Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గండికోట

ఈ అభిప్రాయమునే అనుసరించుచు బహుశః మొదటి అకెమినియన్ రాజుల కాలములో ఈలిపి భారతదేశములో ప్రవేశపెట్టబడెనని తీర్మానించిరి. ఇందునకు చూపిన కారణము లివి : (1) అశోకుని శిలా శాసనములలో పశ్చిమ పంజాబ్ నందు కలవానిలో రాజశాసనము, వ్రాత అను అర్థమునందు “దిపి” అను పదము ఉపయోగింపబడు చున్నది. ఈ పదము ప్రాచీన ఇరాన్ భాషా పదము. (2) ఖరోష్ఠీలిపి ప్రచారములోనుండిన ప్రాంతము క్రీ. పూ. 500 నుండి క్రీ. పూ. 331 వరకు ఇరాన్ పాలనక్రింద నుండెను అప్పుడప్పుడు ఆ పాలనకు అంతరాయము కలిగినను, ఇరాన్ ప్రభావముమాత్రము తగ్గిపోలేదు. (3) ఇరాన్ సామ్రాజ్యము విశాలముగ వ్యాపించగా, అదివరకే ప్రభుత్వ నిర్వహణాదక్షులైన ఆరామియన్ ఉద్యోగస్తులును, వ్రాయసకాండ్రును, ఇతరులును రాజకార్యములందు ఎక్కువగా నియమింపబడిరి ; కాబట్టి నానా ప్రాంతములందును ఆరామిక్ లిపి వ్యాపించెను. అందువలన భారతదేశములో పశ్చిమోత్తర దిగ్భాగము ఇరాను సామ్రాజ్యమునకు వశమైన వెంటనే ఈ ఆరామిక్ లిపి. ఇచ్చటికి గూడ వ్యాపించెను. (4) ఖరోష్ఠి గుర్తులకును సక్కారా, తైమాశాసనములలో గాన్పించు అరామిక్ లిపి విశేషములకును ఎక్కువ పోలికలు గాన్పించున్నవి. ఈ శాసనములు క్రీ. పూ. అయిదవ శతాబ్దము నాటివి. కొన్ని కొన్ని ఖరోష్ఠి గుర్తులు ఇంకను ప్రాచీనమైన అస్సీరియా తూనిక రాళ్లపైని వ్రాతలకును, బాబిలోనియా ముద్రికలపైన వ్రాతలకును నడుమగల పోలికను వ్యక్తము చేయుచున్నవి.

ఆరామిక్ లిపిలో 22 అక్షరములు మాత్రమే కలవు. కాబట్టి భారతీయభాషలకు అవసరమగు, భ, ఘ, ద వంటి మహాప్రాణాక్షరములును, ఇతర అక్షరములును కూడ బ్రాహ్మీలిపి నుండి గ్రహింపబడినవి. ఆ విధముగనే ఒక్కొక్క అక్షరమునకును గుణింతములు (గుణింతములు ఆరమీనులిపిలో గాని, మరి ఏ ఇతర పాశ్చాత్యలిపిలో గాని లేవు కాబట్టి) బ్రాహ్మీనుండియే గ్రహింపబడియుండును.

ఖరోష్ఠీలిపి నాలుగురకములు గాన్పించుచున్నది. (1) ప్రాచీనతమ పద్ధతి. అశోకుని షాబాజ్‌గర్హి, మాన్సేరా శాసనములయందున్న లిపియు, అశోకుని సిద్దాపుర శాసనము చివరనుండు లేఖకుని నామమును, ప్రాచీనతమ నాణెములపైన గల అక్షరములును, పర్షియా దేశమున దొరకిన సిగ్లాయ్‌పైన కన్పడు అక్షరములును ఈ ప్రాచీన తమ పద్ధతికి చెందిన ఖరోష్ఠీలిపి (2) రెండవ పద్ధతి క్రీ. పూ. మొదటి రెండు శతాబ్దములందు భారతీయ - యవనరాజుల నాణెములపైన గాన్పించు ఖరోష్ఠీలిపి. ఈ లిపిని తర్వాతకాలమునాటి రాజులు కూడ అనుకరించిరి. (3) మూడవపద్ధతి క్రీ. శ. మొదటి శతాబ్దమువరకును అమలులోనుండెను. పటికుని తక్షశిలా తామ్రశాసనము నందును, మధురసుదస (సొడాస) సింహస్తంభ చూళికపైనను, కొన్ని గాంధార శిల్పముల పైనను, కల్దావా రాతిమీదను, కొందరు శక, కుషాణ రాజుల నాణెములపైనను ఈ పద్ధతి గాన్పించుచున్నది. (4) నాలుగవపద్ధతి లిపి క్రీ. శ. మొదటి రెండు శతాబ్దములందు గాన్పించుచున్నది. గాండో ఫెర్నిస్ యొక్క తఖ్త్-ఇ-బాహి శాసనమునందును, కనిష్క, హవిష్కుల శాసనములందును, ఖోటానువద్ద దొరకిన ధమ్మపద వ్రాత గ్రంథమునందును ఈ పద్ధతి లిపి గాన్పించుచున్నది.

పు. శ్రీ.


గండికోట :

గండికోట కడపజిల్లాలో జమ్ములమడుగునకు పడమటగా ఐదుమైళ్ళ దూరమున నున్నది. తూర్పున 300 అడుగుల ఎత్తుగల యొక కొండకును ఉత్తర భాగమున నున్న అదేఎత్తుగల మరియొక కొండకును మధ్యభాగమున గండితొలుచుకొని నాలుగుమైళ్ళ దూరము పినాకినీనది ప్రవహించుచుండుట చేతను, ఒకప్రక్క నొకకొండపై అభేద్యమైన గొప్పకోట యొకటి నిర్మింపబడియుండుట చేతను దీనికి గండికోట యను పేరు సార్థక మగుచున్నది.

ఈ పినాకినీ నదికి రెండుమైళ్ళు తూర్పుభాగమున ఎఱ్ఱకొండకు సమీపమున గల బొపమ్మేల్లి (బొమ్మనపల్లి)లో శాలివాహన శకము 1213 లో (క్రీ. శ. 1291) కాకమహారా

211