Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గంధకము

సంగ్రహ ఆంధ్ర

కోటచుట్టు నొక అగడ్త మిగులలోతైనది కలదు. కోట వెలుపలి భాగమున దక్షిణపుకొనయం దొక సెలయేరు కలదు. అది కోటలోనికి ప్రవేశించి రాయల చెరువును నింపును. రాయల చెరువులోని నీరు పనుపుపచ్చగ నుండును. ఈ చెరువు పొడవు ఎక్కువ, వెడల్పు తక్కువ. లోతు ఎంతయున్నదో తెలిసికొన్నవారు లేరు ఈ చెరువు ఫలవృక్షములకును పైరులకును జీవనాధారముగ నున్నది. పశ్చిమోత్తర దిశలలో పినాకినీనదియే సహజముగ కోట రక్షణ కై ఉపయోగపడుచున్నది. రాయల చెరువుయొక్క ఊటనీరును, బావులనీరును నిమ్మ, అరటితోటలకు ఉపయోగపడును. రాతి ప్రదేశమయినను పసుపు, నిమ్మలు అరటిచెట్లు బాగుగా ఫలించును.

కొండాపురము రైల్వేస్టేషనునకు ఈ గండికోట 5 మైళ్ళలో నున్నది. ఈ మార్గమున అగస్త్యేశ్వరుని కోన చూడతగినది. గండికోట, కోటగోడలు, తత్పరిసరపర్వత పంక్తులు, అగస్త్యకోనలోనున్న దేవాలయ గోపురము. పినాకిని, జమ్ములమడుగులోని మసీదులు మున్నగు దృశ్యములు చాల దూరమువరకు అతి రమ్యముగా కనిపించును. తూర్పు ద్వారముకడకువచ్చి లోనప్రవేశించినచో, ఎడమప్రక్కన వీరభట నివాస స్థలములు పెక్కులు శిథిలములై కనిపించును.

ఉత్తరమునకు మరలినయెడల మాధవరాయ దేవాలయము, దానిగోపురము, లోపల ఆగ్నేయభాగమున గల పాకశాల, దక్షిణమున అలంకారశాల, వాహనశాల, నైరుతిభాగమున ఎత్తయిన శిలా స్తంభములతో, ఉన్నతమైన వేదికలతో, అలరారు కల్యాణమండపము, పడమట శ్రీదేవిగుడి, ఈశాన్యమూల పన్నిద్దరాళ్వారుల ఆలయము, ముఖమండప సమీపమున ఆరు ఏనుగుల ప్రతిమలు, అందు ఎత్తయిన అరుగు, దాని మధ్యభాగమున తొట్టె వంటి సభాస్థలము, ఆ తొట్టెలో నాట్యానుగుణమగు విషయములను దెల్పునట్టి రాతివిగ్రహములు, తంబుర, మద్దెల, తాళము మున్నగు పరికరములను ధరించి నాట్యమును దెలుపునట్లున్నవి. రాతి విగ్రహములు పయి భాగమును మోయుచున్నట్లు కనబడును. ప్రతి స్తంభమునకును సింహములు, రౌతులతో గూడిన గుఱ్ఱములు గలవు. ముఖమండప స్తంభముల పై భాగమున కప్పుక్రింద నాలుగుప్రక్కలందును, దశావతారములను, శ్రీ మహావిష్ణువు యొక్క లీలావతారములను వర్ణించు విగ్రహములు మనోహరమైనవిగ కనిపించును. లోపలికి పోయినచో, వాకిటి ముందరను, గడపప్రక్కను, ఖండితమైన శిలాశాసన మొకటి కలదు. అందు "కొండ్రాజు. . . మాధవరాయలకు తోమాల సేవకు సమర్పించిన" అని యున్నది. శాసనము మొదటిభాగ మెందున్నదో తెలియదు. మధ్యభాగమున అక్షరములు స్పష్టముగనున్నవి

గండిపేట అను పేర ఒక గ్రామము కూడా కలదు. ప్రస్తుతమందు 300 ఇండ్లుకలవు. రైతులు, బలిజలు, తురుష్కులు అధిక సంఖ్యాకులుగ నున్నారు. వైశ్యుల అంగళ్ళయందు వస్తువులు లభించును. పెరుగు, పాలు సమృద్ధిగ దొరకును. ఇందు శిథిలావస్థలోనున్న మంత్రుల మందిరములు, సేనాపతుల గృహములు, తత్సమీపమున కొంతవరకు పగిలియున్న ఫిరంగి యొకటి, ప్రాక్పశ్చిమ దిక్కులలో బలమును పరీక్షించుటకై ఎత్తెడు కొన్ని గుండ్లు కనిపించును.

జ. వేం. సు. శ.


గంధకము (Sulphur) :

మానవుడు చరిత్ర నెరిగినప్పటి నుండి గంధకము వాడుకలో నున్నది. దీపావళి టపాకాయలు, మందుగుండు సామాను మున్నగునవి కాల్చినపుడు వచ్చు గంధకపువాసనను తెలియనివారుండరు. నాటువైద్యులు గంధకమును మందులు తయారుచేయుటకు వాడుట గూడ మన మెరుగుదుము. ఘాటు వాసనగల ఉల్లి, వెల్లుల్లి, ముల్లంగి, ఆవ మొదలగు వాటియందు గంధకము సంయోగ రూపమున గలదు. గంధకము సూర్య గోళములో కూడ కలదని శాస్త్రజ్ఞులు కనుగొనిరి. మానవశరీరమున గూడ గంధకము కొంతకలదు. ఈ గంధకమును గురించి, బైబిల్ లోను, ప్రాచీన భారతీయ గ్రంథములలోను వ్రాయబడినది. ఆంగ్లములో గంధకమును “సల్ఫర్ ” (Sulphur) అందురు.[1]

గంధకముకన్న, దానినుండి తయారైన పదార్థము లెక్కువ వాడుకలో నున్నవి. వీటిలో గంధకికామ్లము

  1. ఈ పేరునకు సంస్కృతపదము 'సవ్వేరి' మూలాధారములు.

218