Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గంధకము

చాల ముఖ్యమైనది. దీనిని ఎరువుల పరిశ్రమలోను, పెట్రోలియం పరిశుద్దము చేయుటకును కొన్ని ఆమ్లములు తయారు చేయుటకును, పంచదార తయారుచేయుటయందును, తదితర రాసాయనిక పరిశ్రమలలోను ఎక్కువగ వాడుదురు. వివిధ దేశములలో ఉత్పతియగు గంధకికామ్లములో సగభాగము ఎరువులను తయారు చేయుటకే వాడబడుచున్నది. అందుచేత ఒక దేశముయొక్క సంపద అచ్చట వాడబడు గంధకికామ్ల పరిమాణమును బట్టి ఉండు ననునది అతిశయోక్తి కాదు.

గంధకము దొరకు విధానము: గంధకము ప్రకృతిలో మూలకరూపములోను, సంయోగరూపములోను దొరకు చున్నది. విడిగా దొరకు గంధకము ముఖ్యముగా అగ్నిపర్వత ప్రదేశములగు సిసిలీ (ఇటలీ) యందును, జపానులోను, అమెరికాలోను లభించుచున్నది. ప్రపంచములో లభించు గంధకములో నూటికి 80 పాళ్లు అమెరికాలో సంగ్రహింపబడుచున్నది. గంధకము ఇతర ధాతువులతో మిళితమై సంయోగరూపమున (Compound) విరివిగా లభించును. అనగా ధాతువుల ఖనిజములగు ధాతు గంధకిదములు (Metallic Sulphides) గ లభించును. ధాతువుల ఖనిజములలో ముఖ్యమైనవి, సీసపు గంధకిదము (Galena), యశదగంధకిదము (Zinc Sulphide -Zinc blender), పాదరస గంధకిదము (Cinnabar). ఇనుప గంధకిదము (Iron Pyrites), తామ్ర గంధకిదము (Copper Pyrites). సల్ఫేటులరూపమున ఇది కాల్షియం సల్ఫేటు (Gypsum), బేరియం సల్ఫేటు (Barytes)లుగ లభించును.

గంధకము దొరకుచోట్లు : దక్షిణ హిందూదేశములో, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణాజిల్లాలోని మచిలీపట్టణమునకు ఏడుమైళ్ల దూరమున కోనప్రాంతమున గంధకపు ఉనికి కనుగొనబడినది; ఇది సముద్రతీరమందలి పల్లపు ప్రదేశము. కాన్‌బీరార్ (25°29'>:66°3') వద్దనున్న ఉప్పునీటి బుగ్గలలో గంధకము కలదు. బొంబాయిరాష్ట్రములో గిజ్రీబందర్ (24°48′:67°8′), లాకి (26°16′:67°57′) ల వద్ద శిలలో గంధకము కనుగొనబడినది. కాశ్మీరములో కూడ వేడినీటిబుగ్గలలో గంధకము కలదని శాస్త్రజ్ణులు కనుగొనిరి. దీనినుండి 20 - 25 టన్నుల గంధకము గ్రహించబడినది హిమాలయములలో కూడ అచ్చటచ్చట గంధకపుబుగ్గలు కలవని కనుగొనబడినది.

మన దేశములో ధాతుగంధకిదములు (Metallic Sulphides) దొరకు ప్రదేశము లచ్చటచ్చట గలవు. ఈ ధాతుగంధకిదములలో ఇనుపగంధకిదము పేర్కొనదగినది. ఆంధ్ర, మదరాసురాష్ట్రములలో దీనిని కనుగొనిరి. సల్ఫేటులలో ముఖ్యమైనవి, విరివిగా దొరకునవి జిప్సమ్, బేరియం సల్ఫేటులు. జిప్సమ్‌ను గంధక సంగ్రహణములో వాడవచ్చును. ఈమధ్యనే బీహారులోని షహబాద్ జిల్లాలో 'సన్ లోయలో 'ఇనుపగంధకిదము (Iron Pyrites) యొక్క నిధులు (Deposits) భారత భూగర్భశాస్త్రశాఖ వారిచే కనుగొనబడినవి. ఈ ప్రాంతములో బంజరీ, కొరియారి, రాహటాన్ కోటలలో ఈ నిధులు కనుగొనబడినవి. ఇనుపగంధకిదనిధులు కై యూరు ఇసుకరాళ్లక్రింద బిజైగర్ షేలులతో (Shales) కలసి విస్తరించియున్నవని శాస్త్రజ్ఞుల అభిప్రాయము. 1951-52 లో భారత భూగర్భశాస్త్ర శాఖవారు బంజరీ ప్రాంతములో పరిశోధనలు జరపినారు. ఇక్కడి పై రైటు 43% గంధకము కలిగియున్నది. ఈ నిధులనుండి గంధకమును ఉత్పత్తిచేసి గంధకికామ్లముల పరిశ్రమ ఈ ప్రాంతములో స్థాపించవచ్చునని ఈ పరిశోధనలు చేసిన శాస్త్రజ్ఞులు సూచించియున్నారు. మనదేశమునకు కావలసిన గంధకికామ్లమును మనమే తయారుచేసికొనుట, దేశమున కెంతో సౌభాగ్యదాయకము. దానికి తగిన గంధకము దేశములోనే ఉత్పత్తిచేయవలెను. దేశములో జిప్సమ్ పెక్కుచోట్లగలదు. జర్మనీ, ఇంగ్లాండు వంటి పాశ్చాత్య దేశములవలె భారతదేశముకూడ జిప్సమ్ నుండి గంధకమును సంగ్రహించి (Extract) ఆ గంధకమును గంధకికామ్ల పరిశ్రమకు వాడవచ్చును. ఏది ఏమైనను జిప్సమ్ మీద పరిశీలనలు ఇంకను మనవారు చేయవలసిన అవసరము కలదు. ఈ పరిశీలన లన్నియు పూర్తి అయిన పిమ్మట జిప్సమ్‌ను సక్రమముగ వినియోగించి, గంధకోత్పత్తి కొనసాగించిన, గంధకికామ్ల పరిశ్రమ వృద్ధిచెంద గలదు. ప్రస్తుతము మనదేశమున గంధకికామ్ల పరిశ్రమలు అచ్చటచ్చట కలవు. ఇవి దేశపరిశ్రమాభివృద్ధికై మొదటి సోపానము లనవచ్చును.

219