Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

ఖనిజముల రంగులు

సాధారణముగా చూర్ణముగానున్న ఖనిజముయొక్క రంగు ఘనరూపమున నున్నప్పటి రంగుకంటె భిన్నముగ నుండును. ఏదేని ఖనిజమును గరుకుగా నున్న పింగాణీ పలక పై రుద్దిన, దాని చూర్ణముయొక్క రంగు లేక గీటు లభించును. గీటు పెక్కు ఖనిజములయొక్క విశిష్ట లక్షణమై యున్నది. ఐరన్ పైరైట్స్ (Iron Pyrites) ఘనరూపములో నున్నప్పుడు ఇత్తడివలె పచ్చగా నున్నను దాని గీటు నల్లగా నుండును. క్రోమైట్ (Chromite) ముదురుగోధుమ రంగుగానో లేక నల్లగానో ఉండి, దాని గీటు ఎరుపు. గోధుమరంగులో నుండును. ఇడియోక్రొమాటిక్ ఖనిజముల గీట్లు సాధారణముగా రంగుగను, అల్లోక్రొమాటిక్ ఖనిజముల గీట్లు తెలుపు లేక బూడిద రంగులుగను ఉండును. ఛాల్సిడోనీ (Chalcedony)వంటి కొన్ని ఖనిజములలో మాంగనీసుయొక్క ఆమ్లజనిదము, హరితము (chlorite) వంటి ఇతర ఖనిజములు వ్యాపించి ఉండుట వలన వానిలో చెట్టుకొమ్మల వలె విస్తరించిన ట్లగపడు నమూనాలు కానవచ్చును. ఖనిజములలోనున్న మలినము (impurity) నందు నిరంతరము మార్పులు గలుగుట వలన అగేట్ (Agate) లో వలె చిత్రవర్ణములు గల పెక్కు పొరలు అందు ఉద్భవించును.

పెక్కు ఖనిజముల నుండి విలక్షణమైన ప్రకాశము గోచరించును. దీనికి కారణము ఖనిజముల యందున్న కాంతి పరావర్తనము చెందుటయే. ఒక్కొక్కప్పుడు సూక్ష్మరూపములలో ఖనిజ లక్షణములు గల యితర పదార్థములు, గాజు పదార్థములు, ద్రవపదార్థములు లేక వాయువులు - కలసిఉండుట వలన ఖనిజములలో రంగు లేర్పడుచున్నవి. ఈ పైన చెప్పిన కలయికలు లేనియెడల రంగులు ఏర్పడజాలవు. హైపర్‌స్తీన్ (Hypersthene)లో ఇల్‌మెనైటు (Ilmenite) అను ఖనిజము సూక్ష్మ రూపములో చేరిఉండుటచే దానికి మెరుపు గలుగును. సహజముగా కాంతి విహీనమయినప్పటికి దానిలో వివిధ రూపములలో అనేకములయిన ఇతర పదార్థములు కలసి ఉండుటచే లాబ్రొడరైట్ (Lobrodorite) లేక చంద్ర కాంతము కొన్ని కోణముల వద్ద వెలుతురును గ్రహించినపుడు మిక్కిలి ప్రకాశము గల నీలము, ఆకుపచ్చ, ఎరుపు లేక ఇత్తడి రంగులను ప్రదర్శించును. అట్లే ఆలిగోక్లేస్ (Oligoclase) లో ఒక జాతికి చెందిన సూర్యకాంతము నందు హెమటైట్ యొక్క అనేక సూక్ష్మకణము లుండుటచే ఆ మణికి ఎఱ్ఱని వన్నెయు, తళతళలాడు కాంతియు చేకూరును. ఖనిజము యొక్క సహజమైన వన్నె యే గాక, దానిపై ఆవరించియున్న, లేదా, దానితో కలసియున్న సన్ననిపొరలపై సూర్యుని వెలుతురు పడుటవలన గూడ రంగులు కన్పడును. ఈ ధర్మమునకు ఇరిడిసెన్స్ (Iridiscence) అని పేరు. ఇది వెలుతురు యొక్క జోక్యము (Interference) వలన ఏర్పడు చున్నది. ముఖ్యముగా ఓపల్ (opal) అను మణి యందు ఈ ధర్మము బాగుగా కాననగును. ఓపల్ అనిశ్చితము లయిన నీటి మొత్తములు గలిగి ఘనీభవించియున్న ఇసుక రాయి. ఇది ఒక సంశ్లిష్టమగు పొరలు పొరలుగా నున్న నిర్మాణము కలది. ఈ సూక్ష్మములైన పొరలపై వెలుతురు పడినప్పుడు అవి సన్నని ద్రవపదార్థముల పొరల వలెనే ప్రవర్తించును. ఆ పొరలనుండి బహిర్గతమగు వెలుతురు యొక్క ఒక భాగము, వాటి ఉపరితలముపై వెంటనే పరావర్తనము చెందును. మరియొక భాగము మొత్తము పొరలచేత వక్రీభవనము చేయబడి, తరువాత వాని క్రిందిభాగముచే పరావర్తనము చెందబడును. ఈ భాగము పొరయొక్క ఉపరితలము నుండి బహిర్గతమగు నప్పటికి, రంగునందలి కొన్ని యంశములు అర్ధతరంగ పరిమాణముచే (half wave length) వెనుకబడి, మరియొక ప్రకాశవంతమగు భాగమునందలి అంశములతో సంఘర్షించి, వాటిని పూర్తిగా నాశన మొనర్చును. ఈ విధముగా కొన్ని వర్ణాంశములు (colour components) మాత్రమే మిగిలి విచిత్రవర్ణములను (Play of colours) కల్పించును.

ఖనిజములలో ఒకే ఒక దిశలోనున్న రేఖాపుంజములు కారణముగా (bundles of lines) కాటోయెన్సీ (chatoyancy) లేక cat's eye effect ఏర్పడును. ఈ రేఖాపుంజములున్న దిశకు సమకోణములో (at right angles) రాతిని చూచినచో, పుంజమునకు అడ్డముగా ఒక కిరణసమూహము ప్రసరించుట కన్పించును. పై చెప్పబడిన రేఖాపుంజములు అగపడుటకు కారణములు — ఇతర ఖనిజములు సూక్ష్మరూపములలో కలిసి ఉండుట (ఉదా :

185