Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్షేత్రయ్య I

సంగ్రహ ఆంధ్ర

చొప్ప నరకు యంత్రము (chaff cutters): ఈ యంత్రము పశుగ్రాసమును నరకుట కుపయోగపడును. పశుగ్రాసమును చేతితో నరకుటవలన కాలవ్యయము అగుటయేగాక, శ్రమగూడ అధికమగును. ఈ యంత్రము

చిత్రము - 46

చొప్పనరకు యంత్రము

పటము - 9

విద్యుచ్ఛక్తిచేగాని లేక ఒక ఉపకరణముద్వారా ఎద్దులచేగాని నడుపబడుచున్నది. ఈ యంత్రమువలన తక్కువ వ్యవధిలో ఎక్కువ పశుగ్రాసమును నరుక వీలగును.

తక్కువ వ్యయముతోను, తక్కువ కార్మికశక్తితోను అధికమైన పంటను పండించుటకును, భూమిని సారవంతమైన దానినిగా పదునుచేసి ఆరోగ్యకరమైన వాతావరణములో విత్తనములు మొలచి, మొక్కలు దృఢముగను, ఏపుగను పెరుగుటకును, పైరుకు చేటు తెచ్చు కలుపును పెకలించి వేయుటకును, సమర్థవంతమైన పరికరములు, యంత్రములు అవసరమగుచున్నవి. అందుచే, అత్యధికోత్పత్తిని సాధించుటకును, ఉత్పత్తికగు వ్యయమును తగ్గించుటకును మిక్కిలి సమర్థతగల ఇట్టి యంత్రములను, పరికరములను ఇతోధికమైన పరిమాణములో వాడుటయే గాక వాటిని ఎప్పటికప్పుడు బాగుచేయుచు సవ్యముగపనిచేయునట్లును, ఎక్కువ పని జరుగునట్లును చూచు చుండవలెను.

బి. ఆర్. బి.


క్షేత్రయ్య I :

క్షేత్రయ్య. కృష్ణాజిల్లాలో కూచిపూడి సమీపమున నున్న మువ్వ గ్రామస్థుడు. ఇతడు మువ్వలోని గోపాలస్వామికి అంకితముగా సుమారు 4,000 పదములను వ్రాసినట్లు "వేడుకతో నడచుకొన్న విటరాయుడే" అను దేవగాంధారి పదములో చెప్పినాడు. కాని మనకు నేడు లభించినవి సుమారు 350 పదములు మాత్రమే. అందులో సుమారు నూరు పదములే స్వరయుక్తములై యున్నవి.

ఈతని అసలు పేరు “వరదయ్య" అని తెలియుచున్నది. అయితే ఇతడు అనేక దివ్యక్షేత్రములను సందర్శించి, క్షేత్రయ్య అని పేరొందెను. ఆయా దేవుళ్లపై పదములను మువ్వగోపాల ముద్రతో చేర్చి వ్రాసినవాడు క్షేత్రయ్య. దక్షిణదేశ తీర్థయాత్రను సలిపి క్షేత్రజ్ఞు డనిపించుకొన్న భ క్తశిఖామణి క్షేత్రయ్య. ఈ భక్తశిఖామణి పదునేడవ శతాబ్దికి చెందిన ప్రసిద్ధ వాగ్గేయకారుడు. ఇతడు క్రీ. శ. 1630 ప్రాంతములో, తంజావూరి నేలుచున్న రఘునాథ నాయకుని దర్శించెను. అతని కుమారుడగు విజయరాఘవ భూపాలుని కొలువుకూటములో పదకవిత్వ విశారదత్వమును, నటనాకౌశల్యమును ప్రకటించి ప్రభువుయొక్క మన్ననలను క్షేత్రయ్య చూరగొనెను. మరియు మధుర తిరుమలేంద్రుని యొక్కయు, గోలకొండ నవాబుయొక్కయు దర్బారులలో కూడ పదములను చెప్పి మెప్పుపొందెను. కళావ్యాప్తికై ఇట్లు కొంతకాలము గడపినను క్షేత్రయ్య అంతఃకరణమున విరాగియు, జ్ఞానియునై యుండెను. చరమదశలోకూడ ఇంటిముఖముపట్టక అజ్ఞాతముగా ఏకాంత భక్తియుక్తుడై ఎచ్చటనో దేవతా సన్నిధానమందు బ్రహ్మైక్యమును పొందియుండెను. క్షేత్రయ్య కవిగా, గాయకుడుగా, నటుడుగా, భక్తుడుగా పదకర్తలలో అగ్రగణ్యుడయ్యెను.

కవిత్వము : క్షేత్రయ్య పదములు పాడుటకును, చదివి ఆనందించుటకును, అనుకూలమైన రసకావ్యఖండములు. పద రచనయందు ప్రాస, యతి గణ నియమములను క్షేత్రయ్య బాగుగ పాటించెను. యమకములతోను. అంత్యప్రాసలతోను ఈతని పదములు మనోహరములుగ నుండును. శృంగార రసాధిదేవతలగు వివిధ నాయికల మనో భావములయొక్క లోతులకు అడుగంటదిగి వాటిని

156