Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/351

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గద్వాల సంస్థానము

సంగ్రహ ఆంధ్ర

యల్లారెడ్డి కుమారుడు రామన్న అను నతనిని దత్తుగొని, ఆతనికి సోమ భూపాలుడని నూతననామ మిడిరి. సోమ భూపాలుడు శా. శ. 1763 నుండి 1766 వరకు సంస్థానమును పాలించెను.

15. రాణి వెంకటలక్ష్మమ్మ: దత్తపుత్రుని అనంతరము రాణి వెంకటలక్ష్మమ్మ జనానా నిబంధనలను తొలగించుకొని శా. శ. 1766 నుండి 1787 వరకు స్వయముగా రాజ్యమును పాలించెను. ఆమె పాలనలో శా. శ. 1771 సం.న రాచనగళ్ళలో కేశవాలయ మహాద్వారమును, గోపురము వగైరాలను నిర్మించెను. అనంతరము వేంకటాపురమునకు చెందిన గోమం కృష్ణారెడ్డి కుమారుడు రామన్న అను నతనిని దత్తుగొని, నైజాం నవాబుచే దత్తును మంజూరు చేయించుకొనెను. ఈ దత్తు కుమారుని పేరు రాజారాం భూపాలుడు.

16. రాజారాం భూపాలుడు: ఇతడు శా. శ. 1765 న జననమందెను. శా. శ. 1768 లో రాణి వెంకటలక్ష్మమ్మకు దత్తుబోయెను. శా. శ. 1787 నుండి రాజ్యభారము వహించెను. ఇతని సోదరుడు, వెంకటాపురవాసియైన భీమి రెడ్డి కుమారుడు వేంకట రామిరెడ్డిని దత్తుకొనెను. సీతారాం భూపాలుడు అని దత్తునామము. రాజారాం భూపాలుడు శా. శ. 1823 వరకు రాజ్యభారము వహించెను.

17. రాణి లక్ష్మీదేవమ్మ : రాజారాం భూపాలుని దత్తపుత్రుడు మహారాజా సీతారాం భూపాలుడును, రాణి లక్ష్మీదేవమ్మయు కలిసి శా. శ. 1823 నుండి 1835 వరకు నైజాం నవాబు పర్యవేక్షణ క్రింద గద్వాల సంస్థానమును పాలించిరి. 1835 నుండి 1846 వరకు సీతారాం భూపాలుడు స్వతంత్రముగా రాజ్యము నేలెను. ఆ కాలమున లక్ష్మీదేవమ్మ జీవించియే యుండెను. 1835 న మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ వివాహితయై, వరలక్ష్మీదేవమ్మ, శ్రీ లక్ష్మీదేవమ్మ అను నిద్దరు కుమార్తెలను కనెను. వీరి దాతృత్వమును ప్రశంసించుచు వీరికి 'మహారాజా' బిరుదు ఒసగబడెను.

18. మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ : శా. శ. 1816 లో ఈమె జననము. 1835 లో మహారాజా సీతారాం భూపాలుని వివాహమాడెను. భర్త అనంతరము శా. శ. 1846 నుండి నైజాం నవాబు 'నిగ్రాని' (పర్యవేక్షణము) నుండి సంస్థానమును వదలించుకొని స్వతంత్రించి పాలించెను. గత విజయనామ సంవత్సర శ్రావణ శుద్ధ విదియనాడు ఈమె కాలధర్మము నొందెను. ఈమె హయాములోనే గద్వాల సంస్థానము ఆంధ్రప్రదేశలో విలీనమయ్యెను (17 వ సెప్టెంబరు 1949). ఈమె పెద్ద కుమార్తె వరలక్ష్మీ దేవమ్మ యొక్క జ్యేష్ఠ పుత్రుడగు రాజా కృష్ణరాం భూపాలును విక్రమ సంవత్సర కార్తీక బ. పంచమి బుధవారమునాడు దత్తస్వీకారము చేసికొనెను.

గద్వాల దుర్గ నిర్మాణ సందర్భములో నొక విచిత్రమైన గాథ ప్రజలు చెప్పికొందురు. దుర్గమును కట్టినవెంటనే అది కూలిపడుచుండెడిదనియు, నిర్మాతలకు స్వప్నమున నొక వ్యక్తి సాక్షాత్కరించి ఒక పుణిక బ్రాహ్మణుని బలియిచ్చినచో దుర్గము నిల్చునని చెప్పెననియు, అంతట కేశవాచార్యులు అను నాతనిని బలియిచ్చి, అచ్చటనే అతనికి సమాధి నిర్మించిన ఫలితముగా దుర్గము నిలిచిన దనియు, తత్పాప పరిహారమునకై అచ్చోట కేశవాంకితముగ దేవాలయము నిర్మింపబడినదనియు చెప్పుదురు.

ఈ సంస్థానము క్రింద 103 పెద్దగ్రామములు, 26 జాగీరులు ఉండియుండెను. ఒక్కొక్క గ్రామము క్రింద కొన్ని కుగ్రామములు గలవు. అన్నియు కలిసి సంస్థానములో 360 గ్రామము లుండెను. ఈ సంస్థానమునకు తూర్పున అలంపురము తాలూకాయును, దక్షిణమున తుంగభద్రా నదియు (ఆదవేని సరిహద్దు), పడమర రాయచూరు తాలూకాయును, ఉత్తరమున కృష్ణానదియు గలవు. ఈ సంస్థానము కొంతకాలము బీజపురపు రాజులకు సామంత రాజ్యముగా నుండినందుననేమో, తెనుగు రాజ్యమైనను, తెనుగు తేటదనమునకు కన్నడపు కస్తురి గుబాళింపు కలిగినది.

సంస్థానపాలకులు వైష్ణవమతానుయాయు లగుటచే విశిష్టాద్వైతులు తిరునక్షత్రము వగైరా పర్వదినములకు విశేషప్రాధాన్య మేర్పడినది. అయినను సంస్థానమందంతటను, గద్వాల నగరములోను గల పెక్కు వీరభద్ర, శివాలయములు రాజాదరమును పొందియున్నవి. స్మార్తు లనేకులు ఆస్థాన కవిపండితులుగను శ్రౌతస్మార్తాధికారులు గను ఆదరింపబడిరి. పండితులు, పౌరాణికులైన మాధ్వ

306