Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఖనిజముల రంగులు

సంగ్రహ ఆంధ్ర

రుటైల్); గొట్టములరూపములో నున్న రంధ్రము లుండుట లేదా ప్రతి స్ఫటిక రేణువులు (colloidal particles) లేక వీటియొక్క సమ్మేళనము వలనగాని కావచ్చును. 'కాట్స్ ఐ ఎఫెక్ట్' (cat's eye effect) ధర్మము క్రైసోబెరిల్ అను ఖనిజమునందు బాగుగా కాననగును. కొన్ని ఖనిజములలో ముఖ్యముగా కురువిందముయొక్క (corundum) కొన్ని నమూనాలలో ఆస్టెరిజమ్ (Asterism) లేక నక్షత్ర రూపప్రదర్శనము సామాన్యముగా అగపడును. దీనికి కారణము, ప్రధాన స్ఫటికాక్షమునకు (Principal Crystallographic axis) సమకోణములోను, పరస్పరము 60 డిగ్రీలవద్దను, వంగియున్న రేఖాపుంజముల యొక్క క్రమబద్ధమైన ఏర్పాటే. ఈ గుణము చూపు రాళ్ళను ఆస్టెరియాస్ (asterias) లేక నక్షత్రమణులు, నక్షత్రపద్మరాగములు, నక్షత్ర ఇంద్రనీలములు అని అందురు.

వెలుతురును ప్రసరింప జేయుటయందు వివిధ పదార్థములు భిన్నప్రకృతులను గలిగియుండును. ఇవి 4 రకములుగా విభజింపబడినవి. అవి యేవన - 1. పారదర్శకము (Transparent) - అనగా ఒక వస్తువు యొక్క ఆకారరేఖలు, సామాన్య దళసరితనముగల పదార్థముగుండా చూచినపుడు స్పష్టముగ కన్పించును. 2. అస్పష్ట పారదర్శకము (Semi Transparent) అనగా వస్తువు కన్పించినను, ఆకారరేఖలు అస్పష్టముగా నుండును. 3. అర్ధపారదర్శకము (translucent) - అనగా వెలుతురు అంచులగుండా మాత్రమే ప్రసరించును. 4. అపారదర్శకము (opaque) - వెలుతురును ఏమాత్రము ప్రసరింపనీయనివి.

వక్రీభవనము (Refraction) : ఒకానొక తరంగ పరిమాణము (wave length) గల వెలుతురు గాలినుండి (గాలియొక్క వక్రీభవనశక్తి ఇంచుమించుగా సున్న) ఏ పదార్థము లోనికైనను ప్రసరించునపుడు కిరణము పొందిన వక్రీభవనము యొక్క స్వభావము, ఆ పదార్థము యొక్క వక్రీభవనశక్తి (Refractive Power) పై గాని లేక దృక్ సాంద్రత (optical density) పై గాని ఆధారపడియుండును. ఏక పతనకోణము (గాలిలో) (single angle of incidence), ఏక వక్రీభవనకోణము (పదార్థము) ల నిష్పత్తికి పదార్థముయొక్క వక్రీభవన గణకము అని పేరు. ఇది వెలుతురును ప్రసరింపజేయు ప్రతి పదార్థమునకు స్థిరమయిన దృక్ పరిమాణము (optical constant). అందువలన దానిని నిర్ణయించుటచే ఖనిజములను పోల్చుకొనుటయందు అది మిక్కిలి ఉపయోగపడుచున్నది. గాలియొక్క వక్రీభవన గణకము 1 (ఒకటి) గా నిర్ణయించబడెను. ఇది ప్రమాణముగా తీసికొనినచో గాజుయొక్క వక్రీభవన గణకము = 1 .53; శిలాస్ఫటిక ము (quartz) = 1.54; గార్నెట్ (garnet) = 1.78 నుండి 1.88 వరకు; వజ్రము = 2.42; రుటైల్ (Rutile) = 2.6 నుండి 2.9 వరకు ఉండగలదు.

ఒక ఖనిజమును, లేదా దానియొక్క భాగమును పరావర్తనము చెందిన వెలుతురులో చూచినపుడు అగపడు రూపము ప్రకాశమనబడును (lustre). ఇది ఆ ఖనిజము యొక్క వక్రీభవన గణకము మీదను, నిర్మాణము మీదను, పారదర్శకత్వము మీదను ఆధారపడియుండును. ఖనిజముయొక్క కఠినత్వముకూడ వీనికి సంబంధించినదే. కఠినత్వము ఎంత హెచ్చుగానున్న, ఖనిజమునకు అంత నునుపుగా సానపెట్టవచ్చును. హెచ్చయిన వక్రీభవన గణకము గల ఖనిజములు వజ్రకాంతిని గలిగియుండును. కొన్ని ప్రత్యేకమగు కాంతుల పేర్లు, వాటినిగలిగి ఉండు ఖనిజములు ఈ క్రింద నియ్యబడినవి :

కాంతి దానిని కలిగి ఉండు ఖనిజములు
రెసినస్ (Resinous) ఓపాల్, హెస్సినైట్ గార్నెట్, ఆర్ పి మెంటు
సిల్కీ (Silky) క్రైసోటైల్, శాటిన్ స్పార్, ట్రిమొలైట్
గ్రీజీ (Greesy) సోవ్‌స్టోన్
మెటాలిక్ లేక లోహ కాంతి అపార దర్శకము లగు అనేక ధాత్వీయ ఖనిజములు

స్ఫటికత్వము (crystallinity) : ఒక ఖనిజములోని అణువులు ఒక క్రమము ననుసరించి ఉన్నప్పుడు దానికి ఒక స్ఫటికాకృతి కలుగును. అణు నిర్మాణము క్రమబద్ధముగా లేని ఖనిజములు నిరాకృతి (amorphous) గలవిగా నుండును. స్ఫటికాక్షముల (crystallographic

186