Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఖరోష్ఠీలిపి

సంగ్రహ ఆంధ్ర

లోని ఖోటాన్‌లో దొరకిన భూర్జపత్రములమీద వ్రాయబడిన ధమ్మపదమునందునుకూడ ఈ లిపి ఉపయోగింపబడి నది. అన్నిటికన్న ప్రసిద్ధమైనఖరోష్ఠి శాసనములు అశోకుడు, షాబాజ్‌గర్హి, మాన్సేరా అను పంజాబులోని రెండు ప్రదేశములలో వేయించిన శిలాశాసనములు ఏ ఒకటి రెండు సంయుక్తాక్షరములో తప్ప ఆశోకుని ఈ రెండు శాసనములును సులభముగా చదువుటకు వీలున్నది. శకుల శాసనములును, ఖోటానువద్ద దొరకిన ధమ్మపదమును చాలవరకు సులభముగనే చదువవచ్చును. కాని పార్థియన్ రాజు గుడుఫరుని శాసనములును, కుషాను చక్రవర్తులగు కనిష్క, హవిష్కుల శాసనములును ఇప్పటికిని చదువుట చాల కష్టము.

ఖరోష్ఠియను పేరు ఈ లిపికెట్లు వచ్చెనో తెలియరాదు. సంస్కృతభాషలో ఖరమనగా గాడిన, ఓష్ఠ మనగా పెదవి. ఈ అర్థములనుబట్టి ఊహచేసి, ఇది ప్రచారములో నున్న ప్రాంతమువారు వట్టి అనాగరికులు కాబట్టి వారి పెదవుల నుండివచ్చిన వాక్కులకు రూపముకట్టిన లిపి ఖరోష్ఠీలిపి యాయెనని కొందరు నుడివిరి. గాడిదచర్మముమీద తొలు దొల్త ఈ లిపిలో వ్రాతలు సాగించిరి. కాన ఖర్ వోస్తుమీద వ్రాసిన లిపి ఖరోష్ఠిలిపి యాయెనని మరికొందరు వక్కాణించిరి. ఖరోత్థ అనే అరమీన్ భాషాపదమే కాలక్రమమున ఖరోష్ఠీగా మారెనని ఇంకను కొందరు వాదించు చున్నారు. ఈ ఖరోష్ఠీ లిపిని చదువుటకు సాధించిన విచిత్రగాథను వివరించుటకు ఇచట సాధ్యముగాదు. భారతీయ - యవన, భారతీయ -స్కిథియన్ రాజుల నాణెములపైన యవన, ప్రాకృత భాషలలో రెండింటిలోను శాసనములు వ్రాసి యున్నందున ఈ ఖరోష్ఠి లిపిలోనున్న యక్షరములను గుర్తించుటకు మొట్టమొదట ఒక చిన్న యాధారము దొరకెను. రాజుల పేర్లును, బిరుదములును ఏ భాషలోనై నను, ఏ లిపిలోనై నను మార్పుచెందక ఒక్కరీతిగ నుండవలెను. కాబట్టి తెలిసిన యవనలిపిలో చదివిన పిమ్మట ఈ పేర్లును, బిరుదములును ఖరోష్ఠీలిపిలో ఫలానా అక్షరములలో వ్రాయబడి ఉండవలెనని ఊహించుట ఏమంత కష్టమైనపనిగాదు. ఈ రీతిగనే ఆంటెలికిడెస్, మెనెండర్ అను ఇరువురి నాణెములపై నున్న అక్షరములను కూడ (ఖరోష్ఠీ అక్షరములను) "అంతిలకిదతస తదతసమహరజస" అనియును “మిళిందసమహరజసత్రదతస", అనియును ప్రప్రథమమున చదువకలిగిరి. తరువాత అశోకుని "షాబాజ్‌గర్హి" శాసనము కనబడగా, ఖరోష్ఠిలిపిలోనున్న ఈ శాసనమును, బ్రహ్మీలిపిలో నున్న ఇతని ఇతర శాసనముల ఆధారముచే చదివి ఒక్కొక్క అక్షరమును గుర్తించి, తాము ఇదివరకు నాణెములపైన గుర్తించిన అక్షరములు సరిగనున్న వా, లేవాఅనిపరీక్షించి, చివరకు ఇంచుమించుగా ఖరోష్ఠి అక్షరముల నన్నింటిని గుర్తింపగలిగిరి. ఈ ప్రయత్నమునందు ఇ. సి. బెయిలీగారి కాంగ్రాశాసనము బ్రహ్మీ, ఖరోష్ఠీ రెండు లిపులయందును వ్రాయబడినందున, చాలసహాయకారి యాయెను. ఐనను మేస్సన్, ప్రిన్సేప్, లాన్సెన్, నారిస్, కన్నింగ్ హామ్ మొదలైనవా రెందరో శ్రమపడిన పిమ్మటగాని ఖరోష్ఠీలిపి చదువుటకు సాధ్యముగాలేదు .

'ఖరోష్ఠీలిపిని పండితులకన్న పామరులే ఎక్కువగా ఉపయోగించిరి' అనుటకు దానికున్న ప్రత్యేక లక్షణములను కొన్నిటిని నిర్వచించవచ్చును. అక్షరములు చాలవరకు అచ్చు అక్షరములవలెగాక తొందరగా వ్రాయుటకు అనుకూలముగనుండు కత్తు లిపివలె నున్నవి. దీర్ఘములైన యచ్చులు చాలవరకు దైనందిన వ్యవహారమునందు అవసర ముండవు; కాబట్టి ఈ లిపిలో కానరావు. అల్ప ప్రాణ ద్విత్వాక్షరములు (అనగా ఒత్తు లేని ద్విత్వాక్షరములు) ద్విత్వము లేక నే వ్రాయుట (అనగా క్క, గ్గ, ట్ట మున్నగు ద్విత్వాక్షరములు క, గ, ట అని వ్రాయుట) ఖరోష్ఠీలో మామూలు. ఈ విధముగనే అల్పప్రాణ, మహాప్రాణములు రెండును కలిసిన ద్విత్వాక్షరములను ద్విత్వములేక ఒకటే మహాప్రాణాక్షరముగా వ్రాయుచుండిరి. అనగా క్ఖ, గ్ఘ, డ్డ మున్నగు ద్విత్వాక్షరములును, ఖ, ఘ, ఢ అని వ్రాయుచుండిరి. ఇక పదమధ్యమమున అచ్చుసంయోగములేని అనునాసికాక్షరము లన్నింటికిని అనుస్వారము వ్రాయుచుండిరి.

ఈ లిపి సిమెటిక్ వారి నుండి గ్రహింపబడినదనియు, ఆరామిక్ లిపిలో సంధికాలమునాటి న, బ, ర, మ, వ అక్షరములకును ఖరోష్ఠీ అక్షరములకును చాల ఎక్కువపోలిక కనబడుచున్నదనియు, ఇ. థామస్ అను దొర నిశ్చయించెను. ఇ. టెయిలర్, ఎ. కన్నింగ్ హామ్ అనువారలు

210