Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గంధకము

స్వచ్ఛమైన గంధకికామ్లము రంగులేని నూనెవంటి చిక్కని ద్రవము. దీని తారతమ్య సాంద్రత 1.8 ఈ ఆమ్లము నీటిలో కలిసి నపుడు విపరీతమైన ఉష్ణము పుట్టును కఱ్ఱ ముక్కలను, చర్మమును ఈ ఆమ్లము నల్లని బొగ్గుగా చేయును. దీనికి నీటిని ఆకర్షించు శక్తి కలదు. బాగుగా వేడిచేసినపుడు ఇది గంధకద్విఆమ్లజనిదము, నీరు, ఆమ్లజనిల క్రింద వియోగము చెందును (Decompose).

గంధకికామ్లము యొక్క ఉపయోగము, విలువ ఒక్క మాటలో చెప్పవీలులేదు ప్రయోగశాలలలోను, రసాయనిక పరిశ్రమలలోను, ఈ ఆమ్లము నిత్యావసరమై యున్నది. చాలాభాగము గంధకికామ్లము, ఎరువుల పరిశ్రమలోనే వాడబడుచున్నది. ముఖ్యముగా అమోనియం సల్ఫేటు, సూపర్ సల్ఫేటు తయారుచేయుట కిది వాడబడుచున్నది. నూనెలు, క్రొవ్వు, పెట్రోలు పరిశుభ్రము చేయుటకును, ఉదజహరికామ్లము (Hydrochloric Acid) నత్రికామ్లము (Nitric Acid) మొదలగు ఆమ్లములను తయారు చేయుటకును ఈ ఆమ్లము ఉపయోగపడుచున్నది. ఫ్యూమింగ్ (Fuming) గంధకికామ్లములో స్వచ్ఛమైన నూటికి నూరుపాళ్లు గాఢగంధకికామ్ల ముండుటయే కాక, గంధకత్రి ఆమ్లజనిదము కూడ విడిగానుండును. ఇది అతిబలమైన ఆమ్లము . దీనిని పెక్కురసాయనిక ఔషధములు తయారుచేయుటకు వాడుదురు. తేమను గ్రహించి వేయుటకు కూడ గంధకికామ్లమును ప్రయోగశాలలో వాడుదురు. 1940 వ సంవత్సరమున అమెరికాదేశములో 70 లక్షల టన్నుల గంధకికామ్లము తయారైనది. ఇప్పు డిప్పుడు మనదేశములో గంధకికామ్ల పరిశ్రమ తలఎత్తుటకు ప్రయత్నించుచున్నది. సుమారు 50 లక్షల టన్నుల ఆమ్లము భారతదేశములో తయారుచేయబడినది. మదరాసులోని ప్యారి అండ్ కో (Parry & Co), బెంగాల్‌లోని బెంగాల్ ఫార్మస్యూటికల్స్ (Bengal Pharmaceuticals) మరికొన్ని చిన్న చిన్న పరిశ్రమాగారములు ఈ ఆమ్లమును తయారుచేయుచున్నవి. దీనికి కావలసిన గంధకమునంతయు మనము ప్రస్తుతము దిగుమతి చేసికొనుచున్నాము.

గంధకికామ్లమువలన రెండు విధములైన గంధకిదములు, (Sulphates) బై సల్ఫేటులు అను లవణములు ఏర్పడుచున్నవి. వివిధ ధాతువుల సల్ఫేటులు, బైసల్ఫేటులు ప్రయోగశాలలలోను, వివిధ పరిశ్రమలలోను, ఎంతో ఉపకరించుచున్నది.

సోడియం థియోసల్ఫేటు : గంధకపు సంయోగ పదార్థములలో ముఖ్యమైనది మరియొక టున్నది. ఫొటొగ్రఫి ఫిల్ములను కడుగుటకు హైపో (Hypo) అను పదార్థమును వాడుదురు. ఇది సోడియం థియోసల్ఫేటు (Sodium thiosulphate) అను గంధకపు ఆమ్లజనిదామ్లము (Oxyacid of Sulphur) యొక్క లవణము.

ఉదజ గంధకిదము : (Hydrogen Sulphide) ఇది గంధకము ఉపధాతువుల (Non-metals) తో సంయోగము చెందుననుటకు తార్కాణము. ఇందు ఉదజని (Hydrogen), గంధకము సంయోగస్థితిలో నున్నవి. కొన్ని గంధకపుబుగ్గల నీటియందును, అగ్ని పర్వత వాయువుల యందును ఈ వాయువుకలదు. ఈ వాయువు జంతు, వృక్ష పదార్థములు క్రుళ్లుటచేకూడ నేర్పడుచున్నది. సాధారణముగ సజలామ్లములు (Dilute Acids) గంధకిదముల (Sulphides) తో ప్రతిక్రియ చెందినపుడు ఈ వాయువు తయారగును. ఇది రంగులేని వాయువు. కుళ్లిన గ్రుడ్లకుండు దుర్వాసన దీనికి కలదు. ఇది చాలా విషపూరితమైన వాయువు. ఈ వాయువును కొద్దిగా పీల్చిన తలనొప్పి, నీరసము, బలహీనత కలుగును. ఉదజ గంధకిదము గాలికంటె బరువైనది. బాగుగా వేడిచేసినపుడు ఇది ఉదజనిగాను, గంధకముగాను వియోగము చెందును. ఈ వాయువు నీటిలో కరిగినపుడు ఉదజగంధకికామ్లము (Hydro Sulphuric) అను ఆమ్లము (Acid) ఏర్పడును. గాలిలో మండించినపుడీ వాయువు నీలిరంగుతో మండును. మండగా ఏర్పడిన పదార్థములు గంధకద్వి ఆమ్లజనిదము, నీరు అనబడుచున్నవి.

ఉదజగంధకిదము వలన కూడ పెక్కు ప్రయోజనములు కలవు. వాటిలో ముఖ్యమైనది, ప్రయోగశాలలో రసాయనిక పృధక్కరణము (Chemical Analysis)లో ఇది వాడబడుటే. పైన చెప్పబడిన గంధకము యొక్క సంయోగపదార్థము లే కాక మరికొన్ని ఈ క్రింద వివరింపబడినవి.

223