Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/345

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గద్యవాఙ్మయము (సంస్కృతము)

సంగ్రహ ఆంధ్ర

కయే దివంగతు డయ్యెను. ఇతని కొడుకు పులిందభట్టాపరనామకుడగు భూషణభట్టు తండ్రి శైలిని పురస్కరించు కొని ఈ మహాకావ్యమును పూర్తి యొనర్చెను అని తెలియుచున్నది.

సుబంధుడు గద్యకవితా రచనాధురంధరుడుగను గద్యమయ సాహిత్యమునకు ఆద్యప్రవర్తకుడుగను, పదవాక్య ప్రమాణపారావారీణుడుగను, నిరతిశయ రసగర్భిత కవితా విశారదుడుగను కీర్తింపబడినాడు. ఇతడు క్రీ శ. సప్తమ శతాబ్ది మధ్యకాలముననున్న వాడు. సుబంధుని ప్రఖ్యాత గద్యకృతియగు వాసవదత్తమునందు వాసవదత్తా కందర్పకేతుల ప్రణయము వర్ణితము.

సుబంధుడు, బాణభట్టు, కవిరాజు అను మువ్వురును వక్రోక్తిమార్గ నిపుణులు. వీరితో సమానుడగు నాలుగవ కవిలేడు అను సూక్తికలదు. సుబంధుని రచనయందలి విలక్షణమైన స్వరమాధురి, అపూర్వమయిన వర్ణనచాతురి, అననుకరణీయములు. కాని ఇతనికృతిలో దండియొక్క 'వాగ్విలాసహాస్యరసోల్లాసములు, ' బాణుని 'భవ్యభావనా మాధురి,' కానరావు. సుబంధుడు తనఆఖ్యాయిక యందు ప్రదర్శించిన ప్రత్యక్షరశ్లేష -అనుప్రాస-విరోధాభాసాది- అలంకార రచనా కౌశల్యమెన్నదగినది.

శ్లేష సౌందర్యోదాహరణము :


“నందగోప ఇవ యశోదయాన్వితః, జరాసంధ ఇవ
 ఘటిత సంధి విగ్రహః, భార్గవ ఇవ సదాన భోగః,
 దశరథ ఇవ సుమిత్రో పేతః సుమంత్రాధిష్ఠితశ్చ,
 దిలీప ఇవ సుదక్షిణాన్వితః, రక్షితగుశ్చ "

కుతూహలావహమయిన యమ కాలం కారోదాహరణము :


“రాజసేన రహితో రాజసేన రహితో ధ్రువం,
 విశారదా విశారదాభ్రవిశదా, విశదాత్మనీనమహిమా
 మహిమాన రక్షణక్షమా క్షమాతిలక !".

సుదీర్ఘ సమాసో పేతమును క్లిష్టతరమునైన వాక్య విన్యాసమీ కవిపుంగవుని రచనయందు కనిపించును. ఉదా:


‘కురరఖరనఖరశిఖరఖండిత పృథురోమా
 విలం.............. అతితరల తరజలరయ
 లులితచటుల శఫరకుల కవలన కృతమతినిభృత
 బకశకుని నివహ ధవళిత పరిసరం .......
 ............విపులం పులిన జలమాససాద."

విరోధాభాస విలాసమునకు ఉదాహరణము :


“విద్యాధరో౽పి సుమనా, ధృతరాష్ట్రోపి గుణప్రియః
 క్షమానుగతో౽పి సుధ ర్మాశ్రితః".

కథా వేగ భంగము, ఔచిత్య సీమోల్లంఘనము, రస భంగము మున్నగు దోషము లీతని కావ్యమున గలవు.

క్రీ. శ. 1000-1050 మధ్యకాలముననున్న ధనపాలుడు 'తిలక మంజరి' అను నొక ప్రౌఢ గద్యకావ్యమును రచించెను. ఇది భోజుని ప్రీతికొరకై వ్రాయబడినది. ఇది కాదంబరిని పెక్కు విషయములలో పోలియున్నది. ఇందు విద్యాధర కన్యకయగు తిలక మంజరిని మదిరావతీ మేఘవాహనుల కొడుకు హరివాహనుడు వలచుట మున్నగు విషయములు శృంగార రసభరితముగను, మృదులముగను వర్ణితములు. ఈ కవి సకుటుంబముగ జైనమతమును స్వీకరించెనని విదితమగుచున్నది. 'ద్రౌపదీ చరిత' మను చిన్న గద్యకావ్యము ఒకటి కలదు. ఇందు ద్యూతమాదిగ ద్రౌపది పడిన పాట్లు వర్ణింపబడినవి వాసుదేవ కవి 'రామ కథ ' యను గద్య కావ్యమును వ్రాసెను. ఇది ఆదిత్యవర్మ యొక్క ఆజ్ఞానుసారముగ రచింపబడినది. ఇది సరస వచన రచనా సుశోభితము. ఓడయదేవుడను నామాంతరము కల వాదీభసింహుడను జైనకవి క్రీ శ. 11 వ శతాబ్దిలో వ్రాసిన 'గద్య చింతామణి' యందు పదునొకండు లంబకములు కలవు ఇందు 'సత్యధరుడను రాజునకును, ఆతని కుమారుడు జీవంధరునకును' సంబంధించిన జీవితకథ కీర్తింపబడినది. దీనికి మూలము గుణభద్రుని 'ఉత్తర పురాణము'. ఇందలి శైలి లలితము. సన్ని వేశములు, వర్ణనములు కాదంబరి యందలి సన్ని వేశములను, వర్ణనములను పోలియున్నవి.

విద్యాధర చక్రవర్తి కృతమయిన గద్య కర్ణామృతము నందు హొయసాల వంశ్యుడగు రెండవ నరసింహునకును, పాండ్య మగధ పల్లవరాజుల సంయుక్త సేనలకును మధ్య 90 దినములు ప్రవర్తిల్లిన శ్రీరంగ యుద్ధము మధురమధురముగ వర్ణింపబడినది. అగస్త్య (విద్యానాథ) రచితమైన కృష్ణచరితమున భాగవతానుసారముగ శ్రీకృష్ణుని చరితము ప్రశంసింపబడినది ఇందలి వచనము రసవంతముగను, ప్రౌఢముగను ఉన్నది. అగస్త్యుడు క్రీ. శ. 1294-

300