Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

క్షేత్రయ్య I

వెలిబుచ్చు సమర్థత క్షేత్రయ్యకే గలదనిన అతిశయోక్తి కాజాలదు. ఇతడు భాషామర్మములను బాగుగ నెరిగినవాడు. దేశీయపదములను తన పదకవితయందు మూర్తీభవింప జేసినాడు. ఇతని వర్ణనలు, కల్పనలు, చిత్రములై, నూతనములై అలరినవి. ఇతని కవిత్వమందలి జానుతెనుగు మాటల కూర్పు మిక్కిలి మనోహరము.


"ఎంత వెన్నదిన్న ఎంత మీగడ దిన్న
 తృప్తిపడని ముద్దు కృష్ణమూర్తి
 తృప్తుడయ్యె నీదు తెలుగు పల్కుల వెన్న
 నారగించి క్షేత్రయాఖ్య సుకవి. "

అని ఒక కవి యనెను. ఇది ముమ్మాటికి నిజము.

సంగీతము : సంగీతమునకు రాగము జీవము. కర్ణాటక సంగీతమందుగల ముఖ్యమగు సుమారు నలుబది రక్తిరాగములలో క్షేత్రయ్య పదములను రచించినాడు. ఆరాగములకు నిర్దుష్టమైన స్వరూపమును తీర్చి దిద్దినాడు. రాగముయొక్క గొప్పదనము, అందము పదరచన యందు, ఎంత మహత్తరమైన రసస్ఫూర్తిని కలిగింపగలవో క్షేత్రయ్య వెల్లడించినాడు. ఇతడు ఒక రాగముననే రసభావముల ననుసరించి అనేక పదములను రచించెను. సైంధవి, ఘంటా, ఆహిరి, ముఖారి. బేగడ, సౌరాష్ట్ర మున్నగు రాగములకు నేటికిని క్షేత్రయ్య పదములే మాతృకలు. రాగ వ్యక్తిత్వమునకు ఆధారభూతములైన గమక విన్యాసములు స్పష్టముగ గోచరించునట్లు క్షేత్రయ్య పదములను విలంబకాలములో రచించెను. మరియు తాళముకొరకు సాహిత్యమును అడ్డదిడ్డముగా విరువ నవసరములేకుండ పదములను కూర్చినాడు.

నాట్యము : నృత్యమునకు క్షేత్రయ్యపదములు మిక్కిలి యనుకూలములు. గీత, వాద్య, నృత్యముల చేరికకే సంగీత మనునది పరిభాషాపదముగ నేర్పడినందున గీతవాద్యములకు నృత్యము తోడైననేగాని సంగీతము పూర్ణ స్వరూపము నొందినట్లు కాజాలదు. కైశికీ వృత్తి ప్రధానముగా కోమల కరణాంగ విక్షేపములచేత మృదుమధుర మైన లాస్యరీతితో అంగసౌష్ఠవము గల యువతులు క్షేత్రయ్య పదములను దక్షతతో పాడి - ఆడినచో పదములలోని రసము అనుభవమునకు వచ్చును. క్షేత్రయ్య విజయరాఘవ నాయకుని కొలువులో భావావేశముతో పదములను పాడి, యాడి సభాసదులను ముగ్ధులనుగ జేసినాడు. క్షేత్రయ్య నాట్యకళా చరిత్రలో నూతన యుగమును కల్పించినాడు. ఇతడు శృంగారరస రాజ్యపట్టభద్రుడు అభినయ సర్వస్వమును కొల్లగొన్న మేటి.

క్షేత్రయ్య అలంకారశాస్త్రవేత్త. ఇతని నాయికలు నెరజాణలు. ఇతని విద్యావినోద నైపుణ్యములు, ఇతని శృంగారసీమలలోని విశేషములు; ఇతని పదములయందు అభివ్యక్తములు. అదొక రసప్రపంచము.

మధురభక్తి : శృంగారము లౌకికమని, అలౌకిక మని రెండు విధములు. లోకమందు సాధారణముగ గోచరించు ప్రేమ లౌకికము. అది కామప్రేరితము, అలౌకిక మైన ప్రేమ నిగూఢమైనది. లౌకిక శృంగారమందు నాయికా నాయకులు స్త్రీ పురుషులుగా, 'ప్రత్యేక వ్యక్తులుగా ఉందురు. అలౌకిక శృంగారమందు భక్తుడో, భక్తురాలో నాయిక గాను, వారి ఇష్టదైవము నాయకుడుగాను ఉందురు. వీరి శృంగారము భక్తి శృంగారమని, మధురభావ మని, ప్రేమభక్తి యని వ్యవహరింపబడును. ఇది ఒక మహత్తర మగు సాధనముగా, భక్తిమార్గముగా ఋషి పుంగవులచే వర్ణింపబడినది. ఆర్ష సంప్రదాయములోనే గాక క్రైస్తవ మత సంప్రదాయములో కూడ ఇట్టి భక్తిమార్గము కలదు. దీనిని "The Doctrine of Divine Spouse" అందురు. ఇట్టి భక్తి సాధనచే గల్గు మహానందము కారణముగా పుట్టునట్టి భావములను సంగీత సాహిత్యమార్గమున ఎందరో మహనీయులు వ్యక్త పరచినారు. మీరాబాయి, ఆండాళ్, జయదేవుడు, లీలాశుకుడు ఈ మార్గమునకు చెందినవారు. క్షేత్రయ్య నిండుమనసుతో, విశుద్ధప్రేమతో, తన దైవమగు మువ్వగోపాలుని అనేక రీతుల భావించి దివ్యములగు శృంగార పదచిత్రములను వెలయించెను. మువ్వగోపాలుని నాయకునిగా, పరమపురుషునిగా, క్షేత్రయ్య భావింపగలిగినాడు. తాను రాధగా మారిపోయినాడు. తన ప్రేమ భావములను పదరూపమున బాడి ఆనందించినాడు. "శ్రీపతి సుతు బారికి నే నోపలేక నిను వేడితే కోపాలా ? మువ్వగోపాలా!" అనునది క్షేత్రయ్య విప్రలంభ శృంగారము యొక్క మొదటి గేయ స్వరూపము. పొంగిపొరలు భావములను వివిధ రీతులతో అనేక పద

157