Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గంధకము

సంగ్రహ ఆంధ్ర

ప్రపంచ గంధకోత్పత్తి సుమారు 20 సంవత్సరముల క్రిందట సాలుకు 15 లక్షల టన్నులుండెను. ప్రస్తుతమిది రెండు, మూడు రెట్లు పెరిగినది. రానురాను గంధకము యొక్క అవసర మెంతయు పెరుగుచున్నది. ఒక్క అమెరికా దేశములో నే ఇప్పుడు నూటికి 80 పాళ్లు గంధకోత్పత్తి చేయబడుచున్నది.

జపానులో లభించు గంధకము చాలా భాగము హొకాయిడో (Hokkaido) లో త్రవ్వబడుచున్నది. ఇటలీ గంధకోత్పత్తిలో ద్వితీయస్థాన మాక్రమించుచున్నది. ఆ దేశము సాలీనా సుమారు 4 లక్షల టన్నుల గంధకమును ఉత్పత్తి చేయుచున్నది.

ఇక గంధకముయొక్క నిజస్వరూపము, దాని వివిధ లక్షణములు పరిశీలింపదగినవి. ఇండియాలో కొన్నిచోట్ల సముద్ర తీరప్రాంతమునందు, గంధకపు సూక్ష్మజీవులు (Bacteria) సముద్రపు నీటిలోని జిప్సమ్ (Calcium Sulphate) తో ప్రతిక్రియ (React) చెందుటవలన గంధకము ఏర్పడి ఉండవచ్చునని కొందరు శాస్త్రజ్ఞులు అభిప్రాయపడిరి.

జపానులోని గంధకము అగ్నిపర్వత 'లావాల' నుండి ఏర్పడినది. ఇటలీలోని గంధకము భూగర్భ శిలలందు జిప్సమ్, సున్నపురాయి (Limestone) తో కలిసి యుండును. అమెరికాలో గంధకము భూగర్భమున 300 అ. నుండి 1200 అ. ల లోతువరకు పొరలు పొరలుగా ఏర్పడి యున్నది. దీనితో కూడా జిప్సమ్, సున్నపురాయి మిళితమైయున్నది.

గంధక సంగ్రహణము (extraction): సిసిలిలో లభించు ముడిగంధకమునందు నూటికి 15 నుండి 20 పాళ్ల వరకు గంధక ముండును. అడుగుభాగము ఏటవాలుగా నుండు ఇటుక బట్టీలలో ముడిగంధకము పేర్చి నిప్పంటించెదరు. గంధకము వేడికి కరిగి కొయ్య అచ్చులలోనికి ప్రవహించి ఘనీభవించును.

అమెరికాలో లభించు గంధకము భూమి ఉపరితలమునకు 800 అడుగులు లోతున పొరలు పొరలుగా నుండుటచేత భూమట్టమునుండి క్రిందికి రంధ్రములు త్రవ్వి గొట్టములద్వారా బాగుగా వేడిచేసిన నీటిని పంపుదురు. గంధక మా వేడికి కరిగి ద్రవరూపమున పైకి వచ్చును.

జపానులో భూగర్భమునుండి గంధకమును త్రవ్వి బయటికి తీయుదురు. గంధకమును పరిశుభ్రపరచుటకు, దీనిని ఇనుపపాత్రలలో కరిగించి, రిటార్టులలో (Retorts) మరగించెదరు. మరగిన గంధకము ఆవిరిరూపమున పెద్ద ఇటుకల గదిలో ప్రవేశించును. ఈ ఆవిరి చల్లని గోడలపై ఘనీభవించును. ఘనీభవించిన గంధకము లేత పసుపు స్ఫటికా కారమున నుండును. దీనిని గంధకపుధూళి (Flowers of Sulphur) అందురు. పిమ్మట గోడలు కూడ వేడెక్కి గంధకపు ధూళిని కరగించును. ఈ గంధక ద్రవము క్రిందికిజారి స్తూపాకారపు (Cylindrical) అచ్చులలోనికి ప్రవహించి ఘనీభవించును.

గంధకపు బహురూపసంపద (Allotropy of Sulphur) : గంధకము ఒక ఆకృతిలో కాక, వివిధ రూపములలో ఈ మూలకము (Element) కన్పట్టుచున్నది. అనగా గంధకమునకు బహురూప సంపద (Allotropy) కలదు. ఇది ముఖ్యముగా 3 రూపములలో గోచరించు చున్నది. అవి : 1. వజ్రాకృతి గంధకము (Rhombic Sulphur) 2. పట్టక గంధకము (Monoclinic Sulphur) 3. సాగుడు గంధకము (Plastic Sulphur) మొదటివి రెండును స్ఫటిక (Crystal) రూపములు. వీటి కన్నిటికి రూపభేదమే కాని లక్షణభేదము లేదు. పటములో వజ్రాకృతి పట్టక గంధకపు రూపములు (ఎ. బి.) సాగుడుగంధక రూపములు (సి) చూడవచ్చును.

వజ్రాకృతి గంధకము : సాధారణ గంధకమును, కర్బన ద్విగంధకిదము (Carbondisulphide) లో కరగించి, ఆ ద్రావణమును నెమ్మదిగా ఇగురబెట్టినయెడల (Evaporate) తేజోవంతమైన పసుపువర్ణపు వజ్రాకృతి గంధక మేర్పడును.

వజ్రాకృతి గంధకము అన్నిటికంటె స్థిరరూపము గలది. కర్బన ద్విగంధకిదము, బెంజీన్, కర్పూరతైలములయందు త్వరగా కరగును; సారాయము, వై హాయసము (Ether)లలో కొద్దిగా కరగును. నీటిలో కరగదు. ఇది వేడిమిని, విద్యుత్తును ప్రసరింపచేయదు .

పట్టక గంధకము : ఇది 1823వ సంవత్సరమున కనుగొనబడినది. ఇది వేడిచేసిన గంధకమును స్ఫటికీకరణము (Crystallise) చేసినపుడు తయారగును, ఒక పింగాణీ

220