గ్రామములవి మాత్రమే) జాగీర్ల ఆదాయమును కలుపుకొనినచో రు. 25204 ల వరకుండగలదు. అటవీశాఖ నుండి రు. 8,0484 లు; ఆబ్కారినుండి రు. 3,48, 962 లు; ప్రెస్ నుండి రు. 18,175 లు; రిజిస్ట్రేషను నుండి రు. 1,792 లు; న్యాయశాఖనుండి రు.2,719 లు. ఇవికాక భూమి రెవెన్యూశిస్తుపై రూపాయకు 0-1-3 వంతున వసూలయ్యే విరాళమునుండి రు. 46,576 లు. ఇవికాక ఇతర ఆదాయము కలిసి లెక్కలలోమాత్రము రు. 7,31,745 లు కనిపించును. కాని ఆస్తులు వారివారి వారసుల పేర పట్టాలు చేయుట వలన, నజరానాలు, కానుకలు పుచ్చుకొనుట వలన, సంస్థానమునకు సం. 1కి దాదాపు పదిలక్షల రూపాయల ఆదాయము లభించెను. ఈ విరాళ మనునది సంస్థానములో కార్తీక, మాఘ మాసములలో జరుగు పండిత, కవి, గాయక సన్మానముల నిమిత్తము వసూలు చేయబడెడిది. దీనికితోడు సంస్థానాధీశుల కళాభిరుచికి, దాతృత్వమునకు అభినందన పూర్వకముగా నైజాం నవాబు ప్రతి సంవత్సరము రు. 50.000 లు గ్రాంటు రూపమున ఇచ్చుచువచ్చిరి. ప్రభుత్వ నివేదికప్రకారము సంస్థానముయొక్క సాంవత్సరిక ఖర్చు రు. 7,31,308 లు. ఇప్పటి ఆదాయము రెవెన్యూనుండి దాదాపు రు. 3 లక్షలు, ఆబ్కారినుండి రు. 5 లక్షలు. తదితరము లన్నియు కలిపిన ఇంచుమించు పది లక్షల వరకున్నది.

ఈ సంస్థానమునకు సివిల్, క్రిమినల్, జుడిషియల్ అధికారములుండినవి. ఇచ్చట కోర్టు మునసబు, సెషన్స్ జడ్జి, పోలీసు సూపరింటెండెంటు, కలెక్టరు (తాలూకా దారు) హోదాలకొరకు అధికారులు, ప్రభుత్వశాఖలవారు ఉండిరి. రాజలాంఛనములైన గుర్రములు, ఏనుగులు, ఒంటెలు, పదాతిసైన్యము, గుఱ్ఱపు సవారులు, అరబ్బులు, ఫిరంగులు, తోపులు మున్నగునవి కలవు. ఈ సంస్థానమున శ్రీ చెన్న కేశవ ముద్రణాలయము సీతారాం భూపాలు కాలమునను, వైద్యశాలలు, రహదారులు, విద్యుచ్ఛక్తి, పార్కులు, అనాథ శరణాలయములు, పాఠశాలలు మొదలైనవి రాణి ఆదిలక్ష్మీదేవమ్మ (తుట్టతుద పాలకురాలు) కాలమునను నెలకొన్నవి.

చారిత్రక స్థలములు, క్షేత్రములు : గద్వాలకు దాదాపు 7 మైళ్ళలో పూడూరు అను గ్రామము కలదు. ఈ గ్రామము 9 వ శతాబ్దమున అత్యున్నతదశ యందుండినట్లు తెలియుచున్నది. ఇచ్చట గమనార్హమైన దుర్గ మొకటి కలదు. ఈ గ్రామము గద్వాల రాజులకు మొదటి నివాసస్థానము. పూర్వము ఈ నగరము జైనమత కేంద్రముగా నున్నట్లు చిహ్నములు కలవు. దీని పూర్వనామము "పుండ్ర పురము."

307